Tuesday 9 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువదినాల్గవసర్గ

                                    రామాయణము 

                                 సుందరకాండ -ఇరువదినాల్గవసర్గ 

వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకా దగ్గరగా జరిగి వారి భయంకరమైన మాటలతో ,చేష్టలతో సీతాదేవిని బయపెట్టసాగిరి . "ఓ సీతా !అత్యత్భుతమైన రావణుని అంతఃపురంలో హాయిగా ఉండక ఎందుకు నీకీ బాధలు ?మానవకాంతవైన నీవు మనిషికి భార్యగా ఉండుటయే గొప్పగా భావిస్తున్నావు . నీవు ఎప్పటికీ ,ఏవిధముగాను రాముడిని చేరలేవు . రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకములలోని సర్వ సంపదలకు అధికారి . ఆయనకు భార్యవై హాయిగా ఉండుము . "అని పలికెను . 
అప్పుడు సీత "మీకు నచ్చినట్టు నన్ను చంపి తినేయండి . అంతేకాని మీరు చెప్పినట్టు నేను చేయనే చేయను . రాజ్యభ్రష్టుడైన ,మానవుడైనా నాభర్తే నాకు దైవము . ఏదేమైనను నేను నా భర్తను తప్ప మరొకరిని ఆలోచనకి కూడా రానివ్వను "అని పలికెను . 
అశోకవృక్షముపై కూర్చుని మౌనముగా వున్న  హనుమ ఇదంతా చూడసాగెను . అప్పుడా ఆ రాక్షస స్త్రీలు మిక్కిలి కోపముతో సీతాదేవికి మిక్కిలి దగ్గరగా వచ్చి నాలుకలు బయటకు పెట్టి ,పెదవులు చప్పరిస్తూ సీతాదేవిని బయపెట్టసాగిరి . వారు గండ్రగొడ్డళ్లను చేతబూని "రావణుడిని భర్తగా పొందుటకు ఈమె తగదు "అని పలికిరి . అప్పుడు సీతాదేవి కన్నీటిని తుడుచుకుంటూ అశోకవృక్షము మూలకు జరిగెను . రాక్షస స్త్రీలు కూడా సీతాదేవికి దగ్గరగా జరిగిరి . 
భయంకర ఆలంకారము కల వినత అను రాక్షసి "ఓ సీతా !ఇప్పటివరకు నీవు నీ భర్తపై చూపిన ప్రేమ చాలు . ఏ విషయములోనైనా అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారి తీయును . మానవకాంతా ధర్మము బాగా ఆచరించావు . సంతోషము . ఇక చాలు రాముని త్యజించి దేవేంద్రుడి అంతటి వాడైనరావణుని భర్తగా పొందు . నేను చెప్పిన ఈ మాటలు విననిచో ఇప్పుడే నిన్ను చంపి తినేస్తాము "అని పలికెను . 
పిదప 'వికట 'అను రాక్షసి పిడికిలి బిగించి సీతను భయపెట్టుచూ "ఓ సీతా !నీకు బుద్దిలేదు . కాబట్టే మేమందరము నీ మంచి కోరి చెప్పిన మాటలేవి నీవు వినుట లేదు . నీవు సముద్రమునకు ఇవతలి తీరమునకు తీసుకురాబడినావు . ఇక్కడికి చేరుట కానీ ,నిన్ను కాపాడుట కానీ ఎవ్వరికి తరము కాదు ఏడుపు ఆపి రావణుని భర్తగా పొందు అప్పుడు మేమందరము నీకు దాసీలము . నేను చెప్పిన మాటలు విననిచో నీ గుండెను  చీల్చి గుండెను తింటాను "అని పలికెను . 
అప్పుడు ఛందోదరి అనే రాక్షసి శూలమును తిప్పుతూ "ఈమె యాకృత్తుని (గుండెకు కుడివైపు వుండు మాంసము )ప్లీహము (గుండెకు ఎడమవైపు వుండు మాంసము ),వుత్పీడనము (గుండెకు పైనుండు మాంసము ),గుండె ,ప్రేగులు ,శిరస్సు తినాలని కోరికగా ఉన్నది "అని పలికెను . 

అప్పుడు ప్రఘస అనే రాక్షసి "ఈమె దారికి వచ్చేలా కనిపించుటలేదు . వృధాగా కూర్చోవటం ఎందుకు ?ఈ మూర్ఖురాలి కంఠము నులిపివేసి ,మానవకాంత మరణించిందని రాజుకి నివేదిద్దాము . అప్పుడు ఆయనే 'అయినచో తినేయండి 'అంటారు . ఇందుకు సందేహము లేదు . 
అప్పుడు 'అజాముఖి 'అనే పేరుకల రాక్షసి "మనందరమూ అనవసరముగా తగువు పడవద్దు . ఈమెను ముక్కలుగా కోసి సమానముగా పంచుకుని తిందాము "అని పలికెను . అప్పుడు మిగిలిన రాక్షస స్త్రీలు 'సరే అలాగే చేద్దాము . మద్యము తీసుకురండి . మద్యము త్రాగి నరమాంసము భక్షించి నికుంభిళాదేవి (లంక యొక్క పశ్చిమ ద్వారమందలి భద్రకాళి )తృప్తికై నృత్యములు చేద్దాము . "అని పలికెను . వీరందరి మాటలు విన్న సీతాదేవి ధైర్యము కోల్పోయి ఏడ్చెను . 

రామాయణము సుందరకాండ ఇరువది నాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం .  ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment