Wednesday 26 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదియేడవసర్గ

                           రామాయణము 

                   అయోధ్యకాండ -ఇరువదియేడవసర్గ 

సీతాదేవి సహజముగా ప్రియభాషిణి . శ్రీరాముడి మాటలు తన మనస్సుని ఎంతో నొప్పించుటచే ఆయనపై కల ప్రేమతో ఈ విధముగా పలికెను . "ఓ రామా !ఇలా అర్ధరహితముగా ఎలా పలుకుచున్నారు ?ఇంతకూ మునుపెన్నడూ మీ నోటి వెంట నుండి ఇటువంటి మాటలు విని వుండలేదు . ఓ పురుష శ్రేష్టా !భార్య భర్తకు అర్ధాంగి . కావున భర్త యొక్క భాగ్య ఫలమును పొందుటకు భార్య అర్హురాలు . అందువలన 'వనములో నివసింపుము 'అని మహారాజు మీ కిచ్చిన ఆదేశము మీ భార్య అయిన నాకు నూ వర్తించును . కనుక నేను కూడా మీతో కలసి వనవాసము చేయవలసి వున్నది . 
ఇహలోకమునందు పరలోకమునందు  సతులకుపతియే గతి . ఓ రఘోత్తమా !మీరు  ఇప్పుడే దండకారణ్యములకు బయలుదేరినచో నేనును మీతో కూడి వచ్చెదను . ఆ అరణ్యములో నేను మీ ముందు భాగమున నడుచుచు .దర్భలు ,ముండ్లను తొలగించుచు మీ మార్గమును చదును చేయుచు మార్గము సుగమము చేయుదును . సమస్త సుఖములకు నిలయమైన రాజభవనములలో నివసించుట కంటే ,స్వర్గ లోకములలో విమానములలో విహరించుట కంటే ఎన్ని కష్టములు అనుభవించవలసి వచ్చినను పతిఅడుగుజాడలలో  సాగిపోవుటయే సతికి సుఖప్రదము ,శుభప్రదము ,ధర్మసమ్మతము ,సంతోషదాయకం . 
భర్తతో కూడి మసలుకోవలిసిన విషయమున మా తల్లితండ్రులు చక్కగా భోద చేసిరి . జనసంచారం లేక వివిధ మృగములతో నిండి ,క్రూర మృగములు సంచరించునట్టి కీకారణ్యముల యందు మీ వెంట నేను నిర్భయముగా నడవగలను . ఓ మహావీరా !నియమనిష్టలతో బ్రహ్మచర్యము పాటించుచు నేను నిత్యమూ మీకు శుశ్రూషలు చేయుచుందును . ఆర్యా !అన్నపానాదుల విషయములో మీకు నేను ఎట్టి కష్టము కలిగించను . మీతో పాటు నిస్శం కోచముగా కందమూలాదులను ఆహారముగా తీసుకుంటూ గడిపెదను . 
ఓ ప్రాణనాథా !నా హృదయము నందు నిన్నే పూర్తిగా నిలుపుకుని వున్నాను . నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తధ్యము . నా ప్రార్ధన మన్నించి ,నన్ను మీ వెంట తీసుకుపొమ్ము . నేను అచట మీకు ఏవిధముగాను భారము కాను ". అని పలికెను . 
సీతాదేవి ఈ విధముగా పలుకుచున్నను ,వనములలో ఎదురగు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడై వనములో వుండే కష్టముల గురించి ఆమెకు వివరింపసాగెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment