Friday 14 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునెనిమిదవసర్గ

                          రామాయణము 


                 అయోధ్యకాండ -పదునెనిమిదవసర్గ 

శ్రీరాముడు తండ్రిని చూడగానే వినమ్రుడై ఆయనకు పాదాభివందనం చేసెను . పిమ్మట కైక కు కూడా పాదాభివందనం చేసెను . అట్లు శ్రీరాముడు పాదయాభివందనము చేయగానే దీనుడై ఉన్న దశరధుని నోటి వెంటనుండి "తండ్రీ రామా !"అనెడి మాటలు వెలువడినాయి వెనువెంటనే దశరధుని కనుల వెంట అశ్రువుల దారాలు కురిసెను . పిమ్మట గొంతు పెగలలేకపోయెను ,కనులు చూడలేకపోయెను . 
ఇదివరలో ఎన్నడును చూడని దశరధుని భయావహరూపమును చూసి శ్రీరాముడు దిగ్భ్రాంతికి లోనయ్యేను . ఊహలకు అందని దశరధుని శోక పరిస్థితికి విచారపడుచు శ్రీరాముడు మిక్కిలి కలవరపాటుకు లోనయ్యేను . తనలో తానూ తండ్రి ఇంతగా భాదపడుటకు కారణమేమి ?అని తర్కించుకొనెను . 
పిమ్మట దీనవధానుడై కైకేయిని సమీపించి "తల్లీ !తండ్రి ఇంతగా దుఃఖించుట నేను మునుపెన్నడూ చూసి ఎరుగను . ఆయన దుఃఖమునకు కారణమేమి ?శారీరికంగా కానీ మానసికముగా కానీ ఆయనకు ఎట్టి బాధలు కలుగలేదుకదా !వేదనతో అడుగుతున్నాను వాస్తవము తెలుపుము . "అని కోరెను . ఆ విధముగా అర్ధించిన రామునితో కైకేయి 
"ఓ రామా !నీ తండ్రికి అట్టి బాధలు ఏమియు లేవు . ఆయనకు నీవు మిక్కిలి ప్రియమైనవాడవు . అట్టి నీతో అప్రియ వచనములు పలుకుటకు ఆయనకు నోరు రావటంలేదు . ప్రతిజ్ఞా పూర్వకముగా ఆయన నాకొక మాట ఇచ్చినాడు . ఇప్పుడు ఆ విషయమున పామరుడి వలె పశ్చాత్తాపపడుతున్నాడు . రాజు నాకిచ్చిన మాటను నీవు తీర్చెదనని మాట ఇస్తే దాని గురించి నీకు చెబుతాను . దానిని అతడు నీకు స్వయముగా చెప్పలేడు . "అని పలికెను . 
ఆ మాటలు విని శ్రీరాముడు మిక్కిలి బాధపడి నీవు ఇలా పలుకుట నాకు సిగ్గుచేటు . రాజాజ్ఞ అయినచో అగ్నిలోనైనా దూకెదను . అతడాదేశించినచో తీవ్రమైన విషమును సైతము తాగెదను . సముద్రమునైనా పడిపోయెదను . ఆయన నీకిచ్చిన మాట ఏమిటో తెలుపుము నేను దానిని తప్పక నెరవేర్చెదను . రాముడు అసత్యమాడడు "అని పలుకగా 
కైకేయి "ఓ రఘురామా !పూర్వము దేవాసుర సమయములో నీ తండ్రి మిక్కిలి గాయపడగా నేను ఆయనను రక్షించితిని . దానికి మెచ్చి ఆయన నాకు ధనుర్భాణముల సాక్షిగా రెండు వరములను ఇచ్చెను . వాటిని నేను ఇప్పుడు కోరుకుంటిని . అవి 1. భరతుడికి యువరాజుగా పట్టాభిషేకము . 
                                         2. నీవు ఇప్పుడే దండకారణ్యమునకుఁ వెళ్ళుట . 

ఆ రెండు వరములు కోరిన కారణముగా ఈ మహారాజు నీమీద ప్రేమాతిశయముచే శోకమున కుమిలిపోవుచు వాడిన ముఖంతో నీవైపు చూడలేకున్నాడు "అని పలికెను . 
దశరధుడు తన కుమారుడు పడబోయే కష్టములను తలచుకుని కుమిలిపోసాగెను . 

రామాయణము అయోధ్యకాండ పదునెనిమిదవసర్గ సమాప్తం . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















No comments:

Post a Comment