Sunday 14 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదియొకటవసర్గ

                                          రామాయణము 

                                        సుందరకాండ -ముప్పదియొకటవసర్గ 

శ్రీరాముని దూత ఐన హనుమంతుడు సీతాదేవికి ఒక్కదానికి మాత్రమే వినపడేలా   "ఇక్ష్వాకు వంశములో పరమధార్మికుడు సత్యసంధనుడు శ్రేష్ఠుడు ఐన దశరథ మహారాజు కలడు . అతడికి నలుగురు సంతానము .

 వారిలో పెద్దకుమారుడు  సకలసద్గుణసంపన్నుడు ,ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారము తన భార్యతో సోదరునితో కలిసి వనములకు వెళ్లెను .

 అక్కడ అనేకులైన రాక్షసులను వధించెను . తనవారిని చంపుటచే కోపించిన రాక్షస రాజు రావణుడు మాయలేడి వేషము ధరించిన మారీచుడి సాయముతో కపటోపాయము పన్ని జనక నందని ని అపహరించెను . శ్రీరాముడు భార్యను వెతుకుతూ వానర ప్రభువైన సుగ్రీవునితో స్నేహము చేసెను . 
దుర్మార్గుడైన సుగ్రీవుని అన్న వాలిని చంపి సుగ్రీవునికి పట్టము కట్టెను . సుగ్రీవుడు ప్రత్యుపకారముగా శ్రీరాముని భార్యను వెతుకుటకు వేలకోట్ల మంది వానరులను నలుదిశలకూ వెతుకుటకు పంపెను . దక్షిణ దిక్కుకు యువరాజైన అంగదుడితో ఇంకా కొంతమంది వానర వీరులతో కలిసి నేను సీతామాతను వెతుకుటకు వచ్చినాను . జటాయువు అన్న సంపాతి చెప్పినదాని ప్రకారము . ఆ మహాసాధ్వి ఈ లంకలో ఉండివుండవచ్చునని వంద యోజనములు దూరము కలిగిన మహా సముద్రమును లంఘించి ఈ లంకకు వచ్చినాను .

 శ్రీరాముడు చెప్పిన సీతాదేవి ఆనవాలు ని బాగుగా గుర్తుంచుకుని ఈ లంకా నగరమంతా వెతికినాను . చివరికి ఈ అశోకవనంలో శ్రీరాముడు చెప్పిన లక్షణములు కల పతివ్రతా శిరోమణిని చూసాను "అని పలికెను . 
ఈ మాటలు అన్ని విన్న సీతాదేవి పరమ ఆశ్చర్యముతో సంతోషముతో ఈ మాటలు ఎక్కడినుండి వినపడుతున్నాయా ?అని నలుదిక్కులా చూసి చివరకు అశోకవృక్షముపై కూర్చుని వున్న హనుమను చూసేను . 


రామాయణము సుందరకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 




No comments:

Post a Comment