Saturday 13 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదియవసర్గ

                                 రామాయణము 

                                      సుందరకాండ -ముప్పదియవసర్గ 

అశోకవృక్షముపై కూర్చుని ఉన్న మారుతి రావణుని పలుకులు ,రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట ,త్రిజట స్వప్నవృత్తాంతము ,పిదప సీతాదేవి వ్యాకులపడుతూ తనలో తానూ పలికిన మాటలు వీటన్నిటిని విని అక్కడి పరిస్థితులను అర్ధము చేసుకొనెను . పిదప తనలోతాను "తీవ్రమైన వత్తిడిధాటికి  ఈమె మనసు వ్యాకులమై వున్నది . ఇటువంటి పరిస్థితులలో నేను ఈమెను ఓదార్చకుండా వెళ్ళిపోయినచో రాజపుత్రిక అయిన సీతాదేవి ఎటువంటి రక్షణ ఉపాయము తెలియక తన ప్రాణములు తప్పక తీసుకొనును . కావున నేను ఈమెతో మాట్లాడి వెళ్లవలెను . 
ఒకవేల నేను మాట్లాడకుండా వెళ్ళినట్లయితే నన్ను చూసిన వెంటనే శ్రీరామప్రభువు "జానకి నా గురించి అడిగినదా ?అని ప్రశ్నించిన నేను ఏ సమాధానము చెప్పగలను ?నేను మాట్లాడకుండా వెలికిపోతే ,ఈ మహాసాధ్వి ఈ రక్కసి మూకలమధ్య నిలువలేక ఆత్మత్యాగము చేసుకున్నచో సుగ్రీవుడు శ్రీరామునితో కలిసి యుద్ధమునకు ఇచటికి వచ్చినా ప్రయోజనము వుండదుకదా !నేను ఇక్కడే ఉండి ఈ రాక్షస స్త్రీలు నిద్రించినప్పుడు కానీ ,ఏమరపాటుగా వున్నప్పుడు కానీ సీతాదేవితో మాట్లాడవలెను . కానీ ఈమెతో నేను ఎలా సంభాషించను ?సంస్కృతములో మాట్లాడితే రావణుడు మాయా వేషమున వచ్చినాడని జనకానందని భీతిల్లు ప్రమాదం ఉన్నది . 
ఇప్పుడు నేను వానర రూపమున వున్నాను . ఈ రూపమున ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇదంతా రావణుడి మాయగా ఈ సాధ్వి అనుకోవచ్చును . అలా భావించినచో ఈమె బిగ్గరగా కేకలు వేయును . అలా కేకలు వేస్తె ఇక్కడ కాపలా కాయుచున్న రాక్షసులంతా చుట్టుముట్టి నన్ను భందించడమో ,లేక చంపడమొ చేస్తారు . చావు గురించి నాకు భయము లేదు కానీ ,సీతామహాసాధ్వి ఇక్కడే ఉన్నదని నేను మరణించినచో రామునికి ఎలా తెలియును  ?కావున నా ప్రాణములు నిలుపుకొనుట ,ఇక్కడి నుండి బయట పడుట  ఉత్తమము . అంతకు ముందు ఎలాగయినా ఈ మాతతో మాట్లాడవలెను . కానీ ఎలా మాట్లాడాలి ?ఈమె నన్ను విశ్వసించుట ఎట్లు ?"అని తనలోతాను ఆలోచించుకుని ఒక కృత నిశ్చయమునకు వచ్చెను . 
"శ్రీముడు నాకు ప్రభువు . ఆయన సర్వశ్రేష్ఠుడు . ఆయన కదా గానము చేసి సీతామాతకు విశ్వాసము కలిగిన పిమ్మట ఈమె ఎదురుగా వెళ్లి మాట్లాడుట ఉత్తమము "అని  తలఁచెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment