Tuesday 30 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                             రామాయణము 

                            సుందరకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

సీతాదేవి పలికిన మాటలు విని హనుమ సంతోషముతో "తల్లీ !నీ మాటలు సహేతుకములు ,పాతివ్రతలానమ్రతకు తగినవి . నీవంటి పతివ్రతా శిరోమణికి ఆ లోకోత్తమ మూర్తియే తగినవాడు . సరే తల్లి నీకు నాతొ రావటం ఇష్టములేకపోతే ,నీ ఆనవాలుగా ఏదైనా ఇవ్వు "అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి "ఓ వానరశ్రేష్టా !నాకూ శ్రీరామునికి మాత్రమే తెలిసిన ఒక కధ చెబుతాను . దానిని నా గుర్తుగా శ్రీరామునికి చెప్పు "అని కధ ఇలా చెప్పసాగెను "చిత్రకూటపర్వతము ఈశాన్యభాగమున ఒక చిన్న పర్వతము కలదు . అక్కడ ఫలమూలములు ,ఉదకము సముద్దిగా ఉంటాయి . ఆ ప్రదేశములో మందాకినీ నదీ సమీపమున ఒక సిద్దాశ్రమములో కొంతకాలము శ్రీరామునితో కలిసి ఉన్నాను . 
ఒక రోజు నేను అక్కడి వనములలో ,నదీ తీరములలో విహరించి అలసి శ్రీరాముని చెంత కూర్చుని ఉండగా ఒక కాకి (ఇంద్రుని వరము వలన జన్మించినది )వచ్చి మాంసము మీది ఆశతో నన్ను పొడవసాగెను . నేను చేతులతో అదిలించసాగాను . కానీ అది పోకుండా నన్నే పొడవసాగెను . నేను అక్కడ వున్న మట్టి బిడ్డలు దాని మీద వేసి అదిలించే ప్రయత్నమూ చేసాను . కానీ అది ఎంతకూ పోవటం లేదు అలా దానిని బెదిరించు సమయములో  నా వడ్డాణము జారుటచే నేను సరిచేసుకోవడం చూసి ,శ్రీరాముడు నవ్వేను . 
అప్పుడు నాకు సిగ్గుగా అనిపించెను . కొంతసేపటికి శ్రీరాముడు నా వొడిలో నిద్రించెను . అప్పటికీ కాకి బాధ నాకు తప్పలేదు . శ్రీరాముడు నా వొడిలో పడుకుని ఉండుటచే నేను లేచి కాకిని అదిలించలేకపోయాను . దానితో అది ఇంకొంచుం విజృంభించి నన్ను పొడవసాగెను . నేను ఎంత అదిలించినా అదిపోక నన్ను పొడుచుతుండుటచే అది పొడిచినచోట రక్తము కారసాగెను . ఆ రక్తము శ్రీరామునిపై పడి ఆయనకు మెలకువ వచ్చెను . నిద్రలేచిన శ్రీరాముడు రక్తమోడుతూ ఉన్న నన్ను చూసి  మిక్కిలి క్రుద్ధుడై "భయంకరమైన సర్పము పడగ తాకుటకు చూసినట్టు నీ జోలికి వచ్చినవాడెవడు ?వాడిని ముల్లోకములలో రక్షించువాడెవ్వడూ ఉండడు "అని పలికి ఎదురుగా వున్న వాయసము (కాకి )ని చూసి తన దగ్గరలో వున్న దర్భను తీసుకుని బ్రహ్మాస్త్రముగా మంత్రించి కాకి మీదకు ప్రయోగించెను . అది నిప్పులు కక్కుతూ కాకివైపుగా వెళ్లగా ,అది తన ప్రాణ రక్షణ కొఱకు లోకాలన్నీ తిరిగేను 
తనతండ్రి ఐన ఇంద్రుడు కానీ ,సమస్త దేవతలు కానీ కాకికి అభయము ఇవ్వలేకపోవుటచే అది తిరిగి మా దగ్గరకే వచ్చి శ్రీరాముని పాదములపై వాలి ఆయనను శరణు వేడెను . శరణు వేడినంతనే శ్రీరాముడు కరుణించి ఆ కాకిని క్షమించి వదిలివేసెను "ఈ కధ శ్రీరామునికి చెప్పు ఇంకా ఆయనతో "ఓ ప్రాణనాథా !మీరు  వచ్చి నన్ను కాపాడతారనే ఆశతోనే ఇన్నిరోజులూ జీవించివున్నాను . పరాక్రమమును నీకు సాటి ఐన వారు ఈ భూమండలముపై ఎవరూలేరు . నీవు తలుచుకున్నచో ఈ రాక్షసులందరినీ క్షణకాలంలో మట్టుపెట్టగల సమర్థుడవు . మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నావు . అతి త్వరగా వచ్చి నాకు నీ దర్శన భాగ్యము కలిగించు . నాకు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువు వున్నదినీ గడువు లోపల నీవు నా కొరకు రాలేకపోతే ఈ జన్మలో ఇక నేను నిన్ను చూడలేను . నా యందు దయ ఉంచి త్వరగా వచ్చి నన్ను రక్షించు చి చెప్పు "అని కన్నీరు కారుస్తూ హనుమతో పలికెను . 
ఆ మాత  కన్నీరు చూసిన హనుమ మిక్కిలి బాధతో అమ్మా !బాధపడకు ,నేను వెళ్లిన వెంటనే శ్రీరాముడు సుగ్రీవసహితుడై ,వానర భల్లూక సైన్యముతో కలిసి వచ్చును నిన్ను తప్పక రక్షించును . శ్రీరామునికి ,లక్ష్మణునికి నీ మాటగా ఏమి చెప్పమంటావు ?"అని పలుకగా సీతాదేవి "శ్రీరాముని పాదపద్మములకు నా ప్రణామములు తెలుపు లక్ష్మణుని నేను అడిగానని చెప్పు "అని పలికి తన చీర కొంగులో వున్నా చూడామణిని హనుమకు ఇచ్చినది . 



సీతాదేవి ఇచ్చిన చూడామణిని కళ్ళకు అద్దుకుని దానిని చేతికి పెట్టుకొనెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియెనిమిదవసర్గ సమాప్తము . 

                          శశి 

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment