Wednesday 10 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువది ఆరవసర్గ

                                      రామాయణము 

                                         సుందరకాండ -ఇరువది ఆరవసర్గ 

సీతాదేవి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ ,తనలోతాను "నాకు ప్రాణమైన భర్తకు దూరమైనా నాకు ఈ అలంకారములు ఎందుకు ?సంపదలు ఎందుకు ?ఏదేమైనను నా ఎడమకాలి గోటితో కూడా అధముడైన ఆ రాక్షసుడిని తాకను . నా భర్త నాకు దూరమైనా కూడా నేను ఎలా బతకగలుగుతున్నాను ?ఈ గుండె బహుశా ఇనుపముద్దతో చేయబడినట్లున్నది . కనుకే ఇంకా జీవించువున్నది . అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యురాలినో కదా . 
నా భర్త అరివీరపరాక్రమముడు అతడిని ఎదిరించి ఎవరూ నిలవలేరు . రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి ఈ భూమండలమును తమ బాణములతో అతలాకుతలం చేయగలరు . మరి వారు నాకోసము ఈ భూమండలం మీద వెతుకుటకు  ప్రయత్నమూ చేయుటలేదా ? ఒకవేల చేసినను నేను ఇక్కడ వున్నానని వారికి ఎలా తెలుస్తుంది . ఆ దుష్టుడు నన్ను ఎత్తుకొస్తుండగా జటాయువు ఒక్కడే చూసాడు . కానీ అతడు కూడా ఈ దుర్మార్గుడి చేతిలో మరణించాడు . 
ఈ స్థితిలో వారికి నా గురించి ఎలా తెలియును ?ఏదేమయినప్పటికీ వారిరువురు అతిత్వరలోనే నన్ను వెతుకుతూ ఇక్కడికి వస్తారు . అప్పుడు ఈ లంక అణువణువూ గాలించి రాక్షసులందరినీ ,ఒక్కరిని కూడా వదలకుండా అందరిని తుద ముట్టిస్తారు . అప్పుడు ఈ లంకలో కేవలము స్త్రీలు మాత్రమే మిగులుతారు . ఇది తధ్యము . దండకారణ్యములో ఒక్కడే పదునాలుగువేలమంది రాక్షసులను చంపినా ధీరుడు నా భర్త . విరాధుడిని చంపిన వీరుడు నా భర్త . అంతటి గొప్పవాడికి ఈ సముద్రము ఒక లెక్కా ?ఆయన తప్పక నన్ను వెతుకుతూ వచ్చెదరు . కానీ ఆయన వచ్చేవరకు నేను ప్రాణాలతో ఉండగలనా ?ఆ దివ్యమంగళ రూపమును చూడగల అదృష్టము నాకు ఉన్నదా ?"అని పరిపరి విధములుగా బాధపడుతూ ఆలోచించసాగెను . 

రామాయణము సుందరకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                శశి , 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment