Thursday 27 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదియెనిమిదవసర్గ

                                       రామాయణము 

                                అయోధ్యకాండ -ఇరువదియెనిమిదవసర్గ 

సీతాదేవి పలుకులు ధర్మసమ్మతములే అని తెలిసి కూడా శ్రీరాముడు ఆమెపై కల ప్రేమతో వనములలో సంభవించు కష్టములను గూర్చి ఆలోచించుచు ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళుటకు సిద్దపడకుండెను . అంతట ఆ ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపించుచు సీతాదేవిని ఓదార్చుచు ,ఆమెను తన సంకల్పమునుండి మరల్చుటకు ఇలా పలుకసాగెను . 
"ఓ సీతా !నీవు ఉత్తమ వంశమున జన్మించితివి . ఎల్లప్పుడూ ధర్మాచరణ నందే నిరతురాలవి . కనుక ఇచటనే ఉండి నీ ధర్మములు ఆచరించుము . నా మాటలు విను . వనములలో అనేక కష్టాలు ఎదురవుతాయి . నిర్జనారణ్యములలో స్వేచ్ఛగా విహరించు మత్తిల్లిన సింహములు ,పెద్దపులులు మొదలగు క్రూరమృగములు మనల్ని చూసి చంపుటకై వచ్చి మీద పడును . అడువులలోని నదులన్నీ మొసళ్లతోను ,బురదతోను నిండి దాటుటకు వీలులేకుండా ఉండును . అంతేకాక అక్కడ మదపుటేనుగులు స్వేచ్ఛగా తిరుగుతూ భయముగొలుపుచుండును . అరణ్యములు కష్టములకు ఆలవాలములు . త్రోవలో ముళ్ళు కాళ్లకు గుచ్చుకుని బాధ కలిగించును . 
వనములలో నివశించువారు నేలమీదనే రాలిన ఆకులపైనే పరుండవలెను . అక్కడ హంసతూలికా తల్పములు వుండవు . రాలిన పండ్లను మాత్రమే భుజించవలెను . నియమ పూర్వకముగా స్నానాదులను ఆచరించుచు నిష్టా జీవితము గడపవలెను . నదులను ఆశ్రయించి వుండే మహా సర్పాలు వంకరటింకరగా ప్రాకుచూ దారులకు అడ్డముగా చేరి ప్రమాదకారములై ఉండును . వివిధరకములగు విష సర్పములు బుసలు కొట్టుచు అచటి నేలపై అనుక్షణము తిరుగుచుండెను . ఇంకా అక్కడ మిడతలు తేళ్లు ,మండ్రగబ్బలు ,విషపురుగులు ,అడవి ఈగలు ,దోమలు మొదలగు వాని బాధ చెప్పనలవిగా ఉండును . 
అడవులలో ముండ్ల చెట్లు ,మొందేరిన దర్భలు ,రెళ్ళు గడ్డి మొదలగున్నవి కలగచేయు కష్టములకు అంతే ఉండదు . అరణ్యములలో నివసించేవారు పెక్కు శారీరిక కష్టములను ,నానా విధములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండును . కనుక ఓ మైథిలీ !సుకుమారి అయిన నీకు దుర్భరమైన వాన జీవనము ఏ మాత్రము తగదు . అందువలన వనగమనాభిలాష విడనాడితే మంచిది . "
శ్రీరాముడు తనను వనములకు తీసుకువెళ్ళుటకు ఇష్టపడుట లేదు అని గ్రహించిన సీతాదేవి ,ఆయన మాటలను ఆమోదించలేక కడు దుఃఖిత ఐ  రఘురామునితో ఇలా పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment