Sunday 9 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునైదవసర్గ

                          రామాయణము 



                  అయోధ్యకాండ -పదునైదవసర్గ 

ఆ విధముగా రాజాజ్ఞను తీసుకుని రాజభవనం నుండి బయటకు వచ్చిన సుమంత్రుడికి బయట అనేక మంది ప్రముఖులు ,బ్రాహ్మణులు ,మంత్రులు ,జానపదులు ,జనములు కనిపించెను . వారందరూ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా మహోత్సాహముతో ఉండిరి . వారంతా సుమంత్రుడిని చూసి" రామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి . దశరథ మహారాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము అన్నీ సిద్ధముగా వున్నవి కానీ ఇంత వరకు మాకు మహారాజు గారి దర్శనము లభించలేదు . ముహూర్తకాలము సమీపించుతున్నది "అని పలికిరి . 
అప్పుడు సుమంత్రుడు "బాగుబాగు మీరంతా వచ్చిన విషయము ,మీరు రాజుగారి క్షేమ సమాచారం అడిగిన విషయము నేను రాజు గారు పూర్తిగా లేచిన తర్వాత తెలిపెదను . అని పలికి తిరిగి మహారాజు భవనము లోకి ప్రవేశించి ,ఆయన శయనించిన మంచము తెర కు కొద్దీ దూరములో నిలబడి ఆయనను ప్రశంసించుచు ,బయట అందరూ వేచివున్న విషయమును విన్నవించెను . ఇంకనూ శ్రీరామ పట్టాభిషేకమునకు కాలము సమీపించబోతోందని తెలిపెను . 
అప్పుడు దశరథ మహారాజు సుమంత్రుడితో "నేను నిన్ను నా శ్రీరాముని తీసుకురమ్మని ఆజ్ఞాపించితిని కదా !మరి ఇంకా జాగు ఎలా చేయుచున్నావు వెంటనే వెళ్లి నా శ్రీరాముని నా వద్దకు తీసుకురమ్ము . "అని ఆజ్ఞాపించెను . మహారాజు ఆజ్ఞను తీసుకున్న సుమంత్రుడు వెనువెంటనే బయలుదేరి శ్రీ రాముని బావనమునకు వెళ్లెను . మిక్కిలి మనోహరముగా శోభాయమానంగా ,వున్న భవనములు సముదాయములతో కూడి వున్న శ్రీ రాముని అంతఃపురము వద్దకు చేరెను . 

రామాయణము అయోధ్యకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                       శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

               












                      

No comments:

Post a Comment