Tuesday 9 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువదిమూడవసర్గ

                                    రామాయణము 

                             సుందరకాండ -ఇరువదిమూడవసర్గ 

రావణుడు రాక్షస స్త్రీలకు సీతాదేవిని ఒప్పించమని ఆజ్ఞ ఇచ్చి అంతఃపురమునకు వెళ్లిపోయెను . పిమ్మట అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు బయంకరాకారులై సీతాదేవి వద్దకు వచ్చిరి . 
వారిలో ఏకజట అను పేరుకల రాక్షసి సీతతో "ఓ సీతా !షట్చక్రవర్తులలో నాలుగవవాడైన పులస్త్యుడి వంశంవాడే ఈ రావణుడు . రావణుడు ఎంతో గొప్పవాడు అరివీరభయంకరుడు . అట్టి రావణుని వరించి సంతోషముగా ఉండక నీకు ఈ బాధలెందుకు "అని పలికెను . 
పిల్లి కన్నులు కలిగిన 'హరిజట' అను రాక్షసి "ఓ జానకీ !దేవేంద్రునితో సహా దేవతలందరూ రావణుని చేతిలో ఓడిపోయారు . రావణుడు గర్వింపతగినవాడు ,పరాక్రమము కలవాడు ,మహావీరుడు ,శూరుడు ,రణరంగమున వెన్నుచూపనివాడు ,మహాబలశాలి ,మహా శక్తిసంపన్నుడు ,అట్టివాడికి భార్యవు అవుటకు ఎందుకు అంగీకరించవు ?"అని పలికెను . 
అప్పుడు' ప్రఘస 'అను రాక్షసి "రావణుని భార్యలందరిలో మండోదరి సర్వ సౌభాగ్యవతి . ఆమె అంటే రావణునికి ఎనలేని ప్రేమ గౌరవము , కూడా వీడి రావణుడు నిన్ను పొందకోరుతున్నాడు . బంగారముతో అమూల్యమైన రత్నములతో విలసిల్లే రావణుని అంతః పురములో వేలకొలది స్త్రీలు కలరు . వారందరిని కూడా వీడి రావణుడు నిన్ను కావాలనుకుంటున్నాడు "అని పలికెను . 

తదుపరి 'వికట 'అను పేరుకల రాక్షసి "రావణుడు యుద్దములో దేవతలను ,నాగులను ,గంధర్వులు ,దానవులను అనేకసార్లు ఓడించాడు . అంతటి రావణునికి భార్యవగుటకు నీవు ఎందుకు ఇష్టపడకున్నావు ?"అని పలికెను . 
పిమ్మట' దుర్ముఖి 'అను పేరుకల రాక్షసి "రావణునికి బయపడి సూర్యుడు తీక్షణ కిరణములను ప్రసరింపచేయుటకు భయపడతాడు . వాయువు పెద్దగా వీచడు . చెట్లు ఆయన కోరిక మేరకే పూలు కురిపిస్తాయి . ఓ భామినీ !రావణుడు రాక్షసులకు రాజు అంతేకాదు రాజులకేరాజు అట్టి రావణునిపై ఎందుకు మనసుపడవు ?అతని భార్యవగుట కు ఎందుకు సిద్దపడవు ?నా మాటలు గ్రహింపుము . లేనిచో నీవు బ్రతికి వుండవు . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 

                     శశి ,

 ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment