Saturday 6 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువదియవసర్గ

                               రామాయణము 

                            సుందరకాండ -ఇరువదియవసర్గ 

పతివ్రతయు ,తపోనిష్ఠలోవున్నదియు ,దుఃఖితయు దీనురాలు ఐన ఆ సీతాదేవికి రావణుడు హస్తముఖాదిసంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనో భావములను ప్రకటించెను. "ఓ సుందరీ !సీతా !నాకు భయపడి ముఖము చాటుచేసుకొనుచున్నావా ?ఏమి ?. నీవు నాకు భయపడవలసిన అవసరరము లేదు . నేను నిన్ను ప్రేమించుచున్నాను . . ఓ ప్రియురాలా !నన్ను ఆదరింపుము . ఓ సీతా !మనుష్యులు కానీ ,కామరూపులైన రాక్షసులు కానీ ఇక్కడ ఎవరూ లేరు . నేను ఒక్కడినే వున్నాను . నావలన నీకు ఏ మాత్రము భయమక్కరలేదు . బలవంతముగా పరస్త్రీలను అపహరించుట రాక్షసుల ధర్మము . కానీ నాపై ప్రేమలేని నిన్ను నేను తాకనే తాకను . కనుక ఓ దేవి భయపడకు. నన్ను నమ్ము మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు . 
ఓ సుందరీ !ఒక జాడను కలిగివుండుట ,నేలపై నిద్రించుట ఎప్పుడూ ఆలోచించుచుండుట ,మాలిన వస్త్రములు ధరించుట ,నిష్కారణముగా ఉపవాసములు చేయుట ,ఇలా శోకించుట నీకు ఏ మాత్రము తగినవి కావు . ఓ మైథిలీ !యవ్వనము వేగముగా ప్రవహించు నదీ జలముల వంటిది . యవ్వనము కరిగిపోయిన తిరిగి రాదు . నీవు నీ యవ్వనమును అనవసరముగా వ్యర్ధము చేసుకొనుచున్నావు . నేను అన్ని దిశలనుండి అనేకమంది సుందరీమణులు తీసుకువచ్చాను . నీవు నన్ను చేపట్టినచో నీవే నా పట్టపురాణివి అవుతావు . నా అంతః పురములో ఎంతో మంది సుందరీమణులు కలరు . వారందరూ లక్ష్మీదేవిని అప్సరసలు సేవించినట్టు నిన్ను సేవిస్తారు . 
నేను ఈ సమస్త లోకములను జయించి లెక్కలేనంత సంపదను సాధించాను . దానినంతటిని నీవే అనుభవించు . బంగారముతో నిర్మితమై రత్నమణిమయమయిన ఈ లంకా నగరము నీదే . ఈ రాజ్యము నీదే ,ఇన్ని మాటలు ఎందుకు నేను నీ దాసుడను . నీవు ఎలా చెబితే నేను అలా చేస్తాను .  నా ఈ సంపదను అంతా యథేచ్ఛగా నీవు అనుభవించవచ్చు . నీకు నచ్చిన వస్త్రములు ధరించవచ్చు . ఆభరణములు ధరించవచ్చు . ఆహారము తినవచ్చు ,అధికారము చేయవచ్చు ,లేదా నీకు నచ్చినన్ని దానములు చేయవచ్చు . నీవు నన్ను చేపట్టినచో ఈ భూమండలమునంతా జయించి నీ తండ్రి జనక మహారాజుకు కానుకగా ఇస్తాను . నీవు ఆనందముగా ఉండవచ్చు . నీ బంధువులు అందరూ కూడా ఈ సంపదను అనుభవిస్తూ సంతోషముగా ఉండవచ్చు . 

రాముడు జయమును ,సంపదలను కోల్పోయాడు . పైగా అడవుల పాలయ్యాడు . మునీవ్రతమును పాటించుచున్నాడు . నేలపై నిద్రించువాడు . ఇంతకూ అతడు జీవించి వున్నాడోలేదో ?అయినను నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు పొందుట కాదు కదా కనీసము నిన్ను చూడనుకూడా చూడలేడు . ఈ లోకములో ఎంతగా గాలించి చూసిన నన్నెదిరింపగల యోధుడు ఎవ్వడు లేడు . రణరంగమున సాటిలేని నా పరాక్రమము గురించి నీవు తెలుసుకో . యుద్ధభూమిలో అనేకసార్లు నేను సురాసురులను మట్టి కరిపించాను . వారి ధ్వజములను భగ్నమొనర్చాను . వారెవ్వరూ శత్రువులుగా నా ఎదుట నిలవలేరు . ఓ జానకీ !మేలిమి బంగారు ఆభరణములు దరింపుము . సముద్రతీరమునందు ,బాగుగా పుష్పించి తుమ్మెదలు వాలివున్న వృక్షములు కల వనములలో నాతొ కలిసి విహరించుము . 

రామాయణము సుందరకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment