Saturday 8 October 2016

రామాయణము అయోధ్యకాండ _పదునాల్గవసర్గ

                                 రామాయణము 

                   అయోధ్యకాండ _పదునాల్గవసర్గ 

ఆ విధముగా భరించలేని శోకముతో విలవిలలాడుతున్న దశరథ మహారాజు నేలపై పది ఉండగా ఆయన పరిస్థితిని ఏమాత్రము పట్టించుకొనక కైక తన వరములు తనకిమ్మని వత్తిడిచేసెను . దశరధుడు అశక్తుడై మిన్నకుండెను . 
తెల్లవారగ  అయోధ్య నగరమంతా పట్టాభిషేకమునకు అలంకరింపబడెను . వశిష్ఠుడు మేళతాళములతో తన శిష్యులతో అయోధ్యానగరములో ప్రవేశించెను . అప్పుడు వశిష్ఠుడు జనములతో, బ్రాహ్మణోత్తములతోకిక్కిరిసి వున్న వీధులను దాటి ,అంతః పురము సమీపమునకు చేరెను . సుమంత్రుడితో "నేను వచ్చిన విషయము మహారాజుగారితో విన్నవింపుము . పట్టాభిషేకము కొరకు సముద్ర జలములతో ,గంగాది నాదీ జలములతో నింపబడిన బంగారు కలశములు ,మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము ,వివిధములగు ధాన్యములు ,గంధములు ,నానావిధరత్నములు ,తేనెలు ,పాలు ,అందమైన ఎనిమిది మంది కన్యలు ,భద్రగజము ,నాలుగు గుఱ్ఱములు కట్టబడిన అందమైన రధము ,రాజఖడ్గము ,మేలైనధనస్సు ,పల్లకి ,గొడుగు ,తెల్లని వింజామరలు ,బంగారు పాత్ర ,బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము కల తెల్లని వృషభము ,నాలుగు కోరలు కల సింహము ,మిక్కిలి బలిష్టమైన మహాశ్వము ,సింహాసనము ,పెద్దపులిచర్మము ,ప్రజ్వలితాగ్ని ,వీణావేణు మృదంగ తాళవాద్య సమూహములు . దేవదాసీ గణము ,ఆచార్యులైన బ్రాహ్మణులు ,పవిత్రములైన గోవులు ,మృగములు ,పక్షులు ,పురజనులు ,ప్రముఖులు,జానపదులు ,వర్తకులు ,శిల్పులు అందరూ సమస్త వస్తువులు సిద్ధముగా ఉన్నవని కూడా మహారాజుగారి తెలియచేయుము "అని చెప్పెను . 
సుమంత్రుడు వశిష్టుని ఆదేశము తీసుకుని దశరథ మహారాజుకి జయము అని పలుకుచు ,ఆయన ,మందిరమున ప్రవేశించెను . ఆయనను ద్వారపాలకులు ఎవ్వరు నిరోధించలేదు . సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియక ,ఎప్పటియట్లు ఆయన ప్రశంసించుచు దోసిలొగ్గి నిలబడి "ఓ మహారాజా ! త్వరగా మేల్కొనండి . శ్రీరామ పట్టాభిషేకమునకు సమయము సమీపించబోతోంది . మంగళ స్నానములు చేయవలెను . పట్టాభిషేకమునకు కావలిసిన పనులకు ఆగాను ఇవ్వుడు . మీ కొరకు వశిష్ఠుడు ఏర్పాట్లతో ద్వారము నందు వేచి వున్నారు "అని పలికి మహారాజు గారి సమాధానము కొఱకు ఎదురుచూస్తూ నిలబడెను . 
 శోకభారములో మునిగిపోయిన దశరధుడు "కైకేయి మాటలతో మిక్కిలి దుఃఖంలో మునిగిపోయి వున్న నాకు  ఈ మాటలు పుండు మీద కారము చల్లినట్లు అనిపించెను . "అని పలికెను . సుమంత్రుడు దశరధుడి వచనములు విని చేతులు జోడించినవాడై ,తానున్న ప్రదేశము నుండి ఒక అడుగు వెనకకు వేసెను . మిక్కిలి దైన్యములో ఉండుటచే దశరధుడు  జరిగిన విషయమును చెప్పుటకు అశక్తుడయ్యెను . అప్పుడు కైక రాత్రంతా నిద్ర లేకపోవుటచే దశరథ మహారాజు ఇంకా పడుకునే వున్నారు . వెంటనే వెళ్లి శ్రీరాముని ఇచటకు తీసుకురమ్ము . "అని ఆజ్ఞాపించెను . 
అప్పుడు సుమంత్రుడు రాజాజ్ఞ కావాలి అని అంటాడు . అప్పుడు దశరధుడు "నా అందాలరాముడిని వెంటనే తీసుకు రమ్ము . . నా ప్రియా పుతృడిని వెంటనే చూడ దలిచాను" అని పలికెను. రాజాజ్ఞను తీసుకొని సుమంత్రుడు రాముని తీసుకురావటానికి అంతః పురమునుండి బయటకు వచ్చెను . అక్కడ కోకొల్లలుగా వున్న జన సమూహములను, బ్రాహ్మణులను  చూసేను .

రామాయణము అయోధ్యకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

              శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .  













 

No comments:

Post a Comment