Thursday 11 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువది ఏడవసర్గ

                                  రామాయణము 

                                  సుందరకాండ -ఇరువది ఏడవసర్గ 

సీతాదేవి ఆ విధముగా బాధపడుతుండగా రాక్షస స్త్రీలందరూ కోపముతో వుడికిపోయిరి . కొందరు రాక్షస స్త్రీలు రావణునికి ఈ విషయము నివేదించుటకు వెళ్లిరి . మిగిలిన రాక్షస స్త్రీలు సీతాదేవికి అతి చేరువగా వచ్చి శూలములు చూపుతూ ,బయపెట్టసాగిరి . ఇంతలో త్రిజట అనే రాక్షసి అప్పుడే నిద్ర నుండి మేల్కొని ఆ రాక్షస స్త్రీలను అదిలించి "ఓ దుష్టస్త్రీలారా !మిమ్మలను మీరే తినేయండి . ముందు నా మాట వినండి . నాకొక భయంకరమైన కల వచ్చింది . "అని పలుకగా అక్కడి స్త్రీలందరూ సీతాదేవిని బెదిరించటం ఆపి త్రిజట చుట్టూ చేరి ,"ఏమిటా కల ?"అని అడిగిరి . 
ఏనుగుదంతములతో నిర్మింపబడి వేయి హంసలతో లాగబడుతున్న దివ్యమైన పల్లకీలో రాముడు లక్ష్మణుడు ఇటువైపుగా వచ్చుచున్నారు . ఈ సీత శుభ్రమైన వస్త్రములు ధరించి సముద్రమధ్యలో తెల్లని పర్వతముపై వున్నట్టుగా చూసాను . ఏనుగు ఎక్కి శ్రీరాముడు సీతాదేవి వద్దకు వచ్చి ఆమెను కూడా ఆ ఏనుగుపై ఎక్కించుకున్నట్టు చూసాను . అప్పుడా ఏనుగు లంక మధ్యలో నిలిచినట్టు చూసాను . పిదప రాముడుసీతా లక్ష్మణులు మువ్వురూ పుష్పకవిమానము ఎక్కి ఉత్తరదిశగా వెళ్లినట్టు చూసాను . 
గన్నేరు దండ మేడలో ధరించిన రావణుడు శరీరముపై నూనె పూసుకుని కింద పడివున్నట్టుగా చూసాను . ఒక నల్లని స్త్రీ ఒంటి నిండా బురద పూసుకుని ,రావణుని మెడకు తాడు కట్టి దక్షిణ దిక్కుకు లాక్కుని వెళ్తున్నట్టుగా చూసాను . రావణుని సుతులు కుంభకర్ణుడు కూడా వంటి నిండా నూని పూసుకుని ,దక్షిణ దిక్కుకు వెళ్తున్నట్టుగా చూసాను . వారందిరిలో ఒక్క విభీషణుడు మాత్రము దివ్య గజము ఎక్కి తెల్లటి వస్త్రములు పూలమాలలు వేసుకుని ,సంగీత నృత్యములు ఆనందించుచున్నట్టు కనిపించెను . లంకాపురి మొత్తము చిన్నాభిన్నమై పోయి ,సముద్రములో పడిపోయినట్టు చూసాను . వీటిని బట్టీ చూస్తుంటే ,త్వరలోనే శ్రీరాముడు వచ్చి మనవారందరిని చంపి సీతాదేవిని తీసుకువెళ్తాడు . 
ఇన్నాళ్లు ఈమెను నానాబాధలు పెట్టాము . ఇక ఈమెను శరణు వేడటమే చేయవలిసినది . శ్రీరాముడు మనల్ని కూడా చంపివేయును . ఈమె మాత్రమే మనల్ని రక్షించుటకు సమర్థురాలు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి కొంత ఊరడిల్లేను . కానీ మనసులో బాధ మాత్రము అలానే వున్నది . 

రామాయణము సుందరకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment