Monday 8 April 2019

రామాయణం సుందరకాండ-ఇరువదిఒకటవసర్గ

                                             రామాయణం 

                                           

                                               సుందరకాండ-ఇరువదిఒకటవసర్గ 

భయంకరములైన ఆ రాక్షసుని పలుకులు విని ,దీనురాలైన ఆ సీతాదేవి గడ్డిపరకనే బ్రహ్మాస్త్రముగా చేసి ,కాకాసురుడిని చంపిన తన భర్త శ్రీరాముని మనసులో తలచుకుని ,గడ్డిపరకను తనకు ,రావణునికి అడ్డుగా పెట్టుకుని  దీనస్వరంతో నెమ్మిదిగా ఇలా సమాధానమిచ్చెను . 
"నీ మనసుని నా మీద నుండి మరల్చుకుని నీ భార్యలమీదికి మరల్చుకో . ఉత్తమవంశములో పుట్టినదానిని ,దశరధుని పెద్దకోడలిని ,అమిత పరాక్రమవంతుడైన శ్రీరాముని ధర్మపత్నిని ,పతివ్రతని ఐన నేను ఎట్టి పరిస్థితిలో నా భారతను మరచి వేరొకరిని మనసులో తలుచుట కూడా జరగదు . దనము ఆశ చూపినా ,ఎటువంటి ప్రలోభములు పెట్టవలెనని చూసినా ఏ మాత్రము ప్రయోజనము ఉండదు . నీ సమయము వృధా అవుతుంది . కావున నీ మనసు మార్చుకుని రాజ్యభోగములు అనుభవిస్తూ ,నీ భార్యలతో సంతోషముగా వుండు . నన్ను ఆ శ్రీరామునికి అప్పగించు . అదే నీకు ,నీ రాజ్యమునకు ,నిన్ను నమ్ముకున్న వారికి మంచిది . శ్రీరాముడు శరణాగత వత్సలుడు . శరణు వేడినవాడు బద్ధశత్రువైనా పరమదయాలుడు ఐన శ్రీరాముడు నిన్ను తప్పక క్షమించెదరు . 

ధర్మము తప్పి ప్రవర్తించువాడు . ఎంతటి బలవంతుడు అయినను ,ఎంతటి అధికారము ఉన్నను ,ఎంతటి సంపద ఉన్నను ,ఎంతటి బలగము ఉన్నను ,తుదకు అవన్నియు నాశనము అయితీరుతాయి ఇది నిజము . ఇంద్రుడి వజ్రాయుధము నుండి తప్పించుకోగలవేమో కానీ శ్రీరాముని వాడి అయిన బాణములంనుండి తప్పించుకొనుట నీకు అసాధ్యము . భూమ్యాకాశములను దద్దరింపచేసే భయంకరమైన శ్రీరాముని ధనుష్టంకారమును అతి తొందరలోనే నీవు వింటావు . ఓ రావణా !నా భర్త ఐన శ్రీరాముడు దండకారణ్యములో ఒక్కరే నిలిచి నీ సైన్యము ఐన ఖరదూషణులను ,పదునాలుగువేలమంది సైన్యముని మట్టికరిపించారు . ఆయనను ఎదుర్కొను సామర్ధ్యము లేక నన్ను దొంగతనముగా  అపహరించినావు . నీకు ఆయువు మూడినది . కైలాసగిరి పరుగులు తీసినను ,కుబేరుని అలకాపురికి చేరినను ,వరుణ దేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకోలేవు . ఇది తధ్యము . "అని పలికెను . 


రామాయణము సుందరకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment