Thursday 4 April 2019

రామాయణము సుందరకాండ -పదునాఱవసర్గ

                               రామాయణము 

                            సుందరకాండ -పదునాఱవసర్గ 

వాయునందనుడు ఆ అశోకవృక్షముపై కూర్చుండి ఆలోచించసాగెను . శ్రేష్ఠుడైన మిథిలా మహారాజు జనకుడు నాగలితో భూమిని దున్నుతుండగా ఈ మహాసాధ్వి భూమిలో దొరికినది . దశరధుడు పెద్ద కోడలు ఐన ఈ జానకి నేడు ఈ విధముగా రాక్షస స్త్రీల మధ్య బాధలు పడవలసివచ్చినది కదా !శ్రీరాముడి ధర్మపత్ని ఉత్తమ సద్గుణ సంభూత ఈనాడు ఈ రాక్షస చెరలో ఇలా బిక్కుబిక్కుమంటూ వుండవలసి వచ్చినది కదా !అంతఃపుర సుఖములను రాచమర్యాదలు వదులుకుని భర్తతో బయంకరములైన వనములకు ప్రీతితో వచ్చిన మహా ఇల్లాలు . 
భర్తతో పాటు ఫలమూలాదులనే సంతోషముగా భుజిస్తూ అంతః పురములో ఉన్నట్టుగానే వనములో కూడా హాయిగా విహరించుచున్న ఈ పతివ్రతాశిరోమణిని చావుమూడిన దుష్ట రాక్షసుడు ఇక్కడకు తెచ్చెను కదా !ఈ తల్లి ఇలా రాక్షసుల మధ్య వున్నా కూడా వీరి ప్రలోభములకు ,వీరి భయంకరములైన మాటలకు ,చేష్టలకు ఏ మాత్రము భయపడక శ్రీరాముని అందే తన మనసుని నిలుపుకుని ఆయనను దర్శించుటకు మాత్రమే జీవించినట్లుగా ఉన్నది. 
ఈ సాధ్వి మూలంగానే దండకారణ్యములో పదునాలుగువేలమంది రక్కసులు శ్రీరాముడి చేతిలో మరణించారు . ఖరదూషణాదులు సైతము అసువులు బాసినారు . విరాధుడు ,కబంధుడు మట్టికరిచారు . వాలి వధింపబడ్డాడు ఇప్పుడు మరణము సమీపించిన ఈ రక్కసుడు కూడా అతి త్వరలోనే చావబోతున్నాడు . ఇది తధ్యము . శ్రీరాముడు తలుచుకున్నచో ఈ సమస్త భూమండలమును అంతా తలకిందులు చేయగలడు . అంతటి పరాక్రమము కల శ్రీరాముడు కూడా తన ధ్యాస మొత్తము సీతాదేవి మీదే నిలిపి ఉండెను . ఆ మహావీరునికి తగిన ఇల్లాలు ఈమె . ఈ మహా సాధ్వికి తగిన భర్త ఆ శ్రీరాముడే . "అని అనుకుని ఈమె సీతాదేవి అని నిశ్చయించుకుని ఆ వృక్షము పైనే ఉండిపోయెను . 
రామాయణము సుందరకాండ పదనారవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 











No comments:

Post a Comment