Monday 1 April 2019

రామాయణము సుందరకాండ -పదునాల్గవసర్గ

                                 రామాయణము 

                                 సుందరకాండ -పదునాల్గవసర్గ 

మారుతి మనసులో ధ్యానము చేసుకుని ఒక్క గెంతులో రామబాణములాగా వేగముగా ఆ అశోకవనములోకి దూకేను . ఆ చప్పుడుకి  ఆ వనములోని చెట్లపై నిద్రిస్తున్న పక్షులన్నీ లేచెను . ఆ విధముగా పక్షులు నిద్రనుండి కంగారుగా లేచి ,పైకి ఎగిరిపోసాగెను . అలా పైకి అవి ఎగిరిపోనపుడు ఆయా చెట్లపై ఉన్న పూలన్నీ వాటి రెక్కల తాకిడికి  రాలిపోసాగెను . అలా రాలిన పూలు అక్కడే చెట్ల కింద వున్న హనుమంతుడుపై రాలేను . అలా రాలుటచే హనుమంతుడు పూలకొండలా కనిపించాడు . అప్పుడు హనుమంతుడు ఆ వనములోని చెట్లపై ఒకదానినుండి ఒకదాని మీదకు దూకుతూ ఆ వనమంతా సీతాదేవి జాడ కొఱకు అన్వేషించసాగెను . 
అలా దూకునపుడు ఆ వృక్షములపై మిగిలిన పూలు కూడా రాలిపోయి ,ఆ ప్రదేశమంతా పూలతో ,పూరేకలతో నిండిపోయెను . ఆ క్షణమున అక్కడి చెట్లు పక్షులు ఎగిరిపోయి ,పూలు పళ్ళు రాలిపోయి దీనంగా ఉండెను . భూమాత చక్కగా అలంకరించినట్టు ఉండెను . అటువంటి వనములో హనుమ సీతాదేవి జాడ వెతుకుతూ ముందుముందు కు సాగెను . అక్కడ ఆయనకీ పర్వతము ,అందలి గుహలు పక్కనే రామణీయముగా ప్రవహించే నది కనిపించెను . అప్పుడు మారుతి తనలో తాను "ఈ రావణుని వనమంతా చందనపు వృక్షములతో స్వచ్ఛమైన నదితో పరమ రమణీయముగా ఉండెను . నేను విన్న దాని ప్రకారము సీతాదేవికి వనములన్న పెక్కు ఇష్టము . రామవిరహముతో బాధపడుతున్న సీతామహాసాధ్వి ఉపశమనముకోసము ఇచటికి తప్పక వచ్చును . "అని అనుకొనెను . ఆ మహావీరుడు అక్కడే వున్న ఎత్తైన శింశుపా వృక్షముపై ఎక్కెను . అచటికి ఎక్కి ఆ వనమంతా పరిశీలించసాగెను . 

రామాయణము సుందరకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment