Tuesday 30 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పది తొమ్మిదవసర్గ

                                          రామాయణము 

                                                    సుందరకాండ -ముప్పది తొమ్మిదవసర్గ 

శిరోభూషణము ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమతో "ఓ కపివరా !ఈ మణిని చూసిన వెంటనే శ్రీరాముడు నా తల్లిని ,తండ్రిని, నన్ను గుర్తుకుతెచ్చుకొనును . పిమ్మట కార్యాచరణను ఆలోచించును . ఓ హనుమా !శీఘ్రముగా కార్యసిద్ధికి ఆలోచన చేయుము . ఈ కార్య నిర్వహణకు నేవే తగినవాడవు . ఓ మారుతీ !నడుము బిగించి ,నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము . " పలికెను . ఆ మాటలు విన్న మారుతి "అట్లే చేయుదును "అని ప్రతిజ్ఞ చేసెను . హనుమ బయలుదేరుతుండట గమనించిన సీతాదేవి "ఓ హనుమా !రామలక్ష్మణులిద్దరి కుశలం నేను అడిగానని చెప్పు . శ్రీరాముని మిత్రుడైన సుగ్రీవ మహారాజుని కుశలం  అడిగానని చెప్పు . వానరభల్లూక సైన్యము మొత్తమును వారివారి వయస్సు వారీగా క్షేమము అడిగానని చెప్పు . ఈ రోజు ఇక్కడే విశ్రమించి రేపు ఉదయమే బయలుదేరి వేళ్ళు. మళ్లీ నీవు వచ్చువరకు నేను ప్రాణములతో వుంటానోలేదో ? "అని పలికెను . 
అప్పుడు హనుమ "అమ్మా !నేను వెళ్లిన వెంటనే శీఘ్రముగా శ్రీరామచంద్రమూర్తి తన సైన్యముతో కలిసి ఇచటికి వచ్చి నిన్ను ఈ చార నుండీ విడిపించగలడు . నీవు అధైర్యపడవద్దు . గడువులోపలే శ్రీరాముడు నిన్ను చేరును . "అని పలికెను . అప్పుడు సీతాదేవి "వానరభల్లూక సైన్య విషయములో నాకొక సందేహము కలుగుచున్నది . నీవు సమర్థుడవు కావున సముద్రమును దాటి వచ్చావు . మరి రాజకుమారులు సుగ్రీవమహారాజు ,వానరభల్లూక సైన్యములు ఆ మహా సముద్రమును దాటి ఎలా రాగలవు ?"అని ప్రశ్నించెను . 
దానికి సమాధానముగా హనుమ "అమ్మా !దివ్యమంగళ స్వరూపిణీ !సుగ్రీవమహారాజు వద్ద నాకంటే బలశాలురు అనేకులు కలరు . వారు భూమిపైనా ,ఆకాశములో ,నీటిలోనూ మూడువిధములుగా వెళ్ళగలరు . సాధారణముగా దూతగా సామాన్యులనే పంపును కదా !(సీతాదేవికి దైర్యముకలిగించుటకై  హనుమ ఈ విధముగా మాట్లాడేను ) సుగ్రీవమహారాజు యావత్ సైన్యము అవలీలగా సముద్రమును దాటి రాగలరు . రామలక్ష్మణులిద్దరిని నా భుజములపై ఎక్కించుకుని తీసుకురాగలను . మనసులో ఏ మాత్రము వ్యాకుల పడవద్దు . అతి త్వరలోనే అతి పెద్దదైన వానర భల్లూక సైన్యముల కోలాహలమును నీవు వినగలవు . ఈ రాక్షసులను పరిమార్చి నీ వద్దకు వచ్చిన శ్రీరామ ప్రభువును చూడగలవు "అని ధైర్యవచనములు పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment