Tuesday 30 April 2019

రామాయణము సుందరకాండ -నలుబదిఒకటవసర్గ

                                  రామాయణము 

                               సుందరకాండ -నలుబదిఒకటవసర్గ 

సీతాదేవిని దర్శించుట అనే ముఖ్యకారణము ముగిసినది ,ఇంకనూ చేయవలసిన కార్యమేమి అని హనుమ ఆలోచించసాగెను . సామదానబేధదండోపాయములలో మొదటి మూడిటితో ఇక్కడ పనిలేదు కావున ఆఖరిది ఐన దండోపాయము ప్రయోగించి రావణుని బలము తెలుసుకోవాలని హనుమ భావించెను . చెప్పిన పనిని చక్కగా పూర్తిచేయుటే కాక దానిని సంభందించిన ఇతర పనులను కూడా చేయువాడే సమర్ధుడు . కావున ఇప్పుడు నేను ఈ లంకా నగరములో కల రాక్షసుల  బలములు, యుద్ధ నైపుణ్యములు ,మంత్రులను తెలుసుకుని సుగ్రీవుడి వద్దకు వెళ్ళినచో యుద్ధ ప్రణాళిక వేయుటకు అనువుగా ఉండునని ఆలోచించెను . 
వీరికి యుద్ధమునకు రెచ్చగొట్టుటకు తగిన ఉపాయమేదని  అలోచించి ,తానూ వున్న ఆ  సుందరమైన అశోకవనమును ధ్వంశము చేయుట ద్వారా వారిని రెచ్చకొట్టవచ్చునని ,తద్వారా తనను ఆపుటకు వచ్చిన రాక్షసులందరినీ తుడా ముట్టించి సుగ్రీవుడి వద్దకు వెళ్లవలెనని నిర్ణయించుకొనెను . పిమ్మట అక్కడ బాగుగా పుష్పించి చక్కగా ఉన్న చెట్లను పీకివేయుట ,వాటి కొమ్మలను విరుచుట ,విరిచిన వాటిని మిగిలిన వాటి మీద విసిరికొట్టుట మొదలగు పనులు చేస్తూ రాక్షసులకోసము ఎదురుచూడసాగెను . 


రామాయణము సుందరకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -నలుబదియవసర్గ

                                   రామాయణము 

                                  సుందరకాండ -నలుబదియవసర్గ 

హనుమంతుడి మాటలు విన్న సీతాదేవి "మారుతీ !ఇక్కడ నేను పడుతున్న నరక యాతనను శ్రీరామునికి వివరించి చెప్పు "అని పలికెను , హనుమ సీతాదేవి చెప్పిన మాటలన్నీ విని ఉత్తర ముఖంగా వెళ్ళుటకు సిద్దపడెను . 

రామాయణము సుందరకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -ముప్పది తొమ్మిదవసర్గ

                                          రామాయణము 

                                                    సుందరకాండ -ముప్పది తొమ్మిదవసర్గ 

శిరోభూషణము ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమతో "ఓ కపివరా !ఈ మణిని చూసిన వెంటనే శ్రీరాముడు నా తల్లిని ,తండ్రిని, నన్ను గుర్తుకుతెచ్చుకొనును . పిమ్మట కార్యాచరణను ఆలోచించును . ఓ హనుమా !శీఘ్రముగా కార్యసిద్ధికి ఆలోచన చేయుము . ఈ కార్య నిర్వహణకు నేవే తగినవాడవు . ఓ మారుతీ !నడుము బిగించి ,నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము . " పలికెను . ఆ మాటలు విన్న మారుతి "అట్లే చేయుదును "అని ప్రతిజ్ఞ చేసెను . హనుమ బయలుదేరుతుండట గమనించిన సీతాదేవి "ఓ హనుమా !రామలక్ష్మణులిద్దరి కుశలం నేను అడిగానని చెప్పు . శ్రీరాముని మిత్రుడైన సుగ్రీవ మహారాజుని కుశలం  అడిగానని చెప్పు . వానరభల్లూక సైన్యము మొత్తమును వారివారి వయస్సు వారీగా క్షేమము అడిగానని చెప్పు . ఈ రోజు ఇక్కడే విశ్రమించి రేపు ఉదయమే బయలుదేరి వేళ్ళు. మళ్లీ నీవు వచ్చువరకు నేను ప్రాణములతో వుంటానోలేదో ? "అని పలికెను . 
అప్పుడు హనుమ "అమ్మా !నేను వెళ్లిన వెంటనే శీఘ్రముగా శ్రీరామచంద్రమూర్తి తన సైన్యముతో కలిసి ఇచటికి వచ్చి నిన్ను ఈ చార నుండీ విడిపించగలడు . నీవు అధైర్యపడవద్దు . గడువులోపలే శ్రీరాముడు నిన్ను చేరును . "అని పలికెను . అప్పుడు సీతాదేవి "వానరభల్లూక సైన్య విషయములో నాకొక సందేహము కలుగుచున్నది . నీవు సమర్థుడవు కావున సముద్రమును దాటి వచ్చావు . మరి రాజకుమారులు సుగ్రీవమహారాజు ,వానరభల్లూక సైన్యములు ఆ మహా సముద్రమును దాటి ఎలా రాగలవు ?"అని ప్రశ్నించెను . 
దానికి సమాధానముగా హనుమ "అమ్మా !దివ్యమంగళ స్వరూపిణీ !సుగ్రీవమహారాజు వద్ద నాకంటే బలశాలురు అనేకులు కలరు . వారు భూమిపైనా ,ఆకాశములో ,నీటిలోనూ మూడువిధములుగా వెళ్ళగలరు . సాధారణముగా దూతగా సామాన్యులనే పంపును కదా !(సీతాదేవికి దైర్యముకలిగించుటకై  హనుమ ఈ విధముగా మాట్లాడేను ) సుగ్రీవమహారాజు యావత్ సైన్యము అవలీలగా సముద్రమును దాటి రాగలరు . రామలక్ష్మణులిద్దరిని నా భుజములపై ఎక్కించుకుని తీసుకురాగలను . మనసులో ఏ మాత్రము వ్యాకుల పడవద్దు . అతి త్వరలోనే అతి పెద్దదైన వానర భల్లూక సైన్యముల కోలాహలమును నీవు వినగలవు . ఈ రాక్షసులను పరిమార్చి నీ వద్దకు వచ్చిన శ్రీరామ ప్రభువును చూడగలవు "అని ధైర్యవచనములు పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము సుందరకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                             రామాయణము 

                            సుందరకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

సీతాదేవి పలికిన మాటలు విని హనుమ సంతోషముతో "తల్లీ !నీ మాటలు సహేతుకములు ,పాతివ్రతలానమ్రతకు తగినవి . నీవంటి పతివ్రతా శిరోమణికి ఆ లోకోత్తమ మూర్తియే తగినవాడు . సరే తల్లి నీకు నాతొ రావటం ఇష్టములేకపోతే ,నీ ఆనవాలుగా ఏదైనా ఇవ్వు "అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి "ఓ వానరశ్రేష్టా !నాకూ శ్రీరామునికి మాత్రమే తెలిసిన ఒక కధ చెబుతాను . దానిని నా గుర్తుగా శ్రీరామునికి చెప్పు "అని కధ ఇలా చెప్పసాగెను "చిత్రకూటపర్వతము ఈశాన్యభాగమున ఒక చిన్న పర్వతము కలదు . అక్కడ ఫలమూలములు ,ఉదకము సముద్దిగా ఉంటాయి . ఆ ప్రదేశములో మందాకినీ నదీ సమీపమున ఒక సిద్దాశ్రమములో కొంతకాలము శ్రీరామునితో కలిసి ఉన్నాను . 
ఒక రోజు నేను అక్కడి వనములలో ,నదీ తీరములలో విహరించి అలసి శ్రీరాముని చెంత కూర్చుని ఉండగా ఒక కాకి (ఇంద్రుని వరము వలన జన్మించినది )వచ్చి మాంసము మీది ఆశతో నన్ను పొడవసాగెను . నేను చేతులతో అదిలించసాగాను . కానీ అది పోకుండా నన్నే పొడవసాగెను . నేను అక్కడ వున్న మట్టి బిడ్డలు దాని మీద వేసి అదిలించే ప్రయత్నమూ చేసాను . కానీ అది ఎంతకూ పోవటం లేదు అలా దానిని బెదిరించు సమయములో  నా వడ్డాణము జారుటచే నేను సరిచేసుకోవడం చూసి ,శ్రీరాముడు నవ్వేను . 
అప్పుడు నాకు సిగ్గుగా అనిపించెను . కొంతసేపటికి శ్రీరాముడు నా వొడిలో నిద్రించెను . అప్పటికీ కాకి బాధ నాకు తప్పలేదు . శ్రీరాముడు నా వొడిలో పడుకుని ఉండుటచే నేను లేచి కాకిని అదిలించలేకపోయాను . దానితో అది ఇంకొంచుం విజృంభించి నన్ను పొడవసాగెను . నేను ఎంత అదిలించినా అదిపోక నన్ను పొడుచుతుండుటచే అది పొడిచినచోట రక్తము కారసాగెను . ఆ రక్తము శ్రీరామునిపై పడి ఆయనకు మెలకువ వచ్చెను . నిద్రలేచిన శ్రీరాముడు రక్తమోడుతూ ఉన్న నన్ను చూసి  మిక్కిలి క్రుద్ధుడై "భయంకరమైన సర్పము పడగ తాకుటకు చూసినట్టు నీ జోలికి వచ్చినవాడెవడు ?వాడిని ముల్లోకములలో రక్షించువాడెవ్వడూ ఉండడు "అని పలికి ఎదురుగా వున్న వాయసము (కాకి )ని చూసి తన దగ్గరలో వున్న దర్భను తీసుకుని బ్రహ్మాస్త్రముగా మంత్రించి కాకి మీదకు ప్రయోగించెను . అది నిప్పులు కక్కుతూ కాకివైపుగా వెళ్లగా ,అది తన ప్రాణ రక్షణ కొఱకు లోకాలన్నీ తిరిగేను 
తనతండ్రి ఐన ఇంద్రుడు కానీ ,సమస్త దేవతలు కానీ కాకికి అభయము ఇవ్వలేకపోవుటచే అది తిరిగి మా దగ్గరకే వచ్చి శ్రీరాముని పాదములపై వాలి ఆయనను శరణు వేడెను . శరణు వేడినంతనే శ్రీరాముడు కరుణించి ఆ కాకిని క్షమించి వదిలివేసెను "ఈ కధ శ్రీరామునికి చెప్పు ఇంకా ఆయనతో "ఓ ప్రాణనాథా !మీరు  వచ్చి నన్ను కాపాడతారనే ఆశతోనే ఇన్నిరోజులూ జీవించివున్నాను . పరాక్రమమును నీకు సాటి ఐన వారు ఈ భూమండలముపై ఎవరూలేరు . నీవు తలుచుకున్నచో ఈ రాక్షసులందరినీ క్షణకాలంలో మట్టుపెట్టగల సమర్థుడవు . మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నావు . అతి త్వరగా వచ్చి నాకు నీ దర్శన భాగ్యము కలిగించు . నాకు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువు వున్నదినీ గడువు లోపల నీవు నా కొరకు రాలేకపోతే ఈ జన్మలో ఇక నేను నిన్ను చూడలేను . నా యందు దయ ఉంచి త్వరగా వచ్చి నన్ను రక్షించు చి చెప్పు "అని కన్నీరు కారుస్తూ హనుమతో పలికెను . 
ఆ మాత  కన్నీరు చూసిన హనుమ మిక్కిలి బాధతో అమ్మా !బాధపడకు ,నేను వెళ్లిన వెంటనే శ్రీరాముడు సుగ్రీవసహితుడై ,వానర భల్లూక సైన్యముతో కలిసి వచ్చును నిన్ను తప్పక రక్షించును . శ్రీరామునికి ,లక్ష్మణునికి నీ మాటగా ఏమి చెప్పమంటావు ?"అని పలుకగా సీతాదేవి "శ్రీరాముని పాదపద్మములకు నా ప్రణామములు తెలుపు లక్ష్మణుని నేను అడిగానని చెప్పు "అని పలికి తన చీర కొంగులో వున్నా చూడామణిని హనుమకు ఇచ్చినది . 



సీతాదేవి ఇచ్చిన చూడామణిని కళ్ళకు అద్దుకుని దానిని చేతికి పెట్టుకొనెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియెనిమిదవసర్గ సమాప్తము . 

                          శశి 

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Monday 29 April 2019

రామాయణము సుందరకాండ - ముప్పది ఏడవసర్గ

                                  రామాయణము 

                                   సుందరకాండ - ముప్పది ఏడవసర్గ 

అంజనీసుతుడైన హనుమ మాటలు విన్న సీత "ఓ  వానరోత్తమా !విధివశము ఇదేకదా చక్కగా అంతః పురములో రాజుస్సుఖములు అనుభవించవలసి న వాళ్లమైన రామలక్ష్మణులు నేను అరణ్యములోకి వనవాస నిమిత్తము ప్రవేశించాము అక్కడ బానే వున్నాము అనుకునేలోపల రాక్షసుడి చేత అపహరించబడి ఈ రాక్షస చెరలోకి చేరి యాతన పడుతున్నాను . అధముడైన రావణుడు నాకు ఒక సంవత్సరకాలం గడువు విధించెను . ఇప్పుడు పడవనేల గడుచుచున్నది ఇంకా రేడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నది . ఈ గడువు వరకే నేను ప్రాణములతో వుంటాను . కావున త్వరగా నా వద్దకు వచ్చి నన్ను రక్షించమని చెప్పు "అని పలికెను . 
అప్పుడు హనుమ "అమ్మా !శ్రీరాముడు నా మాట వినినంతనే కోట్లాదిగా కల వానరభల్లూక సేనలతో కూడి ఇక్కడకు శీఘ్రముగా రాగలడు . అంతదాకా ఎందుకు ?ఇప్పుడే నేను నిన్ను తీసుకువెళ్లి ,నీ దర్శనము కోసము వేచి చూస్తున్న శ్రీరాముని వద్దకు నిన్ను చేర్చగలను . నేను తలచుకుంటే దుష్టుడైన రావణాసురిడితో సహా ఈ లంకా నాగరిని మొత్తము ఎత్తుకెత్తి నా ప్రభువు శ్రీరాముని కాళ్ల దగ్గర పడవేయగలను . మిమ్ము భుజములపై ఎక్కించుకుని శ్రీరాముని చెంతకు చేర్చుతాను . నేను వేగముగా ఎగురునపుడు నన్ను అందుకొనుట ఎవరితరమూ కాదు . అగ్నిదేవుడు హవ్యమును మోసుకుపోవునట్లు నేను మిమ్ము మోసుకుపోగలను " అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి "ఓ వానరోత్తమా నేవే చిన్నగా వున్నావు . నీకంటే పెద్దగా వున్న నన్ను ఎలా మోసుకుపోగలవు ?అని అడిగెను . అది తనకు అవమానంగా భావించిన హనుమ వెంటనే తన దేహమును పెంచి తన బృహద్రూపమును సీతామాతకు చూపించెను . అప్పుడు సీతాదేవి "ఓ వానరోత్తమా !నీవు సముద్రమును లంఘించి వచ్చినావని తెలిసినపుడే నీ శక్తి సామర్ధ్యములను అంచనా వేసాను . ఇప్పుడు నీ ఈ రూపము చూసిన పిమ్మట నాకు ఇంకా నమ్మకము కలిగినది . నన్ను బలవంతముగా తీసుకువచ్చిన ఈరాక్షసుడికి తగిన బుడ్డి చెప్పి నా ప్రభువే నన్ను గౌరవంగా తీసుకువెళ్లవలెను . అదే నాకు మర్యాద ఆయన శక్తిసామర్ధ్యములకు మర్యాద . అదీకాక నేను పతివ్రతము నా భర్తను తప్ప మారె పర పురుషుడిని తాకనే తాకను . ఈ రావణుడు నన్ను బలవంతముగా తీసుకుని వచ్చినప్పుడు అతడి శరీర స్పర్శ నాకు తగిలినది కాని అది నేను కావాలని చేసినది కాదు . పైగా అప్పుడు నేను అశక్తురాలను . ఆ దుష్ట రావణునికి బదులు చెప్పి నా స్వామి నన్ను అతి త్వరలోనే తీసుకువెళ్లును ఇది నా పరిపూర్ణవిశ్వాసము . ఆ విశ్వాసము వల్లనే నేను ప్రాణములతో వున్నాను . మృత్యుదేవత రావణునికి అతి సమీపములో వున్నది . ఇది నిజము . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము

                               రామాయణము 

                              సుందరకాండ -ముప్పదిఆరవసర్గ 

మహాతేజశ్శాలీ ఐన వాయునందనుడు సీతాదేవికి ఇంకా విశ్వాసము కలిగించుటకు "అమ్మా !నేను వానరుడను శ్రీరాముని దూతను శ్రీరాముడు పంపగా ఇక్కడికి వచ్చాను "అని పలికి శ్రీరాముడు తన గుర్తుగా సీతాదేవికి ఇచ్చుటకు ఇచ్చిన ఉంగరమును సీతాదేవికి సమర్పించెను . 
ఆ ఉంగరమును చూసిన సీతాదేవి నిజముగా తన భర్తను తిరిగి పొందినంత పరమానందం పొందెను . పిమ్మట హనుమపై పరిపూర్ణ విశ్వాసము కలిగినదై "ఓ వానరా !నీకు శుభమగుగాక !నిజముగా నీవు గొప్ప వీరుడవు ,సమర్థుడవు . కనుకే వందయోజనములు దూరము వ్యాపించి వున్న సముద్రమును దాటి రాగలిగావు . ఆణువణువూ రక్కసుల కాపలాలతో నిండి వున్న ఈ లంకా నగరిలో వారందరిని తప్పించుకుని నావద్దకు చేరగలిగావు . శ్రీరాముడు సర్వసమర్దుడు . ఆయన కార్యములకు యోగ్యులను మాత్రమే నియమించును . శ్రీరామచంద్ర ప్రభువు ఎలా వున్నారు . లక్ష్మణుడు కుశలమేనా ?అయోధ్యలోని వారి కుశల సమాచారం తెలియవచ్చుచున్నావా ?శ్రీరాముడు నన్ను తీసుకువెళ్ళుటకు ఎందుకు రావటంలేదు . ఆయన నన్ను మరువలేదు కదా !"అని పలికి సమాధానము కోసము మారుతిని చూసేను . 
అప్పుడు మారుతి "అమ్మా !శ్రీరాముడు సత్యసంధనుడు ,ఏకపత్నీవ్రతుడు ఆయన మిమ్ములను మరచుట జరగని పని . ఆయన అనుక్షణమూ మిమ్ములనే కలవరించును .  శ్రీరామచంద్రప్రభువు కేవలము దేహమును నిలబెట్టుకొనుటకు మాత్రమే ఆహారము తీసుకొనును . అసలు నిద్రే పట్టదు . ఒకవేళ పట్టినా సీతాసితా అని కలవరిస్తూ ఉలిక్కిపడి లేచును . ఆయనకు అనుక్షణమూ మీ ద్యాసే . కొంచం అందముగా ప్రకృతీ కనిపించినా మిమ్ములనే తలుచును ఆయనకు మీరు ఇక్కడున్న సంగతి తెలియదు . అందుకే ఇంకా రాలేదు . నేను వెళ్లి ఆ ప్రభువుకి సమాచారము ఇవ్వగానే ఆయన వచ్చి సముద్రమును అతలాకుతలం చేసి లంకానగరము చేరును . ఇక్కడి రాక్షసులందరిని మట్టి కరిపించి మిమ్ములను ఆయనతో తీసుకువెళ్లును . "అని పలికెను . 
రామలక్ష్మణుల సమాచారం తెలిసినందుకు సీతాదేవి మిక్కిలి సంతోషించెను . వెంటనే శ్రీరాముడు తన వలన వేదనపడుతున్నాడని ఆమె కూడా బాధపడెను . 

రామాయణము సుందరకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Friday 26 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదియైదవసర్గ

                               రామాయణము 

                                సుందరకాండ -ముప్పదియైదవసర్గ 

హనుమంతుడి మాటలు విన్న సీతాదేవి హనుమతో "ఓ వానరా ! నిజముగా శ్రీరాముని దూతవే అయితే ఆయన గుణగణాలను వర్ణించు ,శ్రీరామునికి సుగ్రీవునికి స్నేహము ఎలా కుదిరినదో నాకు వివరముగా చెప్పుము . "అని పలికెను . అప్పుడు మారుతి 
శ్రీరాముని రూప లావణ్యమును ,అందచందములను చక్కగా వివరించెను . ఇంకా శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కలిగిన విధానమును కూడా వర్ణించెను . ఇంకా "ఓ మాతా !ఒకనాడు నేను ,మా ప్రభువైన సుగ్రీవుడు ఇంకా కొంత మంది వానరప్రముఖులు కలిసి ఋష్యమూక పర్వతముపై కూర్చుని ఉండగా ఒక ఉత్తరీయములో కట్టబడిన నగల మూట మా మధ్యలో పడెను . తలా పైకెత్తి చూడగా ఒక రాక్షసుడు సుందర రూపము కల స్త్రీని అపహరించుకు పోతున్నాడు . ఆ నగల మూటను మా ప్రభువైన సుగ్రీవుడు జాగ్రత్తపరిచేను . తదుపరి కొంతకాలమునకు శ్రీరామచంద్రప్రభువు మిమ్ములను వెతుకుతూ వచ్చినపుడు మేము ఆ నగల మూటను ఆయనకు చూపినాము . అప్పుడు ఆ ప్రభువు ఆ నగలను చూసి వాటిని గుర్తించి వెంటనే స్పృహ తప్పి పడిపోయెను . అప్పుడు నేనే ఆయనను అతి కష్టము మీద లేవదీసి కూర్చుండపెట్టితిని . ఆయనను ఊరడించుట చాలా కష్టమైనది "అని తదితర విషయములన్నిటిని వివరముగా చెప్పెను . 
పిదప "ఓ మైథిలీ !విషయములన్నీ సవివరముగా నీకు వివరించాను . నీవు ఊరడిల్లినట్లయితే నేను వెళ్తాను . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 18 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదినాల్గవసర్గ

                                 రామాయణము 

                                 సుందరకాండ -ముప్పదినాల్గవసర్గ 

 సీతాదేవి మాటలు విని హనుమ ఆమెను ఓదార్చుచు "అమ్మా !నేను రాముని దూతను ,రామలక్ష్మణులు ఇద్దరూ క్షేమముగా ఉన్నారు . శ్రీరాముడు మీ కుశలము అడగమన్నారు . లక్ష్మణుడు మీకు శిరసు వంచి నమస్కారము చేశానని చెప్పినాడు . "అని పలికెను . రామలక్ష్మణుల గురించి వినగానే ,సీతాదేవి మనసు కొంచం తేలికపడినట్టు అయ్యెను . ఆమె ముఖము వికసించెను . అది చూసి ,దూరముగా ఉన్న హనుమ కొంచం దగ్గరగా వచ్చెను . ఆలా హనుమ దగ్గరకు రావటం చూసిన సీతాదేవి హనుమను రావణుడేమో అని భయపడెను . 
"సాధారణుడైన వానరుడు సముద్రమును దాటి వచ్చుట అసాధ్యమైన పని . కనుక ఇతడు తప్పకుండా రావణుడే అయి ఉంటాడు . పూర్వము ఆశ్రమమునకు సాదు వేషములో వచ్చి నన్ను అపహరించాడు . ఇప్పుడు ఈ వేషములో వచ్చి నా మనసు మార్చాలని ప్రయత్నించుచున్నాడు కాబోలు "అని సీతాదేవి తనలోతాను అనుకొనెను . అప్పుడా సాధ్వి మారుతి తో "వానర రూపమున వున్న నీవు రావణునివే . నీవు ఎంతగా ప్రయత్నించినా ఫలితము ఉండదు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న హనుమ "తల్లీ !నీ భయములో అర్ధము వున్నది . కానీ నేను వాయుసుతుడైన హనుమను . నా తండ్రి అనుగ్రహము వలన నాకు దేవతల వలన వచ్చిన శక్తి సామర్ధ్యముల వలన నేను సముద్రలంఘనము చేసి వచ్చినాను . శ్రీ రామునికి మిత్రుడైన సుగ్రీవునికి నేను మంత్రిని . శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము నిన్ను వెతుకుతూ ఇచటికి వచ్చినాను . అంతేకాదు త్వరలోనే శ్రీరాముడు సుగ్రీవుడు పెక్కు మంది వానరభల్లూక సైన్యముతో ఇచటికి వచ్చును . ఇది నిజము . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పది నాల్గవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము సుందరకాండ -ముప్పదిమూడవసర్గ

                                         రామాయణము 

                                          సుందరకాండ -ముప్పదిమూడవసర్గ 

సీతాదేవి తనను చూసిన పిమ్మట హనుమ నెమ్మిదిగా ఆ అశోకవృక్షము దిగి సీతాదేవికి ఎదురుగా వచ్చి నిలబడెను . ఆ సమయములో రాత్రంతా కాపలా కాసిన రాక్షస స్త్రీలు అల్సటచే ఎక్కడివారక్కడ నిద్రపోయిరి . అప్పుడు హనుమ సీతాదేవితో "అమ్మా !ఓ దివ్య మంగళ రూపినీ !నీవు ఎవరు ?నువ్వు చూచుటకు రాజవంశపు స్త్రీ వలె ఉన్నావు . నేను శ్రీరాముని ధర్మపత్ని ఐన సీతాదేవిని వెతుకుతూ ఇచటికి వచ్చాను . మా దైవము రామచంద్రుడు చెప్పిన పోలికలు నీలో కనిపించుచున్నవి . నీకు భద్రమగుగాక . తల్లీ !దయచేసి మీరెవరో చెప్పండి "అని పలికెను . 

ఆ మాటలు విన్న సీతాదేవి "ఓ వానరా !నేను జనకుని కుమార్తెను ,దశరధుని పెద్దకోడలిని ,నన్ను సీత అంటారు . మా వివాహమైన పిదప అయోధ్యలో సంతోషముగా 12 సంవత్సరాలు వున్నాను 13 వ సంవత్సరము మా మామగారు దశరథ మహారాజు నా భర్త శ్రీరామునికి యువరాజుగా పట్టాభిషేకము చేయుటకు యత్నించెను . కానీ మా మహారాజు చిన్న భార్య కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా నా భర్త వనవాసము చేయుటకు వనములకు వెళ్ళుటకు సిద్దపడెను . నేనునూ ఆయనతో వనములకు పయనమయ్యాను . ఆయన సోదరుడు లక్ష్మణుడు కూడా మాతో వనములకు వచ్చాడు . మేము దండకారణ్యములో వున్న సమయములో రావణుడు నన్నుఅపహరించాడు 
 . ఆ దుష్టుడు నాకు రెండు నెలల గడువును విధించాడు . ఆ గడువు పూర్తయిన పిదప నేను ప్రాణములతో  ఉండను .  "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Monday 15 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదిరెండవసర్గ

                                   రామాయణము 

                                 సుందరకాండ -ముప్పదిరెండవసర్గ 

శ్రీరాముని కథాగానము విని అశోకవృక్షముపై కూర్చుని వున్న హనుమను చూసి సీతాదేవి ఒక్క నిమిషము స్పృహ కోల్పోయెను . స్పృహలోకి వచ్చిన వెంటనే తాను చూసినది ,విన్నది కల అని బ్రమించెను . "కలలోకి వానరం వచ్చుట అనర్థదాయకం అని పెద్దలు అంటారు . ఈ కల యొక్క చెడు ప్రభావము  ,రామలక్ష్మణుల మీద ,నా తండ్రి జనక మహారాజు మీద,కౌసల్య సుమిత్రా మాతల మీద లేకుండెను కాక . "అని ఆలోచించెను . పిమ్మట "లేదు లేదు నేను ఆ వానరుడిని కళ్లారా చూసాను . అతడు శ్రీరాముడి కథాగానము చేసాడు . ఇది నిజాము అవ్వాలి . "అని దేవతలందరినీ తలుచుకొని ప్రార్ధించెను . 

రామాయణము సుందరకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Sunday 14 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదియొకటవసర్గ

                                          రామాయణము 

                                        సుందరకాండ -ముప్పదియొకటవసర్గ 

శ్రీరాముని దూత ఐన హనుమంతుడు సీతాదేవికి ఒక్కదానికి మాత్రమే వినపడేలా   "ఇక్ష్వాకు వంశములో పరమధార్మికుడు సత్యసంధనుడు శ్రేష్ఠుడు ఐన దశరథ మహారాజు కలడు . అతడికి నలుగురు సంతానము .

 వారిలో పెద్దకుమారుడు  సకలసద్గుణసంపన్నుడు ,ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారము తన భార్యతో సోదరునితో కలిసి వనములకు వెళ్లెను .

 అక్కడ అనేకులైన రాక్షసులను వధించెను . తనవారిని చంపుటచే కోపించిన రాక్షస రాజు రావణుడు మాయలేడి వేషము ధరించిన మారీచుడి సాయముతో కపటోపాయము పన్ని జనక నందని ని అపహరించెను . శ్రీరాముడు భార్యను వెతుకుతూ వానర ప్రభువైన సుగ్రీవునితో స్నేహము చేసెను . 
దుర్మార్గుడైన సుగ్రీవుని అన్న వాలిని చంపి సుగ్రీవునికి పట్టము కట్టెను . సుగ్రీవుడు ప్రత్యుపకారముగా శ్రీరాముని భార్యను వెతుకుటకు వేలకోట్ల మంది వానరులను నలుదిశలకూ వెతుకుటకు పంపెను . దక్షిణ దిక్కుకు యువరాజైన అంగదుడితో ఇంకా కొంతమంది వానర వీరులతో కలిసి నేను సీతామాతను వెతుకుటకు వచ్చినాను . జటాయువు అన్న సంపాతి చెప్పినదాని ప్రకారము . ఆ మహాసాధ్వి ఈ లంకలో ఉండివుండవచ్చునని వంద యోజనములు దూరము కలిగిన మహా సముద్రమును లంఘించి ఈ లంకకు వచ్చినాను .

 శ్రీరాముడు చెప్పిన సీతాదేవి ఆనవాలు ని బాగుగా గుర్తుంచుకుని ఈ లంకా నగరమంతా వెతికినాను . చివరికి ఈ అశోకవనంలో శ్రీరాముడు చెప్పిన లక్షణములు కల పతివ్రతా శిరోమణిని చూసాను "అని పలికెను . 
ఈ మాటలు అన్ని విన్న సీతాదేవి పరమ ఆశ్చర్యముతో సంతోషముతో ఈ మాటలు ఎక్కడినుండి వినపడుతున్నాయా ?అని నలుదిక్కులా చూసి చివరకు అశోకవృక్షముపై కూర్చుని వున్న హనుమను చూసేను . 


రామాయణము సుందరకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 




Saturday 13 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదియవసర్గ

                                 రామాయణము 

                                      సుందరకాండ -ముప్పదియవసర్గ 

అశోకవృక్షముపై కూర్చుని ఉన్న మారుతి రావణుని పలుకులు ,రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట ,త్రిజట స్వప్నవృత్తాంతము ,పిదప సీతాదేవి వ్యాకులపడుతూ తనలో తానూ పలికిన మాటలు వీటన్నిటిని విని అక్కడి పరిస్థితులను అర్ధము చేసుకొనెను . పిదప తనలోతాను "తీవ్రమైన వత్తిడిధాటికి  ఈమె మనసు వ్యాకులమై వున్నది . ఇటువంటి పరిస్థితులలో నేను ఈమెను ఓదార్చకుండా వెళ్ళిపోయినచో రాజపుత్రిక అయిన సీతాదేవి ఎటువంటి రక్షణ ఉపాయము తెలియక తన ప్రాణములు తప్పక తీసుకొనును . కావున నేను ఈమెతో మాట్లాడి వెళ్లవలెను . 
ఒకవేల నేను మాట్లాడకుండా వెళ్ళినట్లయితే నన్ను చూసిన వెంటనే శ్రీరామప్రభువు "జానకి నా గురించి అడిగినదా ?అని ప్రశ్నించిన నేను ఏ సమాధానము చెప్పగలను ?నేను మాట్లాడకుండా వెలికిపోతే ,ఈ మహాసాధ్వి ఈ రక్కసి మూకలమధ్య నిలువలేక ఆత్మత్యాగము చేసుకున్నచో సుగ్రీవుడు శ్రీరామునితో కలిసి యుద్ధమునకు ఇచటికి వచ్చినా ప్రయోజనము వుండదుకదా !నేను ఇక్కడే ఉండి ఈ రాక్షస స్త్రీలు నిద్రించినప్పుడు కానీ ,ఏమరపాటుగా వున్నప్పుడు కానీ సీతాదేవితో మాట్లాడవలెను . కానీ ఈమెతో నేను ఎలా సంభాషించను ?సంస్కృతములో మాట్లాడితే రావణుడు మాయా వేషమున వచ్చినాడని జనకానందని భీతిల్లు ప్రమాదం ఉన్నది . 
ఇప్పుడు నేను వానర రూపమున వున్నాను . ఈ రూపమున ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇదంతా రావణుడి మాయగా ఈ సాధ్వి అనుకోవచ్చును . అలా భావించినచో ఈమె బిగ్గరగా కేకలు వేయును . అలా కేకలు వేస్తె ఇక్కడ కాపలా కాయుచున్న రాక్షసులంతా చుట్టుముట్టి నన్ను భందించడమో ,లేక చంపడమొ చేస్తారు . చావు గురించి నాకు భయము లేదు కానీ ,సీతామహాసాధ్వి ఇక్కడే ఉన్నదని నేను మరణించినచో రామునికి ఎలా తెలియును  ?కావున నా ప్రాణములు నిలుపుకొనుట ,ఇక్కడి నుండి బయట పడుట  ఉత్తమము . అంతకు ముందు ఎలాగయినా ఈ మాతతో మాట్లాడవలెను . కానీ ఎలా మాట్లాడాలి ?ఈమె నన్ను విశ్వసించుట ఎట్లు ?"అని తనలోతాను ఆలోచించుకుని ఒక కృత నిశ్చయమునకు వచ్చెను . 
"శ్రీముడు నాకు ప్రభువు . ఆయన సర్వశ్రేష్ఠుడు . ఆయన కదా గానము చేసి సీతామాతకు విశ్వాసము కలిగిన పిమ్మట ఈమె ఎదురుగా వెళ్లి మాట్లాడుట ఉత్తమము "అని  తలఁచెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము సుందరకాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                   రామాయణము 

                            సుందరకాండ -ఇరువదితొమ్మిదవసర్గ 

ఆ విధముగా ప్రాణత్యాగము కొఱకు అశోకవృక్షము వద్దకు వెళ్లిన సీతాదేవికి శుభ శకునములు కనిపించసాగినవి (ఎడమకన్ను అదురుట ,ఎడమ భుజము అదురుట మొదలయినవి ). విజ్ఞానవంతురాలు ఐన సీతాదేవి ,తనకు కలిగే శుభ శకునములు గమనించుకుని ప్రాణత్యాగం ఆలోచనను విరమించి ఇలా ఆలోచించసాగెను . "నాకు శుభశకునములు కలుగుతున్నాయి . వీటిని బట్టీ చూస్తుంటే త్వరలో నాకు మంచి జరుగుతుందని అర్ధమవుతోంది . బహుశా నా ప్రాణనాధుడు నా కొరకు వేటుకు ప్రయత్నమూ చేయుచున్నాడేమో ?లేక ఇటుగా నన్ను వెతుకుతూ వచ్చుచున్నాడేమో ?"అని ఆలోచించుతూ ఆ మహా సాధ్వి మనసు కొంత శోకము నుండి ఉపశమనము పొంది సంతోషము పొందెను . 

రామాయణము సుందరకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -ఇరువదియెనిమిదవసర్గ

                                         రామాయణము 

                                          సుందరకాండ -ఇరువదియెనిమిదవసర్గ 

త్రిజట తన కల గురించి చెప్పినను ,సీతాదేవి ధైర్యము రాకుండెను . సీతాదేవి తన దీన స్థితిని తలచుకుని మిక్కిలి చింతించెను . అదీకాక రావణుని మాటలను ,రక్కసి మూకల బెదిరింపులను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుని చింతించసాగెను . శ్రీరాముడు ఇంకా తనను కాపాడుటకు రాలేదని బాధపడెను . వస్తాడోరాడో అని సందేహపడెను . రక్కసి మూకల బెదిరింపుల మధ్య ప్రతి రోజూ చస్తూ బతకడం కన్నా ,ఒకేసారి చనిపోవుట ఉత్తమమని భావించెను . విషము త్రాగి కానీ ,ఆయుధముతో పొడుచుకుని కానీ చనిపోవాలని అనుకొనెను . కానీ ఈ లంకలో ఎవరు తనకు విషము కానీ ఆయుధము కానీ తెచ్చి ఇవ్వరని అనుకొనెను . చివరికి తన జుట్టుతో చెట్టుకి ఉరిపోసుకుని చనిపోవాలని నిర్ణయానికి వచ్చెను . సీతాదేవి కూర్చున్న చోటు నుండి లేచి బాగుగా పుష్పించిన అశోక వృక్షము వద్దకు చనిపోవుటకు వెళ్లెను . 

రామాయణము సుందరకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 11 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువది ఏడవసర్గ

                                  రామాయణము 

                                  సుందరకాండ -ఇరువది ఏడవసర్గ 

సీతాదేవి ఆ విధముగా బాధపడుతుండగా రాక్షస స్త్రీలందరూ కోపముతో వుడికిపోయిరి . కొందరు రాక్షస స్త్రీలు రావణునికి ఈ విషయము నివేదించుటకు వెళ్లిరి . మిగిలిన రాక్షస స్త్రీలు సీతాదేవికి అతి చేరువగా వచ్చి శూలములు చూపుతూ ,బయపెట్టసాగిరి . ఇంతలో త్రిజట అనే రాక్షసి అప్పుడే నిద్ర నుండి మేల్కొని ఆ రాక్షస స్త్రీలను అదిలించి "ఓ దుష్టస్త్రీలారా !మిమ్మలను మీరే తినేయండి . ముందు నా మాట వినండి . నాకొక భయంకరమైన కల వచ్చింది . "అని పలుకగా అక్కడి స్త్రీలందరూ సీతాదేవిని బెదిరించటం ఆపి త్రిజట చుట్టూ చేరి ,"ఏమిటా కల ?"అని అడిగిరి . 
ఏనుగుదంతములతో నిర్మింపబడి వేయి హంసలతో లాగబడుతున్న దివ్యమైన పల్లకీలో రాముడు లక్ష్మణుడు ఇటువైపుగా వచ్చుచున్నారు . ఈ సీత శుభ్రమైన వస్త్రములు ధరించి సముద్రమధ్యలో తెల్లని పర్వతముపై వున్నట్టుగా చూసాను . ఏనుగు ఎక్కి శ్రీరాముడు సీతాదేవి వద్దకు వచ్చి ఆమెను కూడా ఆ ఏనుగుపై ఎక్కించుకున్నట్టు చూసాను . అప్పుడా ఏనుగు లంక మధ్యలో నిలిచినట్టు చూసాను . పిదప రాముడుసీతా లక్ష్మణులు మువ్వురూ పుష్పకవిమానము ఎక్కి ఉత్తరదిశగా వెళ్లినట్టు చూసాను . 
గన్నేరు దండ మేడలో ధరించిన రావణుడు శరీరముపై నూనె పూసుకుని కింద పడివున్నట్టుగా చూసాను . ఒక నల్లని స్త్రీ ఒంటి నిండా బురద పూసుకుని ,రావణుని మెడకు తాడు కట్టి దక్షిణ దిక్కుకు లాక్కుని వెళ్తున్నట్టుగా చూసాను . రావణుని సుతులు కుంభకర్ణుడు కూడా వంటి నిండా నూని పూసుకుని ,దక్షిణ దిక్కుకు వెళ్తున్నట్టుగా చూసాను . వారందిరిలో ఒక్క విభీషణుడు మాత్రము దివ్య గజము ఎక్కి తెల్లటి వస్త్రములు పూలమాలలు వేసుకుని ,సంగీత నృత్యములు ఆనందించుచున్నట్టు కనిపించెను . లంకాపురి మొత్తము చిన్నాభిన్నమై పోయి ,సముద్రములో పడిపోయినట్టు చూసాను . వీటిని బట్టీ చూస్తుంటే ,త్వరలోనే శ్రీరాముడు వచ్చి మనవారందరిని చంపి సీతాదేవిని తీసుకువెళ్తాడు . 
ఇన్నాళ్లు ఈమెను నానాబాధలు పెట్టాము . ఇక ఈమెను శరణు వేడటమే చేయవలిసినది . శ్రీరాముడు మనల్ని కూడా చంపివేయును . ఈమె మాత్రమే మనల్ని రక్షించుటకు సమర్థురాలు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి కొంత ఊరడిల్లేను . కానీ మనసులో బాధ మాత్రము అలానే వున్నది . 

రామాయణము సుందరకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Wednesday 10 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువది ఆరవసర్గ

                                      రామాయణము 

                                         సుందరకాండ -ఇరువది ఆరవసర్గ 

సీతాదేవి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ ,తనలోతాను "నాకు ప్రాణమైన భర్తకు దూరమైనా నాకు ఈ అలంకారములు ఎందుకు ?సంపదలు ఎందుకు ?ఏదేమైనను నా ఎడమకాలి గోటితో కూడా అధముడైన ఆ రాక్షసుడిని తాకను . నా భర్త నాకు దూరమైనా కూడా నేను ఎలా బతకగలుగుతున్నాను ?ఈ గుండె బహుశా ఇనుపముద్దతో చేయబడినట్లున్నది . కనుకే ఇంకా జీవించువున్నది . అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యురాలినో కదా . 
నా భర్త అరివీరపరాక్రమముడు అతడిని ఎదిరించి ఎవరూ నిలవలేరు . రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి ఈ భూమండలమును తమ బాణములతో అతలాకుతలం చేయగలరు . మరి వారు నాకోసము ఈ భూమండలం మీద వెతుకుటకు  ప్రయత్నమూ చేయుటలేదా ? ఒకవేల చేసినను నేను ఇక్కడ వున్నానని వారికి ఎలా తెలుస్తుంది . ఆ దుష్టుడు నన్ను ఎత్తుకొస్తుండగా జటాయువు ఒక్కడే చూసాడు . కానీ అతడు కూడా ఈ దుర్మార్గుడి చేతిలో మరణించాడు . 
ఈ స్థితిలో వారికి నా గురించి ఎలా తెలియును ?ఏదేమయినప్పటికీ వారిరువురు అతిత్వరలోనే నన్ను వెతుకుతూ ఇక్కడికి వస్తారు . అప్పుడు ఈ లంక అణువణువూ గాలించి రాక్షసులందరినీ ,ఒక్కరిని కూడా వదలకుండా అందరిని తుద ముట్టిస్తారు . అప్పుడు ఈ లంకలో కేవలము స్త్రీలు మాత్రమే మిగులుతారు . ఇది తధ్యము . దండకారణ్యములో ఒక్కడే పదునాలుగువేలమంది రాక్షసులను చంపినా ధీరుడు నా భర్త . విరాధుడిని చంపిన వీరుడు నా భర్త . అంతటి గొప్పవాడికి ఈ సముద్రము ఒక లెక్కా ?ఆయన తప్పక నన్ను వెతుకుతూ వచ్చెదరు . కానీ ఆయన వచ్చేవరకు నేను ప్రాణాలతో ఉండగలనా ?ఆ దివ్యమంగళ రూపమును చూడగల అదృష్టము నాకు ఉన్నదా ?"అని పరిపరి విధములుగా బాధపడుతూ ఆలోచించసాగెను . 

రామాయణము సుందరకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                శశి , 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Tuesday 9 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువది అయిదవసర్గ

                                       రామాయణము 

                                    సుందరకాండ -ఇరువది అయిదవసర్గ 

ఆ అశోకవనంలో సీతాదేవికి కాపలావున్న రాక్షసస్త్రీలు సీతాదేవిని పలువిధములుగా తమ మాటలచేత ,చేష్టలచేత భయపెడుతుండగా ఆ మాత శోకమూర్తిలా ఏడ్చుచూ ,భయముతో వణికిపోసాగెను . అయినను ఆ రాక్షస స్త్రీలతో "మీరు కోరుకున్నట్టుగానే నన్ను తినేయండి . నేను మాత్రము మీరు చేపినది చేయను ". అని పలికెను . 
ఆ విధముగా పలికి తన స్థితి తలచుకుని దుఃఖించెను . "అయ్యో ఎప్పుడు ఏ పాపము చేసానో నాకీవిధమైన దుస్థితి లభించినది . హా రామా !హా లక్ష్మణా !,అయ్యో కౌసల్యా మాతా !అయ్యో సుమిత్రా మాతా !"అని రోదించెను . "రాముడికి దూరమైనను నేను బతికి ఎలా వున్నాను . ఈ రాక్షస స్త్రీల కాపలా నుండి తప్పించుకుని నా రాముడిని నేను చేరలేను . బహుశా ఈ జన్మలో శ్రీరాముని దర్శనభాగ్యము నాకు కలుగునో లేదో ?ఇక ఈ జన్మ జీవించి ఏమి ప్రయోజనము ?జీవించుట కంటే మరణించుటే ఉత్తమము . కానీ పెద్దలు ఆత్మహత్య మహాపాపము అని చెబుతారు . అదీకాక నేను రాముని అర్ధాంగిని ఆయన అనుమతి లేకుండా మరణించుట సరికాదు . కావున చావు వచ్చు వరకు జీవించవలసినదే . జీవించినతవరకు రాముని తలుచుకుని కాలము గడపవలెను . "అని తనలో తానూ అనుకొనెను . 

రామాయణము సుందరకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము సుందరకాండ -ఇరువదినాల్గవసర్గ

                                    రామాయణము 

                                 సుందరకాండ -ఇరువదినాల్గవసర్గ 

వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకా దగ్గరగా జరిగి వారి భయంకరమైన మాటలతో ,చేష్టలతో సీతాదేవిని బయపెట్టసాగిరి . "ఓ సీతా !అత్యత్భుతమైన రావణుని అంతఃపురంలో హాయిగా ఉండక ఎందుకు నీకీ బాధలు ?మానవకాంతవైన నీవు మనిషికి భార్యగా ఉండుటయే గొప్పగా భావిస్తున్నావు . నీవు ఎప్పటికీ ,ఏవిధముగాను రాముడిని చేరలేవు . రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకములలోని సర్వ సంపదలకు అధికారి . ఆయనకు భార్యవై హాయిగా ఉండుము . "అని పలికెను . 
అప్పుడు సీత "మీకు నచ్చినట్టు నన్ను చంపి తినేయండి . అంతేకాని మీరు చెప్పినట్టు నేను చేయనే చేయను . రాజ్యభ్రష్టుడైన ,మానవుడైనా నాభర్తే నాకు దైవము . ఏదేమైనను నేను నా భర్తను తప్ప మరొకరిని ఆలోచనకి కూడా రానివ్వను "అని పలికెను . 
అశోకవృక్షముపై కూర్చుని మౌనముగా వున్న  హనుమ ఇదంతా చూడసాగెను . అప్పుడా ఆ రాక్షస స్త్రీలు మిక్కిలి కోపముతో సీతాదేవికి మిక్కిలి దగ్గరగా వచ్చి నాలుకలు బయటకు పెట్టి ,పెదవులు చప్పరిస్తూ సీతాదేవిని బయపెట్టసాగిరి . వారు గండ్రగొడ్డళ్లను చేతబూని "రావణుడిని భర్తగా పొందుటకు ఈమె తగదు "అని పలికిరి . అప్పుడు సీతాదేవి కన్నీటిని తుడుచుకుంటూ అశోకవృక్షము మూలకు జరిగెను . రాక్షస స్త్రీలు కూడా సీతాదేవికి దగ్గరగా జరిగిరి . 
భయంకర ఆలంకారము కల వినత అను రాక్షసి "ఓ సీతా !ఇప్పటివరకు నీవు నీ భర్తపై చూపిన ప్రేమ చాలు . ఏ విషయములోనైనా అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారి తీయును . మానవకాంతా ధర్మము బాగా ఆచరించావు . సంతోషము . ఇక చాలు రాముని త్యజించి దేవేంద్రుడి అంతటి వాడైనరావణుని భర్తగా పొందు . నేను చెప్పిన ఈ మాటలు విననిచో ఇప్పుడే నిన్ను చంపి తినేస్తాము "అని పలికెను . 
పిదప 'వికట 'అను రాక్షసి పిడికిలి బిగించి సీతను భయపెట్టుచూ "ఓ సీతా !నీకు బుద్దిలేదు . కాబట్టే మేమందరము నీ మంచి కోరి చెప్పిన మాటలేవి నీవు వినుట లేదు . నీవు సముద్రమునకు ఇవతలి తీరమునకు తీసుకురాబడినావు . ఇక్కడికి చేరుట కానీ ,నిన్ను కాపాడుట కానీ ఎవ్వరికి తరము కాదు ఏడుపు ఆపి రావణుని భర్తగా పొందు అప్పుడు మేమందరము నీకు దాసీలము . నేను చెప్పిన మాటలు విననిచో నీ గుండెను  చీల్చి గుండెను తింటాను "అని పలికెను . 
అప్పుడు ఛందోదరి అనే రాక్షసి శూలమును తిప్పుతూ "ఈమె యాకృత్తుని (గుండెకు కుడివైపు వుండు మాంసము )ప్లీహము (గుండెకు ఎడమవైపు వుండు మాంసము ),వుత్పీడనము (గుండెకు పైనుండు మాంసము ),గుండె ,ప్రేగులు ,శిరస్సు తినాలని కోరికగా ఉన్నది "అని పలికెను . 

అప్పుడు ప్రఘస అనే రాక్షసి "ఈమె దారికి వచ్చేలా కనిపించుటలేదు . వృధాగా కూర్చోవటం ఎందుకు ?ఈ మూర్ఖురాలి కంఠము నులిపివేసి ,మానవకాంత మరణించిందని రాజుకి నివేదిద్దాము . అప్పుడు ఆయనే 'అయినచో తినేయండి 'అంటారు . ఇందుకు సందేహము లేదు . 
అప్పుడు 'అజాముఖి 'అనే పేరుకల రాక్షసి "మనందరమూ అనవసరముగా తగువు పడవద్దు . ఈమెను ముక్కలుగా కోసి సమానముగా పంచుకుని తిందాము "అని పలికెను . అప్పుడు మిగిలిన రాక్షస స్త్రీలు 'సరే అలాగే చేద్దాము . మద్యము తీసుకురండి . మద్యము త్రాగి నరమాంసము భక్షించి నికుంభిళాదేవి (లంక యొక్క పశ్చిమ ద్వారమందలి భద్రకాళి )తృప్తికై నృత్యములు చేద్దాము . "అని పలికెను . వీరందరి మాటలు విన్న సీతాదేవి ధైర్యము కోల్పోయి ఏడ్చెను . 

రామాయణము సుందరకాండ ఇరువది నాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం .  ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









రామాయణము సుందరకాండ -ఇరువదిమూడవసర్గ

                                    రామాయణము 

                             సుందరకాండ -ఇరువదిమూడవసర్గ 

రావణుడు రాక్షస స్త్రీలకు సీతాదేవిని ఒప్పించమని ఆజ్ఞ ఇచ్చి అంతఃపురమునకు వెళ్లిపోయెను . పిమ్మట అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు బయంకరాకారులై సీతాదేవి వద్దకు వచ్చిరి . 
వారిలో ఏకజట అను పేరుకల రాక్షసి సీతతో "ఓ సీతా !షట్చక్రవర్తులలో నాలుగవవాడైన పులస్త్యుడి వంశంవాడే ఈ రావణుడు . రావణుడు ఎంతో గొప్పవాడు అరివీరభయంకరుడు . అట్టి రావణుని వరించి సంతోషముగా ఉండక నీకు ఈ బాధలెందుకు "అని పలికెను . 
పిల్లి కన్నులు కలిగిన 'హరిజట' అను రాక్షసి "ఓ జానకీ !దేవేంద్రునితో సహా దేవతలందరూ రావణుని చేతిలో ఓడిపోయారు . రావణుడు గర్వింపతగినవాడు ,పరాక్రమము కలవాడు ,మహావీరుడు ,శూరుడు ,రణరంగమున వెన్నుచూపనివాడు ,మహాబలశాలి ,మహా శక్తిసంపన్నుడు ,అట్టివాడికి భార్యవు అవుటకు ఎందుకు అంగీకరించవు ?"అని పలికెను . 
అప్పుడు' ప్రఘస 'అను రాక్షసి "రావణుని భార్యలందరిలో మండోదరి సర్వ సౌభాగ్యవతి . ఆమె అంటే రావణునికి ఎనలేని ప్రేమ గౌరవము , కూడా వీడి రావణుడు నిన్ను పొందకోరుతున్నాడు . బంగారముతో అమూల్యమైన రత్నములతో విలసిల్లే రావణుని అంతః పురములో వేలకొలది స్త్రీలు కలరు . వారందరిని కూడా వీడి రావణుడు నిన్ను కావాలనుకుంటున్నాడు "అని పలికెను . 

తదుపరి 'వికట 'అను పేరుకల రాక్షసి "రావణుడు యుద్దములో దేవతలను ,నాగులను ,గంధర్వులు ,దానవులను అనేకసార్లు ఓడించాడు . అంతటి రావణునికి భార్యవగుటకు నీవు ఎందుకు ఇష్టపడకున్నావు ?"అని పలికెను . 
పిమ్మట' దుర్ముఖి 'అను పేరుకల రాక్షసి "రావణునికి బయపడి సూర్యుడు తీక్షణ కిరణములను ప్రసరింపచేయుటకు భయపడతాడు . వాయువు పెద్దగా వీచడు . చెట్లు ఆయన కోరిక మేరకే పూలు కురిపిస్తాయి . ఓ భామినీ !రావణుడు రాక్షసులకు రాజు అంతేకాదు రాజులకేరాజు అట్టి రావణునిపై ఎందుకు మనసుపడవు ?అతని భార్యవగుట కు ఎందుకు సిద్దపడవు ?నా మాటలు గ్రహింపుము . లేనిచో నీవు బ్రతికి వుండవు . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 

                     శశి ,

 ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 8 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువదిరెండవసర్గ

                                రామాయణము 

                          సుందరకాండ -ఇరువదిరెండవసర్గ 

ఆ విధముగా సీతాదేవి మిక్కిలి పరుషముగా పలికిన మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోతూ ,


"సీతా !ఇప్పుడు నీవు పలికిన పలుకులు కి నిన్ను వెంటనే చంపేయాలి . కానీ నీమీద నాకు వున్న ప్రేమ కారణముగా నీవు ఇటువంటి మాటలు పలికినప్పటికీ ,రాముడిని తలుచుకుంటునప్పటికీ ,ఇంకా బతకానిస్తున్నాను . ఓ జానకీ !నీకు నేను రెండు నెలల గడువు విదించాను . ఆ గడువులోపల నీవు నన్ను అంగీకరించావా సరేసరి లేనిచో గడువు తీరిన మ  నేను రెండు నెలల గడువు విదించాను . ఆ గడువులోపల నీవు నన్ను అంగీకరించావా సరేసరి లేనిచో గడువు తీరి రునాడు ప్రాతః కాలమే (ఉదయమే )నిన్ను ముక్కలుముక్కలుగా చేసి నా వంటవాడు కూరగా వండుతాడు . "అని గర్జించి పలికెను . 
ఈ విధముగా రావణుడు జానకిని బయపెట్టుట చూసిన దేవగంధర్వయక్ష కన్యలు మిక్కిలి బాదపడిరి . ఆ రావణుని మాటలు విన్న సీతాదేవి ఆ దుష్టుడితో

 "ఓ రావణా !ఈ రాజ్యములో నిజముగా నీ మేలుకోరేవాడు ,నీకు మంచి చెప్పేవాడు ఎవ్వడూ లేదనుకుంట . అందుకే నీవు ఇటువంటి దుష్టకృత్యములు చేయుచున్నావు . శ్రీరాముడు ఎదుట పడుటకు జంకి ,ఇప్పుడు ఆయన పరోసఖమున ఇలా కారుకూతలు కూయుటకు నీకు సిగ్గులేదా ?ఓ దశకంఠా !నేనే నిన్నుఇప్పుడే  భస్మము చేయగలను,కానీ రామాజ్ఞ లేనికారణముగా నీవు బతికిపోయావు . నేను కుబేరుని సోదరుడిని ,అపారభాల సంపన్నుడిని అని గొప్పలు పలుకుతున్నావు . అంతటి గొప్పవాడవయితే ,శ్రీరాముని దూరముగా పంపి దొంగవలె నన్ను ఎందుకు అపహరించావు ?నిజముగా నీవు అంత గొప్ప శక్తివంతుడవు అయితే శ్రీరామునికి ఎందుకు ఎదురుపడలేదు ?"అని పలికెను .  
ఆ మాటలు విన్న రావణుడు మిక్కిలి ఉగ్రుడై ,"ఓ సీతా !శ్రీరాముడు బలములేనివాడు ,నీటి తప్పినవాడు వాడిని నేను తలుచుకున్నచో ఇప్పుడే చంపివేయుదును . "

అని పలికి అక్కడే ఉన్న రాక్షస స్త్రీలతో ఎదో విధముగా సీతను దారిలోకి తెమ్మని ఆజ్ఞాపించెను . అప్పుడు ధాన్యమాలీ అను స్త్రీ రావణుని వద్దకు వచ్చి రావణుని అనునయించి తీసుకువెళ్ళేను . 

రామాయణము  సుందరకాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణం సుందరకాండ-ఇరువదిఒకటవసర్గ

                                             రామాయణం 

                                           

                                               సుందరకాండ-ఇరువదిఒకటవసర్గ 

భయంకరములైన ఆ రాక్షసుని పలుకులు విని ,దీనురాలైన ఆ సీతాదేవి గడ్డిపరకనే బ్రహ్మాస్త్రముగా చేసి ,కాకాసురుడిని చంపిన తన భర్త శ్రీరాముని మనసులో తలచుకుని ,గడ్డిపరకను తనకు ,రావణునికి అడ్డుగా పెట్టుకుని  దీనస్వరంతో నెమ్మిదిగా ఇలా సమాధానమిచ్చెను . 
"నీ మనసుని నా మీద నుండి మరల్చుకుని నీ భార్యలమీదికి మరల్చుకో . ఉత్తమవంశములో పుట్టినదానిని ,దశరధుని పెద్దకోడలిని ,అమిత పరాక్రమవంతుడైన శ్రీరాముని ధర్మపత్నిని ,పతివ్రతని ఐన నేను ఎట్టి పరిస్థితిలో నా భారతను మరచి వేరొకరిని మనసులో తలుచుట కూడా జరగదు . దనము ఆశ చూపినా ,ఎటువంటి ప్రలోభములు పెట్టవలెనని చూసినా ఏ మాత్రము ప్రయోజనము ఉండదు . నీ సమయము వృధా అవుతుంది . కావున నీ మనసు మార్చుకుని రాజ్యభోగములు అనుభవిస్తూ ,నీ భార్యలతో సంతోషముగా వుండు . నన్ను ఆ శ్రీరామునికి అప్పగించు . అదే నీకు ,నీ రాజ్యమునకు ,నిన్ను నమ్ముకున్న వారికి మంచిది . శ్రీరాముడు శరణాగత వత్సలుడు . శరణు వేడినవాడు బద్ధశత్రువైనా పరమదయాలుడు ఐన శ్రీరాముడు నిన్ను తప్పక క్షమించెదరు . 

ధర్మము తప్పి ప్రవర్తించువాడు . ఎంతటి బలవంతుడు అయినను ,ఎంతటి అధికారము ఉన్నను ,ఎంతటి సంపద ఉన్నను ,ఎంతటి బలగము ఉన్నను ,తుదకు అవన్నియు నాశనము అయితీరుతాయి ఇది నిజము . ఇంద్రుడి వజ్రాయుధము నుండి తప్పించుకోగలవేమో కానీ శ్రీరాముని వాడి అయిన బాణములంనుండి తప్పించుకొనుట నీకు అసాధ్యము . భూమ్యాకాశములను దద్దరింపచేసే భయంకరమైన శ్రీరాముని ధనుష్టంకారమును అతి తొందరలోనే నీవు వింటావు . ఓ రావణా !నా భర్త ఐన శ్రీరాముడు దండకారణ్యములో ఒక్కరే నిలిచి నీ సైన్యము ఐన ఖరదూషణులను ,పదునాలుగువేలమంది సైన్యముని మట్టికరిపించారు . ఆయనను ఎదుర్కొను సామర్ధ్యము లేక నన్ను దొంగతనముగా  అపహరించినావు . నీకు ఆయువు మూడినది . కైలాసగిరి పరుగులు తీసినను ,కుబేరుని అలకాపురికి చేరినను ,వరుణ దేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకోలేవు . ఇది తధ్యము . "అని పలికెను . 


రామాయణము సుందరకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Saturday 6 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువదియవసర్గ

                               రామాయణము 

                            సుందరకాండ -ఇరువదియవసర్గ 

పతివ్రతయు ,తపోనిష్ఠలోవున్నదియు ,దుఃఖితయు దీనురాలు ఐన ఆ సీతాదేవికి రావణుడు హస్తముఖాదిసంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనో భావములను ప్రకటించెను. "ఓ సుందరీ !సీతా !నాకు భయపడి ముఖము చాటుచేసుకొనుచున్నావా ?ఏమి ?. నీవు నాకు భయపడవలసిన అవసరరము లేదు . నేను నిన్ను ప్రేమించుచున్నాను . . ఓ ప్రియురాలా !నన్ను ఆదరింపుము . ఓ సీతా !మనుష్యులు కానీ ,కామరూపులైన రాక్షసులు కానీ ఇక్కడ ఎవరూ లేరు . నేను ఒక్కడినే వున్నాను . నావలన నీకు ఏ మాత్రము భయమక్కరలేదు . బలవంతముగా పరస్త్రీలను అపహరించుట రాక్షసుల ధర్మము . కానీ నాపై ప్రేమలేని నిన్ను నేను తాకనే తాకను . కనుక ఓ దేవి భయపడకు. నన్ను నమ్ము మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు . 
ఓ సుందరీ !ఒక జాడను కలిగివుండుట ,నేలపై నిద్రించుట ఎప్పుడూ ఆలోచించుచుండుట ,మాలిన వస్త్రములు ధరించుట ,నిష్కారణముగా ఉపవాసములు చేయుట ,ఇలా శోకించుట నీకు ఏ మాత్రము తగినవి కావు . ఓ మైథిలీ !యవ్వనము వేగముగా ప్రవహించు నదీ జలముల వంటిది . యవ్వనము కరిగిపోయిన తిరిగి రాదు . నీవు నీ యవ్వనమును అనవసరముగా వ్యర్ధము చేసుకొనుచున్నావు . నేను అన్ని దిశలనుండి అనేకమంది సుందరీమణులు తీసుకువచ్చాను . నీవు నన్ను చేపట్టినచో నీవే నా పట్టపురాణివి అవుతావు . నా అంతః పురములో ఎంతో మంది సుందరీమణులు కలరు . వారందరూ లక్ష్మీదేవిని అప్సరసలు సేవించినట్టు నిన్ను సేవిస్తారు . 
నేను ఈ సమస్త లోకములను జయించి లెక్కలేనంత సంపదను సాధించాను . దానినంతటిని నీవే అనుభవించు . బంగారముతో నిర్మితమై రత్నమణిమయమయిన ఈ లంకా నగరము నీదే . ఈ రాజ్యము నీదే ,ఇన్ని మాటలు ఎందుకు నేను నీ దాసుడను . నీవు ఎలా చెబితే నేను అలా చేస్తాను .  నా ఈ సంపదను అంతా యథేచ్ఛగా నీవు అనుభవించవచ్చు . నీకు నచ్చిన వస్త్రములు ధరించవచ్చు . ఆభరణములు ధరించవచ్చు . ఆహారము తినవచ్చు ,అధికారము చేయవచ్చు ,లేదా నీకు నచ్చినన్ని దానములు చేయవచ్చు . నీవు నన్ను చేపట్టినచో ఈ భూమండలమునంతా జయించి నీ తండ్రి జనక మహారాజుకు కానుకగా ఇస్తాను . నీవు ఆనందముగా ఉండవచ్చు . నీ బంధువులు అందరూ కూడా ఈ సంపదను అనుభవిస్తూ సంతోషముగా ఉండవచ్చు . 

రాముడు జయమును ,సంపదలను కోల్పోయాడు . పైగా అడవుల పాలయ్యాడు . మునీవ్రతమును పాటించుచున్నాడు . నేలపై నిద్రించువాడు . ఇంతకూ అతడు జీవించి వున్నాడోలేదో ?అయినను నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు పొందుట కాదు కదా కనీసము నిన్ను చూడనుకూడా చూడలేడు . ఈ లోకములో ఎంతగా గాలించి చూసిన నన్నెదిరింపగల యోధుడు ఎవ్వడు లేడు . రణరంగమున సాటిలేని నా పరాక్రమము గురించి నీవు తెలుసుకో . యుద్ధభూమిలో అనేకసార్లు నేను సురాసురులను మట్టి కరిపించాను . వారి ధ్వజములను భగ్నమొనర్చాను . వారెవ్వరూ శత్రువులుగా నా ఎదుట నిలవలేరు . ఓ జానకీ !మేలిమి బంగారు ఆభరణములు దరింపుము . సముద్రతీరమునందు ,బాగుగా పుష్పించి తుమ్మెదలు వాలివున్న వృక్షములు కల వనములలో నాతొ కలిసి విహరించుము . 

రామాయణము సుందరకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











రామాయణము సుందరకాండ -పంతొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                            సుందరకాండ -పంతొమ్మిదవసర్గ 

ఆ విధముగా అనేకమంది స్త్రీలు రావణుని వెంట రాగా రావణుడుఅశోకవనములో సీతాదేవి వున్న ప్రదేశమునకు వచ్చెను . అలా వచ్చిన రావణుని చూసిన సీతాదేవి ముడుచుకుని దుఖిస్తూ కూర్చుని ఉండెను . అప్పుడు సీతాదేవి  నీళ్లలోనుండి బయటకు తీయుట వలన వాడిన తామర తీగ వలె వున్నది . ఎటువంటి అలంకారములు లేకున్నను ,స్నానాది సంస్కారములు చేయకున్నను ,తైలము రాయకపోవుటచే జుట్టు అట్టలుకట్టి ఉన్నను ,ఆమె సుందరముగానే వున్నది . ఆ క్షణములో ఆమె చూపులు శ్రీరాముడి చేతిలో ఏ నాటికైనను ఈ రావణునికి చావు తప్పదన్నట్టు ఉండెను . 

రామాయణము సుందరకాండ పంతొమ్మిదవసర్గ సమాప్తము . 

          శశి ,

ఎం . ఏ ,ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Friday 5 April 2019

రామాయణము సుందరకాండ పదునెనిమిదవసర్గ

                              రామాయణము 

                          సుందరకాండ పదునెనిమిదవసర్గ 

అంజనీ సుతుడైన హనుమంతుడు అశోకవృక్షముపై కూర్చుని సీతాదేవి గురించి ఆలోచిస్తుండగా , వేకువ జాము అయినది . ఆ సమయములో ఆ లంకలో వేదం ఘోష వినపడెను . చక్కటి మంగళ వాయిద్యములతో లంకాప్రభువైన రావణుని అతని అనుచరులు నిద్రలేపిరి . అలా నిద్రలేచిన రావణుడు అనేకమంది సుందర స్త్రీలు  సుగంధ తైలములతో వెలిగించబడిన బంగారు కాగడాలను పట్టుకుని ముందు నడుస్తుండగా ,ఎదురుగా బంగారుకలశము పట్టుకొని ఒక అందమైన యువతి నడుస్తుండగా ,రావణుడు అశోకవనములోకి ప్రవేశించెను . ఆయన పక్కన బంగారు మధిరపాత్ర పట్టుకుని ఒక స్త్రీ నడుస్తోంది . చక్కటి వింజామరలు పట్టుకుని విసురుతూ అనేకమంది స్త్రీలు ఆయనను అనుసరిస్తున్నారు . ఇంకా అనేకమంది స్త్రీల సమూహము రావణుని అనుసరిస్తుండగా రావణుడు సీతాదేవిని చూడవలెననే కాంక్షతో అశోకవనములోకి వచ్చెను . 

రామాయణము సుందరకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -పదిహేడవసర్గ

                                     రామాయణము 

                                         సుందరకాండ -పదిహేడవసర్గ 

హనుమ ఆ విధముగా ఆలోచిస్తుండగా చీకటి పడినది . చంద్రుడు ఉదయించినాడు . సీతాదేవి మాత్రము ఏ విషయములు పట్టించుకొనక ఎదో ఆలోచిస్తునట్లుగా ఉండెను . అక్కడ కాపలా వున్న రాక్షస స్త్రీలు వారిలోవారు మాట్లాడుకొనుచుండిరి . వారందరు మిక్కిలి భయంకరముగా ఉండిరి . వారి మాటలు సైతము పట్టించుకొనకండా సీతాదేవి సూన్యములోకి చూస్తూ దీన వదన ఐ ఉండెను . హనుమ వృక్షముపైనుండి గమనించుచు ఆకులమాటున దాగుకొని ఉండెను . 

రామాయణము సుందరకాండ పదిహేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 4 April 2019

రామాయణము సుందరకాండ -పదునాఱవసర్గ

                               రామాయణము 

                            సుందరకాండ -పదునాఱవసర్గ 

వాయునందనుడు ఆ అశోకవృక్షముపై కూర్చుండి ఆలోచించసాగెను . శ్రేష్ఠుడైన మిథిలా మహారాజు జనకుడు నాగలితో భూమిని దున్నుతుండగా ఈ మహాసాధ్వి భూమిలో దొరికినది . దశరధుడు పెద్ద కోడలు ఐన ఈ జానకి నేడు ఈ విధముగా రాక్షస స్త్రీల మధ్య బాధలు పడవలసివచ్చినది కదా !శ్రీరాముడి ధర్మపత్ని ఉత్తమ సద్గుణ సంభూత ఈనాడు ఈ రాక్షస చెరలో ఇలా బిక్కుబిక్కుమంటూ వుండవలసి వచ్చినది కదా !అంతఃపుర సుఖములను రాచమర్యాదలు వదులుకుని భర్తతో బయంకరములైన వనములకు ప్రీతితో వచ్చిన మహా ఇల్లాలు . 
భర్తతో పాటు ఫలమూలాదులనే సంతోషముగా భుజిస్తూ అంతః పురములో ఉన్నట్టుగానే వనములో కూడా హాయిగా విహరించుచున్న ఈ పతివ్రతాశిరోమణిని చావుమూడిన దుష్ట రాక్షసుడు ఇక్కడకు తెచ్చెను కదా !ఈ తల్లి ఇలా రాక్షసుల మధ్య వున్నా కూడా వీరి ప్రలోభములకు ,వీరి భయంకరములైన మాటలకు ,చేష్టలకు ఏ మాత్రము భయపడక శ్రీరాముని అందే తన మనసుని నిలుపుకుని ఆయనను దర్శించుటకు మాత్రమే జీవించినట్లుగా ఉన్నది. 
ఈ సాధ్వి మూలంగానే దండకారణ్యములో పదునాలుగువేలమంది రక్కసులు శ్రీరాముడి చేతిలో మరణించారు . ఖరదూషణాదులు సైతము అసువులు బాసినారు . విరాధుడు ,కబంధుడు మట్టికరిచారు . వాలి వధింపబడ్డాడు ఇప్పుడు మరణము సమీపించిన ఈ రక్కసుడు కూడా అతి త్వరలోనే చావబోతున్నాడు . ఇది తధ్యము . శ్రీరాముడు తలుచుకున్నచో ఈ సమస్త భూమండలమును అంతా తలకిందులు చేయగలడు . అంతటి పరాక్రమము కల శ్రీరాముడు కూడా తన ధ్యాస మొత్తము సీతాదేవి మీదే నిలిపి ఉండెను . ఆ మహావీరునికి తగిన ఇల్లాలు ఈమె . ఈ మహా సాధ్వికి తగిన భర్త ఆ శ్రీరాముడే . "అని అనుకుని ఈమె సీతాదేవి అని నిశ్చయించుకుని ఆ వృక్షము పైనే ఉండిపోయెను . 
రామాయణము సుందరకాండ పదనారవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 











Wednesday 3 April 2019

రామాయణము సుందరకాండ -పదినైదవసర్గ

                                  రామాయణము 

                                    సుందరకాండ -పదినైదవసర్గ 

అశోకవృక్షము పైన చేరిన హనుమ ఆ వనమంతా బాగుగా పరిశీలించి చూడసాగెను . జానకీ దేవికొరకు చూపులతో వెతికేను . అలా వెతకగా మాలిన వస్త్రములు కట్టుకుని వున్న ఒక స్త్రీ కనిపించెను . ఆమె కట్టుకున్న వస్త్రము మిక్కిలి మలినమై ఉండెను . కానీ దాని శోభ ఏమాత్రము తగ్గలేదు . ఆమె ఎటువంటి అలంకారములు లేకుండెను . ఆమె జుట్టు తైలస్నానాది సంస్కారములు లేక జాడలు కట్టి ఉండెను . ఆమె వంటిపై ఎటువంటి ఆభరణములు లేవు . శ్రీరాముడు చెప్పిన గుర్తులు ప్రకారము  కొన్ని నగలు చెట్టు కొమ్మకు తగిలించివుండెను . అవి మిక్కిలి మాసి ఉండెను . హనుమ కూడా ఋశ్యమూకపర్వతము పై ఉన్నప్పుడు రాక్షసుడు అపహరించి పోవుచుండగా చూసిన స్త్రీ జారవిడిచి న  ఉత్తరీయము బంగారుఅంచు కలది . ఇప్పుడు ఈ సాధ్వి ధరించి ఉన్న చీర కూడా బంగారు అంచు కలిగివున్నది . 
మారుతి శ్రీరాముడు చెప్పిన ఆనవాలు ,తానూ చూసినది బాగుగా గుర్తుతెచ్చుకుని ,అతి కష్టము మీద ఆ మహా సాధ్వి సీతయే అని గుర్తించెను . ఆమె ముఖము మిక్కిలి  విచారంగా ఉండెను . ఆమె దేహము మొత్తము దుమ్ముపట్టి ఉండెను . అయినను ఆమె ముఖములో కాంతి మిక్కిలి ప్రకాశవంతముగా ఉండెను .ఆమె చాలా కాలము నుండి కడుపు నిండా భోజనము చేసినట్లు లేకుండెను ." శ్రీరామునికి దూరముగా ఉన్నాను ఆమె మదిలో ఆయన ఎల్లప్పుడూ ఉండును . సీతాదేవి దూరముగా ఉన్నను ఆయన తలంపులో ఆమె ఎల్లప్పుడూ ఉండెను . కావునే వారిరువురు జీవించి ఉన్నారు .వీరిరువురు ఒకరికొకరు బాగుగా తగి వున్నారు . వీరు ఆదర్శ దంపతులు  "అని హనుమ అనుకొనెను . 

రామాయణము సుందరకాండ పదునైదవసర్గ . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








Monday 1 April 2019

రామాయణము సుందరకాండ -పదునాల్గవసర్గ

                                 రామాయణము 

                                 సుందరకాండ -పదునాల్గవసర్గ 

మారుతి మనసులో ధ్యానము చేసుకుని ఒక్క గెంతులో రామబాణములాగా వేగముగా ఆ అశోకవనములోకి దూకేను . ఆ చప్పుడుకి  ఆ వనములోని చెట్లపై నిద్రిస్తున్న పక్షులన్నీ లేచెను . ఆ విధముగా పక్షులు నిద్రనుండి కంగారుగా లేచి ,పైకి ఎగిరిపోసాగెను . అలా పైకి అవి ఎగిరిపోనపుడు ఆయా చెట్లపై ఉన్న పూలన్నీ వాటి రెక్కల తాకిడికి  రాలిపోసాగెను . అలా రాలిన పూలు అక్కడే చెట్ల కింద వున్న హనుమంతుడుపై రాలేను . అలా రాలుటచే హనుమంతుడు పూలకొండలా కనిపించాడు . అప్పుడు హనుమంతుడు ఆ వనములోని చెట్లపై ఒకదానినుండి ఒకదాని మీదకు దూకుతూ ఆ వనమంతా సీతాదేవి జాడ కొఱకు అన్వేషించసాగెను . 
అలా దూకునపుడు ఆ వృక్షములపై మిగిలిన పూలు కూడా రాలిపోయి ,ఆ ప్రదేశమంతా పూలతో ,పూరేకలతో నిండిపోయెను . ఆ క్షణమున అక్కడి చెట్లు పక్షులు ఎగిరిపోయి ,పూలు పళ్ళు రాలిపోయి దీనంగా ఉండెను . భూమాత చక్కగా అలంకరించినట్టు ఉండెను . అటువంటి వనములో హనుమ సీతాదేవి జాడ వెతుకుతూ ముందుముందు కు సాగెను . అక్కడ ఆయనకీ పర్వతము ,అందలి గుహలు పక్కనే రామణీయముగా ప్రవహించే నది కనిపించెను . అప్పుడు మారుతి తనలో తాను "ఈ రావణుని వనమంతా చందనపు వృక్షములతో స్వచ్ఛమైన నదితో పరమ రమణీయముగా ఉండెను . నేను విన్న దాని ప్రకారము సీతాదేవికి వనములన్న పెక్కు ఇష్టము . రామవిరహముతో బాధపడుతున్న సీతామహాసాధ్వి ఉపశమనముకోసము ఇచటికి తప్పక వచ్చును . "అని అనుకొనెను . ఆ మహావీరుడు అక్కడే వున్న ఎత్తైన శింశుపా వృక్షముపై ఎక్కెను . అచటికి ఎక్కి ఆ వనమంతా పరిశీలించసాగెను . 

రామాయణము సుందరకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .