Monday 29 April 2019

రామాయణము

                               రామాయణము 

                              సుందరకాండ -ముప్పదిఆరవసర్గ 

మహాతేజశ్శాలీ ఐన వాయునందనుడు సీతాదేవికి ఇంకా విశ్వాసము కలిగించుటకు "అమ్మా !నేను వానరుడను శ్రీరాముని దూతను శ్రీరాముడు పంపగా ఇక్కడికి వచ్చాను "అని పలికి శ్రీరాముడు తన గుర్తుగా సీతాదేవికి ఇచ్చుటకు ఇచ్చిన ఉంగరమును సీతాదేవికి సమర్పించెను . 
ఆ ఉంగరమును చూసిన సీతాదేవి నిజముగా తన భర్తను తిరిగి పొందినంత పరమానందం పొందెను . పిమ్మట హనుమపై పరిపూర్ణ విశ్వాసము కలిగినదై "ఓ వానరా !నీకు శుభమగుగాక !నిజముగా నీవు గొప్ప వీరుడవు ,సమర్థుడవు . కనుకే వందయోజనములు దూరము వ్యాపించి వున్న సముద్రమును దాటి రాగలిగావు . ఆణువణువూ రక్కసుల కాపలాలతో నిండి వున్న ఈ లంకా నగరిలో వారందరిని తప్పించుకుని నావద్దకు చేరగలిగావు . శ్రీరాముడు సర్వసమర్దుడు . ఆయన కార్యములకు యోగ్యులను మాత్రమే నియమించును . శ్రీరామచంద్ర ప్రభువు ఎలా వున్నారు . లక్ష్మణుడు కుశలమేనా ?అయోధ్యలోని వారి కుశల సమాచారం తెలియవచ్చుచున్నావా ?శ్రీరాముడు నన్ను తీసుకువెళ్ళుటకు ఎందుకు రావటంలేదు . ఆయన నన్ను మరువలేదు కదా !"అని పలికి సమాధానము కోసము మారుతిని చూసేను . 
అప్పుడు మారుతి "అమ్మా !శ్రీరాముడు సత్యసంధనుడు ,ఏకపత్నీవ్రతుడు ఆయన మిమ్ములను మరచుట జరగని పని . ఆయన అనుక్షణమూ మిమ్ములనే కలవరించును .  శ్రీరామచంద్రప్రభువు కేవలము దేహమును నిలబెట్టుకొనుటకు మాత్రమే ఆహారము తీసుకొనును . అసలు నిద్రే పట్టదు . ఒకవేళ పట్టినా సీతాసితా అని కలవరిస్తూ ఉలిక్కిపడి లేచును . ఆయనకు అనుక్షణమూ మీ ద్యాసే . కొంచం అందముగా ప్రకృతీ కనిపించినా మిమ్ములనే తలుచును ఆయనకు మీరు ఇక్కడున్న సంగతి తెలియదు . అందుకే ఇంకా రాలేదు . నేను వెళ్లి ఆ ప్రభువుకి సమాచారము ఇవ్వగానే ఆయన వచ్చి సముద్రమును అతలాకుతలం చేసి లంకానగరము చేరును . ఇక్కడి రాక్షసులందరిని మట్టి కరిపించి మిమ్ములను ఆయనతో తీసుకువెళ్లును . "అని పలికెను . 
రామలక్ష్మణుల సమాచారం తెలిసినందుకు సీతాదేవి మిక్కిలి సంతోషించెను . వెంటనే శ్రీరాముడు తన వలన వేదనపడుతున్నాడని ఆమె కూడా బాధపడెను . 

రామాయణము సుందరకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment