Friday 30 September 2016

రామాయణము అయోధ్యకాండ _ఏడవసర్గ

                         రామాయణము 

             అయోధ్యకాండ _ఏడవసర్గ 

కైకేయి పుట్టినింటి నుండి వివాహ సమయములో మెట్టినింటికి వచ్చునప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసీ మంధర . ఈమె పుట్టుపూర్వోత్తరములు తెలియరావు . శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు ఈమె యాదృచ్చికంగా అటు ఇటు తిరుగుతూ ప్రసాదము మీదకు ఎక్కెను . నగరంలోని వీధులు ,గృహములు చక్కగా అలంకరింపబడి ఉండుట అన్ని గృహములు మొదలగు ఎత్తు ప్రదేశములు మీద ధ్వజములు ఎగురుట ,జనులందరూ తలంటు పోసుకుని అందముగా అలంకరించుకుని ఉండుట చూసి ఆశ్చర్యపోయేను . 
సమీపమున గల మెడపై శ్రీరాముని పెంచిన దాది పట్టువస్త్రములు ధరించి ముఖమున సంతోషకాంతులు ఉప్పొంగుచున్నట్లుగా ఉండెను . ఆమెను చూసిన మంధర "దశరథ మహారాజు ఏదైనా గొప్ప ఘనకార్యము చేయబోతున్నారా ?నగరమంతా ,జనులంతా కళకళలాడుచున్నారు "అని అడిగెను . అంత ఆ దాది సంతోషముతో ఉక్కిరిబిక్కిరి అవుతూ "మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరించబోవుచున్నది . శాంత స్వభావుడు అయిన శ్రీరాముని  రేపే దశరథ మహారాజు యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయబోతున్నారు ". అని గూని ముందరకు ఆ దాది చెప్పేను
ఆ మాటలు వినిన వెంటనే అసూయ చే దహింపబడు ఆ గూని మంధర కైలాసము వాలే ఎత్తుగా వున్న ఆ ప్రసాదమును గబగబా దిగి శయ్యపై పరుండిన కైక వద్దకు చేరి ఇలా పలికెను . "ఓ మూఢురాలా !లే భయంకరములైన పెను ఆపదలు ,దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోవుచుండగా తెలుసుకోలేక ఇంకా ఇలా పరుంటివేలా ?. ఓ కైకా !నీ భర్తకు నీపైనే ఎనలేని ప్రేమున్నట్లు భ్రమపడుచున్నావు . వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలములోని నాదీ జలముల వలె తరిగిపోవుచున్నది . "పాపాత్మురాలైన మంధర ఇట్లు పరుష వాక్యములు పలుకగా కైక విషాదమునకు లోనయ్యి "నీ ఈ భాదకు కారణమేమి అశుభమేమి సంభవించలేదుకదా " అని అడిగెను . 
కైకేయి హితము కోరు ఆ మంధర ఇంకనూ విషణ్ణ వదనురాలై ,ఇలా పలికెను . "ఓ దేవి !కపటి అయినా నీ భర్త భర్తకుడికి కాక శ్రీరాముడికి యువరాజుగా పట్టాభిషేకము చేయబోవుతున్నాడు . భరతుడిని బంధువుల ఇంటికి దూరముగా పంపి ఆయన రేపే రామునికి పట్టాభిషేకము చేయబోవుతున్నాడు . ఆ కారణముతో శోకాగ్నితో దహింపబడుతున్న నేను విలవిలలాడుతూ నీ హితము కోరి ఇటు వచ్చినాను . ఓ కైకేయి !నేకేమాత్రము ఆపద వచ్చినా నా వేదనకు అంతమే ఉండదు . ఓ కైక నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకోగల సమర్థురాలవు . ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచించు . అంతే కాదు నీ పుత్రుడైన భరతుడిని కూడా రక్షించుకో . "అని పలికెను . 
అప్పటివరకు శయ్య పై పరుండిన మంధర ఆ మాటలు విని పరమానంద భరితురాలై వికసితవదన అయి లేచి కూర్చుండి ,శ్రీరామపట్టాభిషేక వార్తా కు ఆశ్చర్యముతో సంతోషముతో ముందరకు ఓకే విలువైన ఆభరణమును బహూకరించేను . ఆ మంధరతో "ఓ మందరా !చాలా మంచి వార్తను తీసుకొచ్చావు . నాకు చాలా సంతోషముగా వుంది . రామ భరతులిద్దరూ నాకు సమానులే . నీవు ఇంతకంటే నాకు సంతోషకరమైన వార్త చెప్పలేవు . ఈ వార్త తెచ్చినందుకు గాను నీకు వరమును తప్పక ఇచ్చెదను . ఏమి వారము కావాలో వెంటనే కోరుకో "అని మంధరతో కైకేయి పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ఏడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ).తెలుగు పండితులు . 

                  
















Thursday 29 September 2016

రామాయణము అయోధ్యకాండ _ఆరవసర్గ

                                     రామాయణము 

                                   అయోధ్యకాండ _ఆరవసర్గ 


                వశిష్ట మహర్షి వెళ్లిన పిమ్మట శ్రీరాముడు స్నానాది కృత్యములను ముగించుకుని ,నిశ్చల మనస్కుడై ,విశాలాక్షి అగు ధర్మపత్ని  సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించెను . పిమ్మట హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చి ,అగ్నికి ప్రదక్షణ నమస్కారములు ఒనర్చి శాస్త్రప్రకారము హోమముచేసెను . మిగిలిన హవిస్సును తానూ సీతాదేవి శ్వీకరించెను . విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్త్రాణము పై వారు శయనించెను . 
శ్రీరాముడు వేకువజామునే మేల్కొని తన గృహమును పూర్తిగా అలంకరింపచేసెను . పిమ్మట అతడు సూర్యుని ఉపాసించి ,గాయత్రి మంత్రమును పాటించెను . సంద్యోపాసన అనంతరము శ్రీరాముడు పట్టువస్త్రములను ధరించి ,శ్రేమన్నారాయణుకి సాష్టాo గ  నమస్కారము చేసెను . పిమ్మట బ్రాహ్మణులు సీతారాములకు స్వస్తివాచనములు తో ఆశీర్వదించిరి . ఆ వేద ఆశీర్వచనముల ఘోష అయోధ్య అంతటా మారుమ్రోగేను . శ్రీరాముని పట్టాభిషేకము జరగబోవుతున్నదని జనులందరూ వేకువజామునే లేచి తమ గృహములను ,వీధులను ,శుభ్రపరచి  వాటిని చక్కగా అలంకరించిరి . అంత ఆ పురము ఏంటో శోభాయమానంగా ఉండెను . అన్ని ఎత్తు ప్రదేశములు మీదను (గృహములు ,వృక్షములు ,ప్రాకారములు ,దేవాలయములు )ధ్వజపతాకములు ఎగురుతూ ఉండెను . గాయకులూ పాటలు పాడుచూ ,నర్తకులు నాట్యము చేస్తూ అక్కడి వారినందరి మనసులు దోచుకొనుచు ఉండెను . శ్రీరామ పట్టాభిషేక  సమయము  సమీపించుచుండగా స్త్రీలు ఇళ్లలో ,పురుషులు బయట శ్రీరాముని గాధలను చెప్పుకొనుచూ మురిసిపోవుచుండిరి . బాలబాలికలు సైతము రామ గాధలు గుంపులు గుంపులుగా చేరి చెప్పుకొనుచుండిరి . 
జానపదులు సైతము శ్రీరామ పట్టాభిషేకమును దర్శించవలెననే కోరికతో అయోధ్యకు వచ్చి ,పురజనులు చెప్పుకొనుచున్న రాముని గాధలను ,గుణగణములను వినిరి . వివిధ దేశములనుండి ,అయోధ్య మారుమూలనుండి వచ్చిన జనములతో ఆ అయోధ్యా నగరము సాగరఘోషను తలపించుచు ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ ఆరవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 














               

Wednesday 28 September 2016

రామాయణము అయోధ్యకాండ -ఐదవసర్గ

                              రామాయణము 


                            అయోధ్యకాండ -ఐదవసర్గ 

దశరథ మహారాజు వశిష్ట మహర్షిని పిలిపించి శ్రీరామునికి ఉపవాస దీక్షను మంత్రపూర్వకముగా ఉపదేశించమని కోరెను . అంతట వశిష్ట మహర్షి వేగముగా వేళ్ళు గుఱ్ఱములతో కట్టబడిన రధమును ఎక్కి వేగముగా రాముని భావనమునకు వెళ్లి ,రాధముతోనే మూడు ప్రాకారములను దాటెను . వశిష్ట మహర్షి వచ్చిన విషయము తెలుసుకుని శ్రీరాముడు త్వరత్వరగా వశిష్ట మహర్షికి ఎదురేగి ఆహ్వానము పలుకుతూ తానె స్వయముగా రధము నుండి చేయి సాయము ఇచ్చి దింపెను . ఆయన ప్రవర్తనకు సంతోషించిన వశిష్ఠుడు తాను  వచ్చిన కారణము తెలిపి సీతారాములకు మంత్రం పూర్వకముకా ఉపవాస దీక్షను అనుగ్రహించెను . 
పిమ్మట వశిష్ట మహర్షి తిరిగి  బయలుదేరి రాజవీధులోకి తన రధము మీద రాగా  వీధులన్నీ ఏంటో చక్కగా అలంకరించబడి రామణీయముగా తీర్చిదిద్దబడ్డాయి . ఆ అయోధ్యలోని అన్ని ఇల్లు తమ ఇంట్లోనే వేడుక అన్నట్లుగా అలంకరించి వున్నవి . ప్రతి ఇంటి మీదను ధ్వజపతాకము ఎగురవేసి ఉండెను . ఆ వీధులన్నీ శ్రీరామ పట్టాభిషేకము చూడాలనే కోరికతో ఉవ్విళ్ళూరుతున్న జనముతో నిండి వున్నవి . ఆ విధముగా వున్న అయోధ్య నగర సౌందర్యమును వర్ణించుట వర్ణనాతీతము . వీటన్నిటిని చూస్తూ వశిష్ఠుడు దశరధుని భవనమునకు ప్రవేశించి ,శ్రీరామునికి ఉపవాస దీక్ష అనుగ్రహించిన సంగతి తెలియబరిచెను . 

రామాయణము అయోధ్యకాండ ఐదవసర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Tuesday 27 September 2016

రామాయణము అయోధ్యకాండ _నాల్గవసర్గ

                               రామాయణము 



                      అయోధ్యకాండ _నాల్గవసర్గ 

ఆ విధముగా శ్రీరామ పట్టాభిషేక వార్తను ప్రకటించి దశరధుడు తన అంతః పురమునకు వెళ్లి తన సారధి చేత శ్రీరాముడికి చూడాలనివుంది రమ్మని కబురుచేసాడు . దశరధుని రధసారధి అయిన సుమంత్రుడు రాముని అంతఃపురమునకు వెళ్లి తన ఆగమనం గూర్చి రాముడికి ద్వారపాలకులు ద్వారా కబురు చేసెను . సుమంత్రుడి పునరాగమనం గురించి తెలిసిన రాముడు "పట్టాభిషేకమునకు ఏదయినా విఘ్నము కలిగినదా ?లేదా వేరే ఏదయినా ఉపద్రవము సంభవించినదా ?"అని సందేహమునకు గురిఅయ్యెను . వెంటనే రాముడు సుమంత్రుడిని తన భవనంలోకి రప్పించి కారణము అడుగగా సుమంత్రుడు "మీ తండ్రి గారు మిమ్ములను చూడాలని కోరుకుంటున్నారు వెళ్లడం ,వెళ్ళకపోవడం మీ ఇష్టం "అని పలికెను . 
ఆ వార్తవిన్న వెంటనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపక మఱల తన తండ్రిని దర్శించుటకు వెళ్లెను . తన వద్దకు వచ్చి నమస్కరించిన శ్రీరాముని తో దశరధుడు "నాయనా !రామా !నాకు వయస్సు మీరినది . ధర్మబద్ధమైన సుఖములు అన్నిటిని అనుభవించితిని . మృష్టాన్నదానములతో ,భూరిదక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు కల యజ్ఞములను వందలకొలదిగా ఆచరించితిని . ఇష్ట సంతానప్రాప్తితో నా కలలు పండినవి . (చతుర్విద పురుషార్ధములు సిద్దించినవి . ). వందలకొలది యజ్ఞము లు ఆచరించుటచే దేవ -రుణమును ,వేదాధ్యయనముచే ఋషి -ఋణము ,సస్సంతాన ప్రాప్తిచే పితృ- ఋణము ,దాన ధర్మములచే విప్ర -ఋణము ,ధర్మసుఖానుభవముచే ఆత్మ -ఋణము (ఋణ -పంచకమును )ను తీర్చుకుంటిని . కనుక నీకు పట్టాభిషేకము చేయుట కన్నా నాకు మరియొక కర్తవ్యము ఏదిలేదు . 
నాయనా !సామంతరాజులు ,మంత్రులు ,ప్రజలు అందరూ నీవు రాజు కావలెనని అభిలషించుచున్నారు . కావున నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను . ఓ రామా !మరొక్కమాట ఈమధ్య కలలో నాకు భయంకరమైన అపశకునములు కనపడుచున్నవి . పిడుగులతో కూడిన ఉల్కలు (తోకచుక్కలు )మహాధ్వనులు గావించుచు పగటి పూటే నేలమీద రాలుతున్నవి . రామా !నా జన్మ నక్షత్రమున క్రూర గ్రహములు అయిన సూర్యుడు ,కుజుడు ,రాహువు చేరియున్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు . సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపాదపాలగుట యో జరుగును . నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున వున్నాడు . రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రమున వున్నప్పుడు పట్టాభిషేకము ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు . ఈ విషయమున నా మనస్సు తొందరపెట్టుచున్నది . కనుక నిన్ను రేపే యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయుదును . అందువలన ఇప్పటినుండే నియమములు పాటించుచు నీవును ,మా కోడలు సీతా దేవియు రాత్రివేళ ఉపవాస దీక్ష చేస్తూ దర్భాష్టరణములపైనా శయనింపవలెను . 
సామాన్యముగా ఇట్టి శుభకార్యములు కు పెక్కు విఘ్నములు ఎదురగుచుండును . కావున నీ మిత్రులందరూ అప్రమత్తులై ఇప్పటి నుండే నిన్ను కాపాడుదురు గాక . కైకేయ రాజ్యమున ఉన్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజుగా పట్టిభిషిక్తుడవగుట మేలని నాకు తోచుచున్నది . నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్నగారి అడుగుజాడలలోనే నడుచుకొనువాడు . ధర్మబుద్ధికలవాడు . దయాళువు ,ఇంద్రియ నిగ్రహము కలవాడు . అయినను శ్రీరామా !సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చంచలములు . ఒక్కొక్కప్పుడు ధర్మనిరతులైన సత్పురుషులు కూడా వేర్వేరు కారణములు వలన రాగద్వేషములచే ప్రభావితులగుచుండును . ఇది నా అభిప్రాయము "అని చెప్పెను . మరునాడు జరుగుచున్న పట్టాభిషేక విషయముల గూర్చి తెలిపి రాముని వెళ్ళుటకు ఆజ్ఞను ఇచ్చెను . శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనము చేరెను . 
పిమ్మట పట్టాభిషేక వార్త గురించి కౌశల్యా మాటకు తెలపదలచి తక్షణమే బయలుదేరి ఆమె అంతః పురమునకు వెళ్లెను . అచట కౌశల్యాదేవి పూజా మందిరమున ఇష్టదైవమును పూజిస్తూ ఉండెను . అచటికి సుమిత్రాదేవి ,లక్ష్మణుడు వచ్చిరి . సీతాదేవి దాసీ జనముతో అచటికి చేరెను . శ్రీరాముడు అచటికి చేరి తల్లి కౌశల్యా దేవికి  ప్రణమిల్లి తన పట్టాభిషేక వార్తను తెలిపెను . అంతట కౌశల్యా దేవి సంతోషముతో కూడిన అశ్రువులతో శ్రీ రాముని దీవించెను . పక్కనే వున్నా లక్ష్మణుడితో శ్రీరాముడు "లక్ష్మణా !నీవు నాబాహి ప్రాణము . కావున ఈ రాజ్యము నీకు చేరినట్లే ,రాజ్యమే కాదు నా ప్రాణములు కూడా నేవే . వీటినన్నింటిని నీ కొరకే కోరుచున్నాను . "అని పలికి తల్లులిద్దరికి ప్రణామము చేసి తన భావనమునకు చేరెను . 

రామాయణము అయోధ్యకాండ నాల్గవ సర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















Monday 26 September 2016

రామాయణము బాలకాండ _మూడవసర్గ

                               రామాయణము 

                             బాలకాండ _మూడవసర్గ 

ఆ సదాన్యులు అందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనలు ఆలకించి వారితో "ఆహా !నా భాగ్యము . ప్రియమైన నా జేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిక్కిలి ఆనందదాయకం "అని పలికెను . పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయుము . అని దశరధుడు చెప్పగా జయజయ ధ్వనులు మిన్నుముట్టెను . పిమ్మట దశరధుడు వశిష్టునితో "ఓ బ్రహ్మర్షీ !శ్రీరాముని పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించి ,సిద్ధపరచవలసిన సంభారముల గూర్చి మీరే ఆజ్ఞాపింపుడు . "అని పలికెను . 
బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు సుమంత్రుడు మొదలయిన ఉన్నతాధికారులతో "బంగారము, వెండి ,వివిధములగు రత్నములను ,పూజాద్రవ్యములను ,వడ్లు ,పెసలు ,మొదలగు ధాన్యములు తెల్లని పూలమాలలను ,పేలాలను ,వేర్వేరు పాత్రలలో తేనెలను ,నేతులను ,తెల్లని అంచు కలవియైన నూతనవస్త్రములను ,రథములను ,వివిధాయుధములను ,చతురంగబలములను ,శుభలక్షణములు కల భద్రగజములను ,వింజామరలు ,ధ్వజము ,స్వేతఛత్రము అగ్నిజ్వాలలు వలె తళతళ లాడుచున్న నూరు బంగారు కలశములను ,బంగారు కొమ్ములు కల వృషభమును ,పూర్తి వ్యాఘ్ర చర్మమును ,రాజు గారి అగ్ని కార్య గృహ సమీపమున రేపటి ప్రాతః కాలమునకు చేర్చుడు . ఇంకనూ అవసరమగు గంధపుష్పాది వస్తువులను అన్నింటిని అక్కడ సిద్దపరుచుడు . 
సమస్త రాజా గృహ ద్వారములను ,నగరమందలి సర్వ గృహముల వాకిళ్ళను ఘుమఘుమలాడు చందన గంధముల పూతలతో చక్కని పూలమాలలతో అలంకరింపుడు . వాటికి సువాసనలు వెదజల్లు ధూపములు వేయండి . వేలకొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డపెరుగుతో కూడిన దద్ద్యోదనములను ,చిక్కని పాలతో సిద్దమైన పాయసములను ,ప్రశస్తమైన ఆహారపదార్థములను సిద్ధమొనర్చమ్ది . రేపు ఉదయము సూర్యోదయము సమయమున స్వస్తి వచనములు జరగవలెను . కనుక బ్రాహ్మణులందరిని ఆహ్వానింపుడు . యోధులందరూ పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుముల యందు పెద్దపెద్ద ఖడ్గములను ధరించి ,రామాభిషేక సమయమున మహారాజు భవన ప్రాంగణమున నిల్చి ఉండవలెను . "అని ఆజ్ఞాపించెను . 
అంతట దశరథ మహారాజు శ్రీరాముని రమ్మని కబురుపంపెను . కబురు విని రాముడు దశరధుడి సభా భవనమునకు వచ్చి తండ్రికి నమస్కరించి నిలబడెను .

 దశరధుడు శ్రీరాముని సంతోషముతో తదేకంగా చూస్తూ ,"పుష్యమీ నక్షత్రమున పట్టాభిషిక్తుడవు కమ్ము "అని పలికెను . ఇంకనూ రాజనీతి ధర్మములను బోధించెను . శ్రీరామునికి ప్రియమిత్రులైనవారు పట్టాభిషేకవార్తను కౌసల్యా దేవికి ఆమె భావనమునకు వెళ్లి తెలిపిరి . వారికి కౌసల్యా దేవి విలువ గల ఆభరణములను బహుమతులుగా ఇచ్చెను . పిమ్మట రాముడు తన భవనమునకు వెళ్లెను . ఈ వార్తా విన్న ప్రజలు పరమానందభరితులై ఏ విఘ్నము కలుగకుండా పట్టాభిషేకము జరిగేలా చూడమని తమ ఇష్టదైవములను వేడుకొనిరి . 

రామాయణము అయోధ్యకాండ మూడవ సర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














Sunday 25 September 2016

రామాయణము అయోధ్యకాండ -రెండవసర్గ సమాప్తము

                         రామాయణము 



                    అయోధ్యకాండ -రెండవసర్గ సమాప్తము 

ఆవిధముగా నున్న నిండు సభలో దశరథ మహారాజు అందరి ఎదుట తన నిర్ణయమును ప్రకటించెను . ఇంకనూ "శ్రీరాముడు సర్వ సమర్ధుడు మంత్రులతో ,గురువులతో ఆలోచించి ఈ నిర్ణయము  తీసుకున్నాను. ఇంకేదన్నా మంచి ఉపాయము మీకు తోచినచో చెప్పండి అదే చేద్దాము . "అని పలికెను . ఆ సభలోని వారందరూ ఆ మాటలు విని సంతోషముతో కేకలు వేసిరి . అందరూ కలసి రాజుగారి ప్రతిపాదనను బాగుగా చర్చించి ,ఆ ఆలోచన సమున్నతమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి . వారందరూ ఆ నిర్ణయము తమకు మిక్కిలి సంతోషము అని పలికిరి . 
అంతట దశరథ మహారాజు సధన్యుల మాటలు విని వారి మనసులలో పొంగిపొరలుచున్న సంతోషమును ఎరిగి మరల వారి అభిలాషను వారి నోటినుండే వినుటకై తెలియని వాడి వలే ఇలా పలికెను . "ఓ రాజులారా !నేను చెప్పిన మాటలు వినినంతనే మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచుంటిరి . నా పరిపాలనపై అసంతృప్తులై ఇలా కోరుకొనుచుంటిరా ,లేక శ్రీరాముని సద్గుణములు ప్రభావమునా నిజము చెప్పండి . నేను ధర్మబద్ధముగా పాలన సాగించుచున్నానుకదా "అనెను . 
రాజులు పౌరులు ,మునులు మున్నగువారందరూ ముక్తకంఠము న "ఓ నరేంద్రా !శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది . అతడు తన దివ్య గుణములచే ఇంద్రుడితో సమానుడు . షీలా వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించేవాడు . ధర్మార్ధ శాస్త్రములు బాగుగా ఎరిగినవాడు . అస్త్రశస్త్రవిద్యా ప్రావీణ్యము కలవాడు . జాలిదయ కలిగినవాడు . ఓ ప్రభూ !శ్రీరాముడు దేవతలతో సమానుడు . సర్వలోకములహితమునే కోరువాడు . ఔదార్యం గుణములతో అలరారువాడు . అట్టి నీ కుమారుడు మా పుణ్య వశమున నీకు పుత్రుడుగా జన్మించాడు . కావున అతనిని వెంటనే సంతోషముతో యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి మా కోరిక తీర్చుము . "అని పలికిరి . 

 రామాయణము అయోధ్యకాండ రెండవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 





Saturday 24 September 2016

రామాయణము అయోధ్యకాండ _మొదటిసర్గము

                            రామాయణము 

                         అయోధ్యకాండ _మొదటిసర్గము 

భరతుడు ,శత్రుఘ్నుడు మేనమామ ఇంట భందుమర్యాదలను ,ఆదరసత్కారములను పొందుతూ ,నచ్చిన ఆహారపదార్ధములు ,విహారములతో ఆటపాటలతో ఎంతో సంతోషముగా ఉండిరి అయినను  వారు తమ తండ్రిని ప్రదిదినము తలుచుకుంటూ ఉండిరి . అదేవిధముగా దశరధుడు కూడా తనకు దూరముగా వున్నా భారతశత్రుఘ్నులను మాటిమాటికి తలుచుకుంటూ బాధపడుతుండెను . తన పెద్దకుమారుడైన రాముడి గుణగణములను చూసి మిక్కిలి సంతోషించుచువుండెను . 
శ్రీరాముడు లోకోత్తరసుందరుడు ,మహావీరుడు ,ఇతరులలో సుగుణములనే గ్రహించువాడు . ప్రశాంతచిత్తుడు ,మృదుభాషి ,కోపమనే మాటనే ఎరుగనివాడు ,ఇతురులెవరయినా పరుషముగా మాట్లాడినా ఆ మాటలను పట్టించుకోకుండా వారితో కూడా మృదువుగా మాటలాడువాడు . శ్రీ రాముడు వీలయినప్పుడల్లా జ్ఞాన వృద్ధులతో (జ్ఞాన పరంగా గొప్పవారగు )విద్యాగోష్టి చేయుచువుండేవాడు . ఎవ్వరినయినాను తానే ముందుగా పలకరించేవాడు . ఎంతటి దుష్టులైనను తనను శరణు కోరించో వారిని క్షమించి కాపాడేవాడు . తానూ ఎంత పరాక్రమమంతుడు అయినను రవ్వంతయినను గర్వములేనివాడు . శ్రీరాముడు ఎట్టిపరిస్థితులలో అసత్యము పలికేవాడు కాదు . సకల విద్యా పారంగతుడు . ప్రజలను వాత్సల్యముతో సంతసింపచేయువాడు . ప్రజలకు ప్రాణతుల్యుడు . కలలో కూడా పరుల సొత్తును ఆశించనివాడు . 

శ్రీరాముడు ఇక్ష్వాకు వంశ ధర్మాలైన దయాదాక్షిణ్యములు ,శరణాగత రక్షణము ,ధర్మైకదృష్టి కలవాడు . దుష్టనిగ్రహము ,ప్రజాపరిపాలన క్షత్రియ ధర్మాలను పాటించువాడు . వేదవేదాంగములను ,శాస్త్రములను అధ్యయనము చేసాడు . ఋజువర్తనముచే దేవతలకు కూడా ఆరాధ్యుడు . శ్రీరాముడు మనోరంజకములైన సంగీత ,చిత్ర కళలయందు ,వీణావేణుమృదంగా తాళ విద్యలందు ఆరితేరినవాడు . ధనమును సద్వినియోగము చేయుట తెలిసినవాడు . ఏనుగులు ,గుఱ్ఱములు అధిరోహించుట వాటిని అదుపు చేయుట ,వాటికి శిక్షణ ఇవ్వటం తెలిసినవాడు . ధనుర్విద్యారహస్యములు తెలిసినవాడు . యుద్ధ సమయములో తానె ముందుగా నిలిచి శత్రువులతో యుద్ధము చేయుచు తన జనాలని కాపాడువాడు . శ్రీరాముడు సహజ సుందరుడు . ఇన్ని మంచి గుణములతో సకల జనులకే కాక మూగ ప్రాణులకు ,అట్లే దేవతలకు సైతము ఇష్టుడు . జనులందరూ శ్రీరాముడు తమకు ప్రభువు కావలెనని కోరుకొనుచుండిరి . 
ఈ విధముగా సాటిలేని శుభ లక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముని చూసి "నేను జీవించివుండగా ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంతబాగుండు ?అది నేను చూసి సంతోషింతును . "అని కోరిక కలిగెను . దశరధ మహారాజుఁ మంత్రులతో సమాలోచన చేసి శ్రీరాముని యువరాజుగా చేయుటకై నిశ్చయించెను . వెంటనే ఆ మహారాజుఁ వివిధ నగరముల ప్రజలను ,జానపదులను ,దేశమున గల ప్రముఖులను ,సామంత రాజులను వేర్వేరుగా రప్పించెను . వ్యవధి తక్కువుగా  ఉండుట చే భరతుడి మేనమామకు ,జనక మహారాజుకి కబురు పంపలేదు . ఆహ్వానము మేరకు అయోధ్యకు వచ్చిన వారందరికి దశరధుడు తగిన విడిది గృహములను ఏర్పాటుచేసెను . పిమ్మట దశరధుడు సిమహాసనము అధిష్టించగా సామంతులు ,మంత్రులు ,పుర జనులతో సభ నిండుగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ మొదటిసర్గము సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







                       

Friday 23 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదియేడవసర్గ

                            రామాయణము 

                          బాలకాండ _డెబ్బదియేడవసర్గ 

శ్రీరాముడు పరశురాముడు వెళ్లిన పిమ్మట ప్రసన్నచిత్తుడై ధనుర్భాణములను వరుణదేవుడికి ఇచ్చెను . పిదప చతురంగ బలములతో మంత్రులు ,మునులతో కూడి అందరూ అయోధ్యకు చేరెను . అయోధ్య అంతా రంగరంగ వైభవముగా అలంకరించబడెను . మునులు మొదలగు వారు ఎదురుగా వచ్చి తమ సంతోషమును ప్రకటించిరి . దశరధుడు తన పుత్రులు నూతన వధువులతో అంతః పురమున ప్రవేశించేను . సౌందర్యవంతులు అయిన కౌశల్య ,సుమిత్ర కైకేయి లు నూతన వధూవరులకు ఉపచారములు నెరపుటలో నిమగ్నమయ్యిరి . వారు నూతన వధూవరులను అంతః పురమున ప్రవేశపెట్టిరి . 
నూతన వధూవరులు పట్టువస్త్రములు ,ఆభరణములు ధరించి పూజాగృహములో ప్రవేశించి ఇలావేల్పులు గంధ పుష్పాదులతో పూజించిరి . పూజ ముగిసిన పిమ్మట నూతన వధువులు నలుగురూ పెద్దలందరికి పాదాభివందనములు చేసిరి . పిమ్మట వారు తమతమ మందిరములకు చేరిరి . పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ,ధనధాన్యములను దానము చేసిరి . అనంతరము ఆ నవవధువులు తమ భర్తలను చేరి ఆనందించిరి . 
మిక్కిలి ప్రతిభాశాలురు అయిన రామలక్ష్మణభరతశత్రుఘ్నులు తల్లితండ్రులకు సేవచేస్తూ బంధుమిత్రులతో ,సకల సంపదలతో తులతూగుతూ తమ గుణములచే గురువుల అభిమానమును పొందుచూ సంతోషముగా ఉండిరి .  కొంతకాలమునకు కైకేయ రాజు కుమారుడు యధాజిత్తు రాగా ఆయన వెంట భరతుడు కైకేయ రాజ్యమునకు తండ్రి అనుమతి తీసుకుని వెళ్లిరి . శత్రుఘ్నుడు కూడా అన్న భరతునితో పాటు కైకేయ రాజ్యమునకు తండ్రి అన్నగార్ల అనుమతి తీసుకుని వెళ్లెను . 
భారత శత్రుఘ్నులు కైకేయ రాజ్యమునకు వెళ్లగా రామలక్ష్మణులు తల్లితండ్రులకు సేవచేస్తూ ఉండిరి . ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును ,హితమును కూర్చు పనులు చేస్తూ సమస్త కార్యములను నెరవేర్చుచుండెను . వేదములు ,ధర్మశాస్త్రములలో పేర్కొనిన నియమములను పాటించుచు ,రామలక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులనొనర్చుచుండెను . మరియు పరాకు లేకుండా సందర్భానుసారంగా గురువులను శుశ్రూషాదికార్యములను నిర్వర్తించుచుండిరి .
 
శ్రీరాముడి యొక్క సౌశీల్యమునకు ,ఉదాత్తప్రవర్తనకు ,సద్గుణములకు దశరధుడు మురిసిపోవుచుండెను . అట్లే దేశవాసులందరూ పరమానంద భరితులగుచుండిరి . నిర్మలమనస్కుడైన శ్రీరాముని అంతః కరణమున సీతయే నెలకొనివుండెను . ఆమె హృదయము నందు శ్రీరాముడే నెలకొని ఉండెను . సీతారాములు ఒకరిహృదయములు ఒకరు ఎరిగిన వారగుటచే పరస్పరానురాగములతో మెలుగుచుండిరి . రూపమునందు దివ్య స్త్రీవలె ,సౌందర్యమును లక్ష్మీదేవివలె వున్న జనకుని కూతురు సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనేను . సీతా తో కూడి శ్రీరాముడు దేవాదిదేవుడైన విష్ణువు లక్ష్మీదేవితో వున్నట్లుగా సకల సౌభాగ్యములతో శోభిల్లుచు ఉండెను . 



రామాయణము బాలకాండ డెబ్బది ఏడవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .    











Thursday 22 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదియారవసర్గ

                              రామాయణము 


                                   బాలకాండ _డెబ్బదియారవసర్గ 

శ్రీరాముడు పరశురాముడి మాటలు విని "బ్రహ్మర్షివి అయిన ఓ పరశురామా !కార్తవీర్యార్జునిపై పగదీర్చుకొనుటకు అతడిని వధించి ,ఇరువదిమార్లు దండెత్తి క్షత్రియులను చంపినా విషయము నేను విన్నాను . ఒక వీరుడు చేయదగిన పనే చేసావు . అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను . ధనుస్సుని ఎక్కుపెట్టుట ,యుద్ధము చేయుట మున్నగు విషయములనందు నన్ను అశక్తునిగా భావించి ,అవమానించితివి . దీనిని నేను ఒప్పుకోను . ఇదుగో  పరాక్రమము చూడుము . "అని పలికి పరశురాముడి చేతిలో నుండి విష్ణు ధనుస్సుని తీసుకొని దానికి బాణమును సంధించి "ఓ పరశురామా !నీవు బ్రాహ్మణుడవు అయినందు వల్ల నాకు పూజ్యుడవు . కావున నేను ఎక్కుపెట్టిన ఈ బాణముతో నీ ప్రాణము తీయుటకు వెనకాడుచున్నాను . ఏ వైష్ణవ బాణము దివ్యమైనది . అట్టి ఈ బాణము వృధా కారాదు . దీనితో నీ గమన శక్తి (ఒక లోకము నుండి మరో లోకమునకు క్షణములో చేరగల శక్తి ),ని తొలగింపనా ,లేక నీ తపో బలముచే సాధించుకున్న పుణ్య రాశులను ధ్వంశము చేయమందువా త్వరగా తెలుపు "అని పలికెను . 
వైష్ణవ ధనుస్సుని ధరించిన శ్రీరాముని దర్శించుటకు బ్రహ్మాది దేవతలు ,ఋషీశ్వరులు గుంపులు గుంపులుగా విచ్చేసిరి . గంధర్వులు ,అప్సరసలు ,సిద్దులు ,చారణులు ,కిన్నెరలు ,యక్షులు ,రాక్షసులు ,నాగులు మొదలగు వారు శ్రీరాముని చూచుటకు అచటికి విచ్చేసిరి . విష్ణుధనస్సుని ధరించిన శ్రీరాముని తేజస్సుని మిక్కిలి ఆశ్చర్యముతో చూస్తూ" ఈ భూమండలమును ఇదివరకే కశ్యప మహర్షికి     దారపోశాను . నా గమన శక్తిని ధ్వంశము చేయవద్దు . నా పుణ్యరాశులను ధ్వంశము చేయుము . విష్ణు ధనుస్సుని ఎక్కుపెట్టుటచే విష్ణువే నీవని గ్రహించాను . "అని పలికి మహేంద్రగిరికి తపస్సు కొరకు వెళ్లెను . 
అనంతరము ధనుస్సుని ధరించివున్న శ్రీరాముని అచటకు విచ్చేసిన దేవతలు ఋషీశ్వరులు మున్నగు వారందరూ కొనియాడారు . 

రామాయణము బాలకాండ డెబ్బదియారవ సర్గ సమాప్తము . 



                 శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Wednesday 21 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదియైదవ సర్గ

                                       రామాయణము 

                                        బాలకాండ _డెబ్బదియైదవ సర్గ 

పరశురాముడు శ్రీ రాముడితో "ఓ దశరథ రామా !నీ బలపరాక్రమముల గురించి ,శివధనుర్భంగము గురించి విన్నాను . నేను ఒక విల్లుని తెచ్చాను ఈ విల్లు నాకు నా తండ్రి వద్దనుండి లభించింది . ఈ ధనువుని సంధించి నీ బలమును చాటుకో . అలా చాటుకొనినచో నీకు నాతొ ధ్వంధ్వ యుద్ధము చేసే అవకాశము ఇస్తాను . "అని పలికెను . 
పరశురాముడి మాటలు వినగానే దశరధుడికి ముఖంపై విషాదము అమలుకొనెను . పిమ్మట మిక్కిలి దైన్యముతో "ఓ బార్గవరామా !నీకు క్షత్రియులపై కల కోపము చల్లారినది కదా . నీవు బ్రాహ్మణోత్తముడవు . మిక్కిలి వాసిగాంచినవాడవు . పసిబాలురైన నా పుత్రులపై దయ చూపుము . ఓ మహర్షీ ఈ రాముడు లేనిచో మేమెవరమూ ప్రాణములతో ఉండము . "అని ప్రార్ధించుచున్ననూ పరశురాముడు పట్టించుకొనక శ్రీరాముడితో 
"ఓ రామా !నీవు విరచిన ధనస్సు ,నేను తెచ్చిన ధనస్సు ఇవి రెండు శ్రేష్టమైనవి ,దృఢమైనవి ,శక్తిమంతమైనవి ,ప్రముఖమైనవి అని ముల్లోకములలో ఖ్యాతివహించెను . విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించెను . ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారనిమిత్తమై పరమేశ్వరుడి దేవతలు వాటిలో ఒక ధనుస్సుని సమర్పించిరి . దానిని నీవు భంగమొనర్చావు . ఇక ఈ రెండవ ధనుస్సుని దేవతలు విష్ణువుకి అర్పించిరి . అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలాబలములను తెలుసుకోదలచి ,బ్రహ్మను చేరి 'హరిహరులలో బలశాలి ఎవరు 'అని ప్రశ్నించిరి . బ్రహ్మ వారిరువురికి విరోధము కల్పించెను . 

ఆకారణముగా వారిరువురు మధ్య హోరాహోరీగా యుద్ధము సంభవించెను . అప్పుడు విష్ణువు హుంకరించగా శివధనుస్సు నిస్తేజమయ్యెను . మహాదేవుడైన ముక్కంటి కూడా నిశ్చేష్టుడయ్యెను . అంతట దేవతలు అందరూ ఋషీశ్వరులతో ,చారుణులతో అక్కడకు చేరి ,వారిని ప్రార్ధించగా వారు శాంతించిరి . దేవతలు .ఋషీశ్వరులు అందరూ విష్ణువే అధిక బలవంతుడు అని తలచిరి .

 అందులకు శివుడు కృద్ధుడై తన ధనుస్సుని విదేహప్రభువులలో రాజర్షి అయిన దేవరాతునికి న్యాసముగా సమర్పించెను . విష్ణువు తన ధనుస్సుని భృగు వంశజుడైన ఋచీకునికి న్యాసముగా ఇచ్చెను . ఋచీకుడు నుండి ఆయన పుత్రుడైన జమదగ్నికి ఆ ధనుస్సు లభించెను . ఆయన వద్ద నుండి జమదగ్ని కుమారుడైన నాకు ఈ ధనుస్సు లభించెను . తపోబల సంపన్నుడైన మా తండ్రి జమదగ్ని అస్త్ర సన్యాసము చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖ బుద్దితో ఆయనను వధించెను . 
ఆ కార్తవీర్యార్జునుడు మిక్కిలి భయంకరముగా ,అతి క్రూరముగా మా తండ్రిని విధించినట్లు విని రోషముతో నేను ఇరువదిఒక్కమాఱులు పుట్టినవాడిని పుట్టినట్లుగా తుదముట్టించితిని . సమస్త భూమండలమును జయించి దానిని కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాను . తపోబలంతో మహేంద్రగిరి చేరాను . దేవతలు సంచరించునట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపస్సు చేసుకుంటున్నాను . నీవు శివధనస్సు విరిచినట్లు తెలిసి ఇక్కడకు వచ్చాను . ఈ మహిమగల విష్ణుధనస్సుని అందుకో నీకు బలము వున్నచో దీనిని ఎక్కుపెట్టి బాణము సందించుము . అప్పుడు నాతొ ధ్వంధ్వ యుద్ధమునకు నీకు అనుమతి యిస్తాను . "అని పలికెను . 

రామాయణము బాలకాండ డెబ్బదియైదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 
















Tuesday 20 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదినాల్గవసర్గ

                               రామాయణము 



                               బాలకాండ _డెబ్బదినాల్గవసర్గ 

ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు ఉదయము అందరికి వీడ్కోలు పలికి విశ్వామిత్రుడు హిమాలయములకు తపస్సుకొరకై వెళ్లెను . దశరధుడు జనకుడి వీడ్కోలు పలికి అయోధ్యకు పరివారము ,నూతన వధూవరులతో పాటు బయలుదేరెను . జనక మహారాజు కొంత దూరము వారిని అనుసరించెను . జనకుడు తన నలుగురి కుమార్తెలకు అపరిమితముగా ధనమును ఇచ్చెను . లక్షలకొద్దీ గోవులను, మిక్కిలి విలువైన పట్టువస్త్రములను కానుకగా ఇచ్చెను . ఇంకను చక్కగా అలంకరింపబడిన బలిష్టమైన ఏనుగులను ,మేలుజాతి గుఱ్ఱములను ,వీరులైన యోధులను భక్తి విశ్వాసములు కల దాసదాసీ జనములను భరణముగా ఇచ్చెను . ఇంకనూ జనకుడు పుష్కలముగా వెండి ,బంగారములను ,ముత్యములను పగడములను వారికి కన్యాదానముగా సమర్పించెను . ఇంకనూ అసంఖ్యాకమైన సంపదలను వారికి బహూకరించి దశరధుడి అనుమతి తీసుకుని వెనుతిరిగి తన అంతః పురమునకు వెడలెను . 
ఆ విధముగా దశరధుడు ఋషులతోను ,కుమారులతోను ,పరివారముతోను వెళ్లుచుండగా అక్కడక్కడా పక్షులు భయంకరముగా శబ్దములను చేయుచుండెను . భూమిపై సంచరించు మృగములన్నీ ప్రదక్షిణ పూర్వకముగా తిరగసాగెను . దశరధుడు ఆ శకునములు గమనించి వశిష్టుని తో "ఓ మహర్షీ ఓ వైపు పక్షుల అరుపులు (అశుభ సూచకం )మృగముల ప్రదక్షిణ (శుభము )ఈ శకునములు చూస్తుంటే నాకు మనస్సు కలవరపెడుతుంది . దీని అంతరార్ధమేమిటి ?"అని ప్రశ్నించేను . అప్పుడు వశిష్ఠుడు 'ముందుగా అశుభ శకునములు ,తదుపరి శుభశకునములు కనపడుచున్నవి . కావున ఆపద కలిగినా అది తొలగిపోవును భయపడవలదు . "అని పలుకుచుండగా 
భూమిని కంపింప చేయుచు ,చెట్లను పడగొడుతూ ఒక పెద్ద సుడిగాలి వీచెను . సూర్యకాంతి చీకట్లు ఆవరించెను . జరుగు పరిణామములు చూసి దశరధుడు ఆయన నలుగురు పుత్రులు ,వశిష్ఠుడు తప్ప మిగిలిన వారంతా నిశ్చేష్టులై నిలబడిరి . ఆ తరుణములో జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యెను . అతడు జటామండలధారియై ప్రళయ కాల రుద్రనివలె భయంకరముగా ఉండెను . అతడు రాజా వంశములను పరిమార్చినవాడు . అతడు భాజామున గండ్ర గొడ్డలిని ధరించి మెరుపు తీగ వలె మిరుమిట్లు గొలుపు ధనుర్భాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుడి వలె తేజరిల్లుచుండెను . 
అతడిని చూసిన వశిష్ఠుడు మొదలగు మునులందరూ "యితడు పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జనుడు ఇతని తండ్రి అయిన'జమదగ్నిని 'చంపుటచే యితడు క్షత్రియులను హతమార్చి కోపము తొలగి శాంతించి వున్నాడు . మరల ఇప్పుడు క్షత్రియులను చంపుటకు రాలేదుకదా "అని తమలో తాము అనుకోసాగిరి . పిదప వారు పరశురాముడిని పూజించ అర్ఘ్య పాద్య ద్రవ్యములతో రామా రామా అని మధురముగా పలుకుచూ అతడిని సమీపించిరి . వారి పూజలు అందుకుని పరశురాముడు దశరధునితో ఇలా అనెను . 

రామాయణము బాలకాండ డెబ్బదినాల్గవసర్గ సమాప్తము . 

                శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                   














Monday 19 September 2016

రామాయణము బాలకాండ _డబ్బదిమూడవసర్గ

                                       రామాయణము 

                                      బాలకాండ _డబ్బదిమూడవసర్గ 

కేకేయ మహారాజు కుమారుడు భరతుడి మేనమామ అయిన యధాజిత్తు అయోధ్యకు వెళ్లగా అక్కడ వివాహ వార్త తెలిసి తన మేనల్లుడి వివాహము చూడవలననే ఉత్సుకతతో మిధిలకు వచ్చెను . అక్కడ దశరథ మహారాజు రామలక్ష్మణ శత్రుఘ్నులను తన మేనల్లుడు భరతుడిని చూసి మిక్కిలి సంతోషించెను . ఆ రాత్రి గడిచిన పిమ్మట తెల్లవారి ఉదయమే నిద్రలేచి దశరధుడు తన కుమారులు నలుగురికి దీక్షాధారణ చేసి వేచి ఉండెను అప్పుడు జనకుడు వశిష్టుని  అనుజ్ఞమేరకు కుమార్తెలను యజ్ఞవేదిక వద్దకు తీసుకువచ్చెను . 
అప్పుడు వశిష్ఠుడు ,విశ్వామిత్రుడు ,శతానందునితో కలసి విధ్యుక్తముగా వివాహవేదిక మధ్యలో వేదికను నిర్మించి దానిని సుగంధ సుమములతో అలంకరించెను . విధ్యుక్తముగా మంత్రములు పఠించిరి . యజ్ఞ గుండమునందు అగ్నిని ప్రజ్వరిమ్పచేసిరి . అప్పుడు జనకుడు సర్వాలంకార శోభిత అయిన సీతాదేవిని రాముడి ఎదురుగా కూర్చోబెట్టేను . అప్పుడు కౌశల్యానందనుడు అయిన రామునితో "ఓ రామా !సౌందర్యవతి ,సౌకుమార్యనిధి ,లావణ్యవతి ఐన ఈ కన్యకామణియే సీత . ఈమె అయోనిజ . మా వంశ ప్రతిష్టకు ప్రతీక ఈ సీత . ఈమె నేటి నుండి నీ సహధర్మచారిణి . ధర్మార్ధకామముల ఆచరణలో ,కష్టసుఖములలో సర్వదా ఈమె నీకు తోడుగా ఉంటుంది . సర్వ సౌభాగ్యవతి ఐన ఈమె పతివ్రత నిరంతరము నీడ వలె నిన్ను అనుసరించుచుండును . విధ్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము చేయుము . నీకు శుభము అగును . మిక్కిలి ప్రేమాదరములతో ఈమెను శ్వీకరింపుము . "అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచూ కన్యాదానము చేసెను . ఆ కన్యాదానోత్సవము నందు దేవతలు ,ఋషీశ్వరులు బాగుబాగు అని ప్రశంశా వచనములు పలికిరి . దేవదుందుభులు మ్రోగెను . అద్భుతముగా పూలవాన కురిసి చూసేవాళ్లకు కన్నులవిందుగా ఉండెను . 


పిమ్మట జనక మహారాజు లక్ష్మణుడికి ఊర్మిళను ,భరతుడికి మాండవిని ,శత్రుజ్ఞుడికి శ్రుతకీర్తిని మంత్రపూతమైన జలముతో కన్యాదానము చేసెను . పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములు అనుసరించి వివాహ కార్యక్రమములు కొనసాగించిరి . ఆ వివాహ సమయములో ఆకాశమునుండి పుష్ప వర్షము కురిసేను . దివ్యదుందుభులు మ్రోగెను . గంధర్వులు కమ్మగా గణములు చేసిరి . అప్సరసలు గుంపులుగా నాట్యము చేసిరి . ఆ విధముగా రఘువంశజుల వివాహములు అత్యద్భుతముగా జరిగెను . పిమ్మట వారంతా వారి వారి నవ వధువులతో కలసి తమ విడిది గృహములకు వెళ్లిరి . దశరధ మహారాజు కూడా నవ దంపతులను కళ్లారా చూసుకుంటూ సంతోషముతో మంత్రులు ,మునులు ,గురువులు వెంట రాగా విడిది గృహమునకు చేరెను . 

రామాయణము బాలకాండ డబ్బది మూడవ  సర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














0













Sunday 18 September 2016

రామాయణము బాలకాండ డబ్బదిరెండవ సర్గ

                                         రామాయణము  

                                             బాలకాండ డబ్బదిరెండవ సర్గ 

జనక మహారాజు ఈ విధముగా తన వంశ చరితను గురించి చెప్పగా విశ్వామిత్రుడు "ఓ రాజా !ఈ రెండు వంశముల మధ్య ఏర్పడు వివాహ సంబంధములు అన్ని విధములుగా పరస్పరము తగి వున్నవి . రూపలావణ్యవైభవములలో సీతారాములు ఊర్మిళాలక్ష్మణులు ఒకరికొకరు తగినవారు . ఓ నరేంద్రా నేనొక మాట చెప్పదలిచాను . ఓ రాజా !నీ తమ్ముడైన కుశధ్వజుడి కుమార్తెలు (మాండవి ,శ్రుతకీర్తి )నిరుపమానసౌందర్యవతులు . ఆ కన్యలిరువురికి ధీశాలురు అయిన భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుట మంచిదని అభిలషించుచున్నాను . "అని పలికెను . 
విశ్వామిత్రుడి మాటలు విన్న జనక మహారాజు వశిష్టుని అనుమతి తీసుకుని ,అంజలి ఘటించి "ఓ మునీశ్వరులారా !ఈ వివాహబంధము మీరు స్వయముగా ఆజ్ఞాపించివున్నారు . కావున 'విదేహ 'వంశము ధన్యమైనట్లు భావిస్తాను . సంతోషముగా ఈ వివాహములును జరిపిస్తాను . ఈ నాలుగు జంటలకు ఒకేసారి వివాహము జరిపించెదను . "అని పలికి దశరధునితో 
"ఓ మహారాజా గురువుల ఆజ్ఞ మేరకు నేను మీ కుమారులు నలుగురికి ,నా ఇద్దరు పుత్రికలు ,నా తమ్ముడి ఇద్దరు పుత్రికలను కన్యాదానము చేయదలిచాను . తమరు దయతో అంగీకరించి వివాహ నాంది కార్యక్రమములు మొదలుపెట్టుడు . ఈ రాజ్యమును మీరు పరిపాలించు అయోధ్యగానే భావింపుడు దీనిపై మీకు సర్వాధికారములు కలవు . సముచితముగా నన్ను ఆజ్ఞాపింపుడు "అని పలికెను . 
జనకుడి మాటలకు మిక్కిలి సంతుష్టుడైన దశరధుడు బాగు బాగు అని పలికి నాంది కార్యక్రమములు మొదలుపెడతాను అని చెప్పి విశ్వామిత్ర ,వశిష్టులతో కూడి తన విడిదికి వెళ్లి నాంది కార్యక్రమములు మొదలుపెట్టేను . మరునాడు ప్రాతః కాలమునే లేచి బంగారు కొమ్ములు గలవి ,సమృద్ధిగా పాలు ఇచ్చునవి ,దూడలు కలిగినవి అయిన గోవులను ఒకొక్క కుమారుడు పేరున ఒక లక్ష గోవుల చప్పున నాలుగు లక్షల గోవుల్ని ,పాలు పిదుకుకొనుటకు కంచుపాత్రలని ,బ్రాహ్మణోత్తములకు దానము ఇచ్చెను . ఇంకనూ పుష్కలముగా ధనమును ,అనేక ఇతర వస్తువులను పుత్రుల స్నాతక సమయములో బ్రాహ్మణులకు దశరధుడు దానము ఇచ్చెను . 

రామాయణము బాలకాండ డబ్బడి రెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














Saturday 17 September 2016

రామాయణము బాలకాండ _డబ్బదిఒకటవసర్గ

                                            రామాయణము 

                                                      బాలకాండ _డబ్బదిఒకటవసర్గ 

ఈ విధముగా పలుకుచున్న వశిష్ఠమహర్షికి నమస్కరించి జనకుడు బాగు బాగు .  చరితను కూడా తెలిపెదను దయతో వినుడు అని ఇలా పలికెను . 
"మా వంశమునకు మూల పురుషుడు 'నిమి 'మహారాజు . అతని కుమారుడు మిధి . అతడే మిథిలా నగర నిర్మాత . ఆయన కుమారుడు ఉదావసుడు అతని సుతుడు నందివర్ధనుడు . అతని కొడుకు సుకేతుడు . సుకేతుడి కుమారుడు దేవరాతుడు . ఆయన కుమారుడు బృహద్రధుడు . అతని కొడుకు మహావీరుడు . అతని కుమారుడు సుదృతి . అతని సుతుడు ధృష్టకేతువు . అతని కొడుకు హర్యశ్వుడు . అతని కుమారుడు మరువు . ప్రతిందకుడు అతని  కుమారుడు .  ఆయన కుమారుడు కీర్తిరథమహారాజు . అతని కొడుకు దేవమీఢుడు . ఆయన కొడుకు విబుధుడు . అతని కొడుకు మహీధ్రకుడు . కీర్తిరాతుడు మహీధ్రకుడి కొడుకు . ఆయన పుత్రుడు మహారోముడు . ఆయన తనూజుఁడు స్వర్ణరోముడు . అతని పుత్రుడు హ్రస్వరోముడు . ఆయన కుమారులలో నేను పెద్దవాడను . నా తమ్ముడు కుశధ్వజుడు . నేను ఈ రాజ్యమునకు రాజునై పరిపాలించుచున్నాను .
మహావీరుడైన సుధన్వుడు అను రాజు సర్వ శ్రేష్టమైన శివధనస్సుని అందాలరాశి అయిన నా కుమార్తె సీతను తనకు ఇవ్వవలసిందిగా నాకు కబురు పెట్టెను . నేను అంగీకరింపనందున నా మీదకు యుద్ధమునకు వచ్చెను . ఆ యుద్ధమున నేను అతడిని గెలిచి ఆ సాంకాశ్య రాజ్యమునకు నా తమ్ముడిని రాజుని చేసాను . నేను మిక్కిలి సంతోషముతో సీతను ,రాముడికి ,ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహము చేసెదను . 
ఓ దశరథ మహారాజా !రామలక్ష్మణులచే స్నాతకము చేయించుము . వివాహమునకు సంభందించిన నాందీ విధులను నిర్వహింపుము . ఓ మహానుభావా !నేడు మఖ నక్షత్రము నేటి నుండి మూడవ దినమున ఉత్తర ఫల్గుణీ నక్షత్రము ఆరోజు వివాహము జరిపించెదము . "అని పలికెను . 

రామాయణము బాలకాండ డబ్బదిఒకటవ సర్గసమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






 















Friday 16 September 2016

రామాయణము బాలకాండ _డబ్బదియవసర్గ

                                రామాయణము 


                                        బాలకాండ _డబ్బదియవసర్గ 

మఱునాడు ఉదయము ప్రాతః కాలమున జనకమహారాజు మహర్షుల పర్యవేక్షణలో యజ్ఞకర్మలను ముగించుకొనెను . పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందుడితో "ఓ మహర్షీ !నా తమ్ముడగు కుశధ్వజుడు మహా పరాక్రమశాలి ,పరమధార్మికుడిగా ఖ్యాతికెక్కాడు . ఇప్పుడతను ఇక్షుమతీ నాదీ తీరమునకల సాంకాశ్యనగరమున నివశించుచున్నాడు . అతడు సాంకాశ్య నగరము నుండే నా యజ్ఞమునకు కావలిసిన సామాగ్రిని పంపి ,యాగ నిర్వహణకు తోడ్పడెను . ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నాచెంత ఉండుట ఎంతో అవసరము . అతడు నాతొ కలసి ఈ పెండ్లి వేడుకలలో పాల్గొని ఎంతో ఆనందిస్తాడు . "అని చెప్పి ,కొందరు దూతలను "కుశధ్వజునికి వర్తమానము అందించి వెంట తీసుకు రమ్మని" ఆజ్ఞాపించెను .
ఆ దూతలు జనకుడి ఆజ్ఞప్రకారము వాయువేగముతో వెళ్లి ,జనకుడి సందేశము చెప్పిరి . వెంటనే కుశధ్వజుడు బయలుదేరి మిధిలకు వచ్చెను . మిక్కిలి బలశాలురు అయిన ఆ అన్నతమ్ములు మహా మంత్రి అయిన సుధాముని పిలిచి" దశరధుడికి వద్దకు వెళ్లి సవినయముగా ఆయనను ,ఆయనకుమారులను వెంట తీసుకురమ్ము "అని ఆజ్ఞాపించిరి . అప్పుడు సుదాముడు దశరధుని విడిది గృహమునకు వెళ్లి ఆయనకు శిరసా ప్రణమిల్లి ,ఆయనకు ,జనకుని ఆహ్వానమును తెలిపెను . పిమ్మట దశరధుడు కుమారులు ,పురోహితులు ,మంత్రులు తదితర పరివారముతో జనకుని సభకు వెళ్లెను . అప్పుడు వశిష్ఠుడు దశరుడి వంశ క్రమమును ఈ విధముగా చెప్పెను . 
"ఓ జనక మహారాజా !అవ్యక్తమైన పరభ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు పుట్టెను . ఆయన నుండి మరీచి పుట్టెను . మరీచి కొడుకు కాశ్యపుడు ,ఆయన కొడుకు సూర్యుడు . సూర్యుడి కొడుకు వైవశ్వత మనువు ఈ మనువే మొదటి ప్రజాపతి . మనువు పుత్రుడు ఇక్ష్వాకువు . మొదటి అయోధ్య ప్రభువు ఈ ఇక్ష్వాకుడే . కుక్షి ఇతడి పుత్రుడు . అతని కొడుకు వికుక్షి అతడి కొడుకు బాణుడు . భానుడి కొడుకు అనరణ్యుడు . అతడి కుమారుడు పృధువు .ఆయన కుమారుడు త్రిశంకువు . ఇతడి కొడుకు దుందుమారుడు . ఆయన కొడుకు యువనాశ్వుడు . ఆయన కుమారుడు మాంధాత . ఇతడి సుపుత్రుడు సుసంధి . ధ్రువసంధి ఇతడి పుత్రుడు . ఇతడి కొడుకు భరతుడు . అతడి కొడుకు ఆసితుడు . 
శూరులైన హైహయ ,తాళజంఘ ,శశిభిందు వంశములకు చెందిన రాజులు యుద్ధమున ఆసీటుని పరాజితుని చేసిరి . ఆసితుడు తన ఇరువురు భార్యలతో ,మంత్రులతో హిమవత్పర్వతమునకు చేరెను . కొంతకాలమునకు అతడు అక్కడే మరణించేను . అప్పటి అతడి ఇరువురు భార్యలు గర్భవతులు . ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భము నశింపచేయుటకు ఆమెకు(కాళిందికి ) విషాహారం ఇచ్చెను . ఆ సమయములో భృగు మహర్షి కుమారుడైన చ్యవనుడు అచటికి రాగా కాళింది ఆయనకు నమస్కారము చేసి తన గర్భస్థ శిశువుని కాపాడమని కోరెను . ఆయన ప్రభావము వలన విషము ఏమి చెయ్యలేదు . ఆమె పుత్రుడు సగరుడు . సగరుని కుమారుడు అసమంజుడు . ఆయన కుమారుడు అంశుమంతుడు ఆయన పుత్రుడు దిలీపుడు . ఆయన పుత్రుడు భగీరధుడు . భగీరధుడు కొడుకు కాకుత్సుడు అతని కుమారుడు రఘుమహారాజు . ఆయన కొడుకు ప్రవృద్ధుడు . ఆయన వశిష్టుని శాపము వలన నరమాంసకుడైన రాక్షసుడు అయ్యెను . అతని కుమారుడు శంఖణుడు . అతడి కొడుకు సుదర్శనుడు . ఆయన సుతుడు అగ్నివర్ణుడు . అతడి కొడుకు శీఘ్రగుడు . అతడి కొడుకు మరువు . అతడి కొడుకు ప్రశుశ్రుకుడు . ఆయన పుత్రుడు అంబరీషుడు . ఆయన కొడుకు నహుషమహారాజు . నహుషుడి కొడుకు అంబరీషుడు . అతడి కొడుకు నాభాగుడు . ఆయన కొడుకు అజుడు . యజుది పుత్రుడే దశరధుడు . రామలక్ష్మణులు ఇద్దరు ఆయన పుత్రులు . 
ఇక్ష్వాకు వంశము మొదటి నుండి అతి పవిత్రమైనది . ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమ ధార్మికులు ,వీరులు ,సత్యసంధులు . ఓ మహారాజా !ఆ వంశ సంజాతులైన రామలక్ష్మణులకు నీ కుమార్తెలగు సీతా ,ఊర్మిళను ఇచ్చి వివాహము జరిపించుట ఎంతో ఉచితమైనది . "అని పలికెను . 

రామాయణము బాలకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .     















Thursday 15 September 2016

రామాయణము బాలకాండ _అరువది తొమ్మిదవ సర్గ

                                రామాయణము 

                        బాలకాండ _అరువది తొమ్మిదవ సర్గ 

మరునాడు ఉదయమే దశరథ మహారాజు సంతోషము తో సుమంత్రుడితో "కోశాధికారులు అందరూ సమృద్ధిగా ధనమును,రత్నములు ,బంగారు ఆభరణములు ,మొదలగు పెండ్లికి కావలిసిన వస్తువులను సమృద్ధిగా తీసుకుని ముందుగా వెళ్లవలెను . చతురంగ బలములు ముందు వెళ్లవలెను . వశిష్ట మహర్షి ,వామదేవుడు ,జాబాలి ,కశ్యపుడు ,మార్కండేయుడు ,కాత్యాయనుడు అట్లే ఈ బ్రాహ్మణోత్తములందరూ  విధముగా ముందుగా తరలిపోవుదురు . ఏ మాత్రము జాగు చేయక నా రధమును సిద్దము చేయుము . "అని పలికి . ఆ విధముగా అయోధ్యకు బయలుదేరివెళ్లెను . 
జనక మహారాజు దశరథ మహారాజుకి ఎదురువెళ్ళి సముచితముగా స్వాగత సత్కారములు చేసి ,ఆయన రాక తన అదృష్టముగా భావించి వైభవోపేతముగా ఆహ్వానించెను . రాముడు దశరధుని రాకను గురించి తెలుసుకుని ఆయన విడిది భావనమునకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసెను . రామలక్ష్మణులను చూసి దశరధుడు ఎంతో   మురిసిపోయెను . 
మరునాడు ఉదయము జనక మహారాజు తన యజ్ఞమును పూర్తి చేసుకుని కుమార్తె వివాహమునకు అంకురార్పణ చేసెను . 

రామాయణము బాలకాండ అరువది తొమ్మిదవ సర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము బాలకాండ _అరువది ఎనిమదవసర్గ

                        రామాయణము 

                      బాలకాండ _అరువది ఎనిమదవసర్గ 


జనకమహారాజు ఆదేశమును అనుసరించి మంత్రులు మూడు రోజులు నిర్విరామముగా ప్రయాణించి ,అయోధ్య చేరి దశరధుని అనుమతి తీసుకుని ,రాజభవనమున ప్రవేశించి దశరథ మహారాజుని దర్శించిరి . పిమ్మట ఆయన క్షేమసమాచారమును అడిగి ,జనక మహారాజు పంపిన వర్తమానమును తెలిపిరి ." విశ్వామిత్రుడి ఆజ్ఞను ,శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఈ వర్తమానమును మీకు తెలిపి మిమ్ము సవినయముగా తోడ్కొని రమ్మంటిరి "అని పలికిరి . 
అంతట సభలోని మహర్షులు మున్నగు వారు బాగుబాగు అని పలికిరి . అప్పుడు దశరధుడు పరమానందభరితుడై "రేపే ప్రయాణము "అని మంత్రులతో పలికెను . వారు ప్రయాణ సన్నాహములు చేసిరి . 

రామాయణము బాలకాండ అరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .         






Wednesday 14 September 2016

రామాయణము బాలకాండ అరువది ఏడవసర్గ

                         రామాయణము 


                           బాలకాండ అరువది ఏడవసర్గ 

అంతట జనకమహారాజు ఆజ్ఞ ఇవ్వగా దీర్ఘ దేహులు ,బలిష్ఠులు అయిన 5000 మంది ఎనిమిది చక్రములు కలిగిన శకటమును మిక్కిలి కష్టముగా లాక్కొచ్చిరి . విశ్వామిత్రుడు "రామా !ధనుస్సుని చూడు అని ఆజ్ఞ ఇవ్వగా శ్రీరాముడు ఆ పుట్టలోని ధనుస్సుని చూసి "దీనిని ముట్టుకొని ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టెదను "అని అడిగెను . దానికి జనకుడు ,విశ్వామిత్రుడు సరే అనిరి . 
అప్పుడు వేలమంది సదాన్యులు చూచుచుండగా ధనుస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకుని ,వింటి నారిని ఆకర్ణాంతము లాగెను . వెంటనే అది పెళ్లున పెద్ద శబ్దము చేస్తూ విరిగెను . ఆ శబ్దము పర్వతములు బద్దలైనట్లుఅనిపించెను . భూమి కంపించెను . విశ్వామిత్రమహర్షి ,జనకమహారాజు ,రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ స్పృహ తప్పి పడిపోయిరి .  కొంతసేపటికి తేరుకుని లేచిరి . 
అప్పుడు జనకమహారాజు విశ్వామిత్రునితో "ఓ మహాత్మా !దశరధుని కుమారుడైన శ్రీరాముడి ప్రతాపము ప్రత్యక్షంగా చూసాను . నా కూతురు నా ప్రాణములకన్నా మిన్న అయినది . ఆమె శ్రీరాముడికి ఇవ్వతగినది . ఓ బ్రహ్మర్షీ !మీరు అనుమతి ఇచ్చినచో దశరథ మహారాజు వద్దకు దూతలను పంపి జరిగిన వృత్తాన్తమును ఆయనకు సవినయముగా తెలిపి ఆయనను చక్కగా ఆహ్వానించి ,మిధిలకు తీసుకుని వత్తురు . "అని పలికెను . 
విశ్వామిత్రుడు ఆమోదం తెలిపెను . వెంటనే జనకుడు తన మంత్రులను పిలిపించి శుభ ఆహ్వాన పత్రిక ఇచ్చి దానిని దశరథ మహారాజుకు అందించి సీతా పరిణయ వృత్తాన్తము ,రామ ధనుర్భంగము తదితర వివరములను వినయముగా తెలిపి ఆ మహారాజుని తోడ్కొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి అయోధ్యకు పంపెను  . 

రామాయణము బాలకాండ అరువది ఏడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


                  











Saturday 10 September 2016

రామాయణము బాలకాండ -అరువదిఆరవసర్గ

                                        రామాయణము 

                                             బాలకాండ -అరువదిఆరవసర్గ 

మరునాడు ఉదయం జనకమహారాజు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి ఏంతో  వినయముతో నేను మీకు ఏమి చేయగలను ?నన్ను ఆజ్ఞాపించండి . అని పలికెను . అప్పుడు విశ్వామిత్రుడు "ఓ జనక మహారాజా !ఈ రామలక్ష్మణులు నీ వద్ద వున్న ధనుస్సుని చూడదలిచారు . దానిని చూపించుము . వీరు ఆ ధనుస్సుని చూసి తమ ముచ్చట తీర్చుకుని వెళ్ళెదరు . "అని చెప్పెను . 
అందుకు జనక మహారాజు "తప్పకుండా చూపించెదను . ముందుగా ఆ ధనుస్సు నా ఇంట ఉండుటకు గల కారణము తెలిపెదను" . అని చెప్పిఇలా తెలిపెను . "నిమి వంశమున ఆరవ చక్రవర్తి అయిన "దేవరాతుడు " అను మహారాజు మిగుల  ఖ్యాతివహించాడు . పూర్వము దక్షయజ్ఞ ధ్వంస సమయములో శివుడు ఈ ధనుస్సుని ఎక్కుపెట్టి కోపముతో నాకు ఈ యజ్ఞములో  స్థానములేని కారణముగా ఈ  ధనస్సుతో అందరి తలలు ఖండించెదను . అని పలికెను దేవతలు శివుడిని ప్రార్ధించిరి . వారి ప్రార్ధనలు మన్నించిన శివుడు ఆ ధనుస్సుని వారికే ఇచ్చివేసెను . వారు ఆ ధనుస్సుని దేవరాతుడికి ఇచ్చిరి . 
ఒకప్పుడు నేను యాగానిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటిచాలు నుండి ఒక కన్య వెలువడెను . నాగలించాలున లభించినందున ఆమెకు సీత అని పేరువచ్చెను . ఈమె భూమి నుండే ఉద్భవించినప్పటికీ ఈమెను పెంచాను కాబట్టి నా కూతురు అయింది . అయోనిజ అయిన ఆమెకు పరాక్రమమే శుల్కము . అనగా పరాక్రమమంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు . నా కుమార్తెను వివాహము చేసుకొనుటకు అనేక మంది రాజులు వచ్చిరి . ఆ రాజులాంరదరూ మిధిలకు వచ్చి ,ధనుస్సుని ఎక్కుపెట్టి తమ పరాక్రమము పరీక్షించుకొనకొరిరి . వారిలో ఎవ్వరు దానిని ఎక్కుపెట్టలేకపోయారు సరికదా కనీసం కదల్చలేకపోయారు . కావున వారిలో ఎవ్వరికి నేను సీతను ఇవ్వలేదు . దానితో వారు కుపితులై మిధిలను ముట్టడించిరి . తపస్సు ద్వారా నాకు లభించిన చతురంగ బలముతో వారిని ఓడించినాను . ఆ ధనుస్సుని రామలక్ష్మణులకు చూపించెదను . దానిని ఎక్కుపెట్టినచో సీతని ఇచ్చి పెండ్లి చేసెదను . "అని చెప్పెను .

రామాయణము బాలకాండ అరువది ఆరవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





















రామాయణము బాలకాండ -అరువది అయిదవసర్గ

                         రామాయణము 

                         బాలకాండ -అరువది అయిదవసర్గ 

ఆ ముని పిమ్మట ఉత్తర దిశను వదిలి తూర్పు దిశకు వెళ్లి తానూ సంకల్పించిన రీతిలోనే వేయి సంవత్సరములపాటు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసెను . వేయి సంవత్సరములు పూర్తి కాగానే భోజనము చేయుటకు సిద్దపడెను . ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియై ఆ సిద్దఅన్నమును కోరెను . పూజ్యుడైన ఆ ఋషి మౌనవ్రతమున ఉండుట చే ఏమి పలుకక ఆ అన్నము మొత్తము ఇంద్రుడికి ఇచ్చివేసెను బ్రాహ్మవేషములో వున్న ఇంద్రుడు ఏమి మిగల్చకుండా అన్నము మొత్తము భుజించెను . విశ్వామిత్రుడు ఏమి తినకుండానే తిరిగి శ్వాసను బందించి తపస్సు చేయనారంభించెను . ఆ విధముగా తపస్సు చేయుచున్న ఆయన శిరస్సునుండి అగ్నిజ్యాలలు తీవ్రముగా వ్యాపించెను . అంతట దేవతలు ,గాంధర్వులు ,నాగులు ,అసురులు ,రాక్షసులు ,ఆ తపోరూప అగ్నితాపమునకు మూర్చితులయిరి . 
అంతట వారంతా బ్రహ్మ వద్దకు వెళ్లి" మేము అనేక విధములుగా విశ్వామిత్రుడిని ప్రలోభపెట్ట చూసాము . ఆయనకు కోపము తెప్పించ చూసాము . కానీ ఆయన దేనికి లొంగలేదు . ఆ మహర్షి తపో మహిమతో లోకములన్నీ అతలాకుతలం అవ్వసాగాయి . కావున లోకములను రక్షింపుము అని కోరిరి ". అనంతరము  దేవతలతో కూడి బ్రహ్మ విశ్వామిత్రుడి ఎదుట ప్రత్యక్షమై" ఓ కౌశికా !నీ తపమునకు మెచ్చితిని . నీకు బ్రహ్మత్వము ,దీర్గాయువు ప్రసాదిస్తున్నాను "అని పలికెను . అప్పుడు విశ్వామిత్రుడు "ఓ పితామహా !ధన్యుడను అయ్యాను . నాకు శిష్యులకు వేదమును భోదించే అర్హతను ప్రసాదించుము . బ్రహ్మ తనయుడు అయినా వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనునట్లు చేయుము . "అని కోరెను . 
దేవతలు స్మరించగా వశిష్ఠుడు ప్రత్యక్షమై ",యజ్ఞములు చేయుటకు ,శిష్యులకు వేదములు భోదించుటకు నీవు అర్హుడివే నీవు బ్రహ్మర్షివి అయ్యావు "అని విశ్వామిత్రునితో పలికెను . దేవతలు అందరూ నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి అని పలికి వారంతా వారివారి స్థానములకు వెళ్లిరి . పిమ్మట విశ్వామిత్రుడు తన తపస్సును కొనసాగించుచు భూలోకమంతా తిరగసాగెను . అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాన్తమును సమస్తము వివరముగా తెలిపెను . 
పిమ్మట అక్కడ వున్న జనక మహారాజు విశ్వామిత్రుడితో" ఓ మహర్షీ !నా ఆహ్వానమును మన్నించి విచ్చేసినందుకు చాలా సంతోషము . మీ గాధను శతానందుడు వినగా నేను కూడా విన్నాను . ఇక్కడ మునులు అందరూ విన్నారు . మీ తపస్సు అద్భుతమైనది . మీ బలము నిరుపమానము . మీ గాధలు ఎంత విన్నను తనివితీరుటలేదు . రేపు ప్రాతః కాలమున నేను దర్శింతును ఇప్పుడు నేను వెళ్లెదను . అనుమతి ఇవ్వండి "అని పలికెను . 
అంతట విశ్వామిత్రుడు మిక్కిలి సంతుష్టుడై జనక మహారాజు వెళ్ళుటకు అనుమతి ఇచ్చెను . అప్పుడు జనక మహారాజు తన బంధుమిత్రులతో కలసి విశ్వామిత్రుడికి ప్రదక్షణ చేసి ఆయన అనుమతి పొంది తన భావనమునకు వెళ్లెను . ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తమ నివాసామునకు వెళ్లిరి . 

రామాయణము బాలకాండ అరువది అయిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Friday 9 September 2016

రామాయణము బాలకాండ -అరువదినాల్గవసర్గ

                         రామాయణము 

                       బాలకాండ -అరువదినాల్గవసర్గ 

దేవేంద్రుడు రంభను పిలిపించి విశ్వామిత్రుడి తపమునకు విఘ్నము కలిగించమని చెప్పెను . అందులకు రంభ భయపడుతూ ,సిగ్గుపడుతూ "ఓ దేవేంద్రా !ఆ విశ్వామిత్రుడు ముక్కోపి . నేను అతడి తపస్సు భంగము చేసిన ,అతడు నన్ను భస్మము చేసేదడు అందులకే  నేను భయపడుతున్నాను . "అని పలికెను . అప్పుడు ఇంద్రుడు "రంభా భయపడకు . ఇది నా ఆజ్ఞ అనుసరించు . వసంత ఋతువున వృక్షములన్నీ కొత్త చిగుళ్లతో ,పుష్పములతో విలసిల్లుతుండగా ఆ సమయములో మన్మధుడితో కూడి నీకు దగ్గరలోనే వుంటాను "అని పలుకగా 
రంభ ఇంద్రుని శాసనమును అనుసరించి పరం ఆకర్షణీయముగా తయారయి చిరునవ్వులు నవ్వుతూ ,విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను . విశ్వామిత్రుడు మధుర కోకిల ధ్వని విని కళ్ళు తెలిచి చూసేను . ఎదురుగా వున్న రంభను చూడగా ఆయనకు సందేహము కలిగెను . అదంతా ఇంద్రుని పన్నాగము అని గ్రహించి మిక్కిలి కోపముతో 10000సంవత్సరములు శిలగా పడివుండు అని రంభని శపించెను . మహర్షి రంభను శపించు  వచనములు విని ఇంద్రుడు ,మన్మధుడు నెమ్మిదిగా అటునుండి ఆటే పోయెను .  రంభను  శపించిన పిమ్మట మహాతేజస్వి అయినా విశ్వామిత్రుడు తన కోపమును నిగ్రహించుకోలేకపోయినందుకు మిక్కిలి బాధపడెను . మహర్షి శాప ప్రభావమున రంభ కఠోర శిలగా మారిపోయెను . కోపమునకు లోనగుటచే ఆయన తపోబలము తగ్గిపోయెను . ఇక కోపమునకు ఏమాత్రము తావివ్వకూడదని నిర్ణయించుకుని , ఊపిరి బిగపట్టి కుంభములో ఉండి ,గాలి పీల్చకుండా ,ఆహారము స్వీకరించకుండా కఠోర తపస్సు చేయవలెనని నిర్ణయించుకొనెను . 

రామాయణము బాలకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 










Thursday 8 September 2016

రామాయణము బాలకాండ -అరువది మూడవసర్గ

                                            రామాయణము 

                                      బాలకాండ  -అరువది మూడవసర్గ 

విశ్వామిత్రుడు చాలాకాలము తీవ్ర తపస్సు చేయగా బ్రహ్మ దేవతలతో కోడి వచ్చి ఆయనకు ఋషిత్వము ప్రసాదించెను . దానికి విశ్వామిత్రుడు తృప్తి చెందక మరల తీవ్ర తపస్సు చేయసాగెను . ఆ విధముగా తీవ్ర తపస్సు చేయుచున్న విశ్వామిత్రుడి వద్దకు దేవతలు పంపగా ఆయన తపస్సుని భంగము చేయుటకు మేనక అను అప్సరస స్వర్గలోకము నుండి వచ్చి విశ్వామిత్రుడి కంట పడెను . 

వారిరువురు ఆశ్రమమందు ఏంటో సంతోషముగా ఉండిరి (విశ్వామిత్రుడి తపస్సు ఉట్టికెక్కెను ). ఆ విధముగా 10 సంవత్సరములు గడిచినవి . వారికి ఒక కుమార్తె కలిగెను . ఆమే శకుంతల ఆమె సంతానము అయిన భరతుడు పేరు మీదనే మన దేశమునకు భారతదేశము అను పేరు వచ్చినది . విశ్వామిత్రుడు తన తపస్సు భంగము అయినందుకు సిగ్గుపడి బాధపడుచుండెను . ఆయనను చూసి మేనక మిగుల భయపడసాగెను . అలా భయపడుతున్న మేనకను చూసి ఇందు నీ తప్పు ఏమిలేదు . నేనే కామపారాత్రాంతుడనై ఈ అపరాధము చేసితిని అని పలికి ఆమెను పంపివేసెను . అనంతరము కౌశికుడు (కుశికుని మనవడు అయినా విశ్వామిత్రుడు )ఉత్తరమున వున్నహిమాలయములకు వెళ్లి తపస్సు చేయసాగెను . 
ఆ విధముగా ఘోర తపస్సు చేయుచున్న విశ్వామిత్రుని వద్దకు బ్రహ్మ ,దేవతల తో కూడి వచ్చి "నాయనా! నీవు ఋషులలో ముఖ్యుడవు . నీ తీవ్రతపస్సు కి మెచ్చాను . నీకు మహర్షిత్యము ప్రసాదిస్తున్నాను . "అని పలికి అంతర్ధానమయ్యెను . వారందరూ వెడలిపోగా విశ్వామిత్రుడు మరల అతి తీవ్రముగా వాయువును మాత్రమే ఆహారముగా తీసుకుంటూ తపస్సు చేసెను . 
కఠోర నియమములతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడిని చూసి ఇంద్రాది దేవతలు ఆయన తపస్సును భంగపరచటానికి రంభను పంపించడానికి నిశ్చయించుకుని ఆమెతో ఇలా అనెను . 

రామాయణము బాలకాండ అరువది మూడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















Wednesday 7 September 2016

రామాయణము బాలకాండ -అరువదిరెండవసర్గ

                         రామాయణము 

                  బాలకాండ -అరువదిరెండవసర్గ               

ఆ విధముగా తానూ యజ్ఞ పశువుని అయినందుకు బాధపడుతూ అంబరీష మహారాజుతో ముందుకు సాగుతున్న శునస్సేపుడు ,మధ్యాహ్న కాలమగుటచే పుష్కర క్షేత్రమందు మహారాజు విశ్రమించగా అక్కడ తిరుగుతూ ,విశ్వామిత్రుని చూసి ,మిగుల దుఃఖముతో విశ్వామిత్రుని వడిలో వాడి ఏడవసాగెను . విశ్వామిత్రుడు కారణమడుగగా ,శునస్సేపుడు జరిగిన వృత్తాoతము అంతా చెప్పి ,"రాజుగారి యజ్ఞము నిర్విఘ్నముగా సాగునట్లు చేయుము ,అట్లే నన్ను రక్షించుము" . అని కోరెను 
అంత విశ్వామిత్రుడు శునస్సేపుని ,ఓదార్చి ,అభయమిచ్చి తన కుమారులలో ఎవరో ఒకరిని శునస్సేపునికి బదులుగా యజ్ఞ పశువుగా వెళ్ళమని చెప్పెను . దానికి వారు "కుమారుల ప్రాణములు బాలి యిచ్చి అన్యులను కాపాడుట అకృత్యము "అని పలికిరి . అప్పుడు విశ్వామిత్రుడు వారిని ముష్టిక జాతులలో జన్మించి కుక్క మాంసము తింటూ బతకమని శపించెను . 
శునస్సేపునికి అభయమిచ్చి ఇలా పలికెను . "ఓ ముని కుమారా !యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భలతో బంధించి ,ఎర్రని పూలమాలలతో అలంకరింతురు . అప్పుడు నీవు విష్ణుదేవతా సంభందిత యూపీఏ స్తంభము వద్దకు వెళ్లి అగ్నికి అభిముఖంగా నిలబడి ,ఇంద్రుని ,ఉపేంద్రుని స్తుతించు . పిమ్మట నేను ఉపదేశించబోవు ఇంద్ర ,ఉపేంద్ర గాధలను గానము చేయుము . అప్పుడు నీ మనోరధము నెరవేరుతుంది . 
విశ్వామిత్రుడు బోధించిన మంత్రములను ,గాధలను గ్రహించి ,తిరిగి అంబరీష మహారాజు వద్దకు వెళ్లి ఆయనతో కలసి యజ్ఞ భూమికి వెల్లెను . అక్కడ యజ్ఞ పశువు అయిన ముని కుమారుని దర్భలతో బంధించి ,చందనంతో ,ఎర్రటి మాలతో అలంకరించి ,ఎర్రని వస్త్రములను ధరింపచేసి యూపస్తంభమునకు కట్టెను . అప్పుడు శునస్సేపుడు విశ్వామిత్రుడు చెప్పినట్లు ఇంద్రుడిని ఉపేంద్రుడిని స్తుతించెను అంతట ఇంద్రుడు మిక్కిలి సంతోషముతో శునస్సేపునికి దీర్గాయువును ప్రసాదించెను . అంబరీష మహారాజుకి యజ్ఞ ఫలము దక్కేను . 

రామాయణము బాలకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Tuesday 6 September 2016

రామాయణము బాలకాండ -అరవదియొకటవ సర్గ

                                  రామాయణము 

                               బాలకాండ -అరవదియొకటవ సర్గ 

ఆ విధముగా అందరూ ఇటువారు అటు వెడలగా విశ్వామిత్రుడు ,పశ్చిమ దిశలో కల మూడు బ్రహ్మ తీర్ధములలో కల తపో వనములో తపము ఆచరించుటకు వెళ్లెను . అచట తీవ్రమైన తపస్సు చేయుచుండెను . 
అదే సమయములో అయోధ్యేయాధీశుడైన అంబరీష మహారాజు గొప్ప యజ్ఞమును తలపెట్టెను . అతడి యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరించుకుపోయేను . అందులకు మిగుల చింతించుచు ,గురువుల సలహా ప్రకారము కోరినవన్నీ ఇచ్చి ఎవరిని ఒక మానవుడిని యజ్ఞ పశువుగా చేసుకొనుటకు వెతుకుచుండెను . అలా వెతుకుతూ ఋచీక మహర్షి వద్దకు చేరి ,ఆయనకు నమస్కరాము చేసి ,కుశల  ఆయనను ప్రసన్నుడిని చేసుకుని ,జరిగిన విషయము చెప్పి ,యజ్ఞపశువుగా వారి కుమారుడిని కోరెను . బదులుగా తగిన మూల్యమును చెల్లించెదనని చెప్పెను . 
అప్పుడు ఋచీకుడు "ఓ రాజా !నా పెద్దకుమారుడన్న నాకు పరమ ప్రీతి కావున అతడిని నీకు అమ్మజాలను . "అని చెప్పెను . ఋచీకుడి పత్ని "చిన్న కుమారుడన్న నాకు అత్యంత ఇష్టం కావున నా చిన్న కుమారుడిని నేను ఇవ్వను "అని పలికెను . పరిశేష న్యాయం అనుసరించి ,మధ్యమ కుమారుడైన శునస్సేపుని తనతో తీసుకు వెళ్తు బదులుగా లక్షగోవులను ఇచ్చి సంతోషముగా ఇంటి దాని పట్టెను . 

రామాయణము బాలకాండ అరవదియొకటవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 5 September 2016

రామాయణము బాలకాండ -అరువదియవ సర్గ

                            రామాయణము 

                       బాలకాండ -అరువదియవ సర్గ 

ఆ విధముగా శపించిన తర్వాత అక్కడ వున్న ఋషులు ,మునులతో "ఇతడు సుప్రసిద్దుడైన ఇక్ష్వాకు వంశ మహారాజు ,ధార్మికుడు ,దానశీలుడు సశరీరము గా స్వర్గమునకు వెళ్ళవలెననే కోరికతో నన్ను ఆశ్రయించివున్నాడు . యజ్ఞప్రభావమున యితడు స్వర్గమునకు చేరునట్లు మనము ఒక క్రతువును నిర్వహించవలెను . "అని చెప్పెను . 
ఆయన మాటలు విన్న ఋషులు ,మునులు విశ్వామిత్రుని మాటలు విని తమలో తాము ఈ విశ్వామిత్రుడు ముక్కోపి . ఆయన చెప్పినట్లే చేయుదుము . నిప్పులాంటివాడు ,ఆయనకు కోపము వచ్చినచో శపించగలడు . కావున ఆయన చెప్పినట్లు చేయుదుము . యాగ ఏర్పాట్లు చేయండి . ఈ యాగమునకు విశ్వామిత్రుడు ఆధ్వర్యము వహిస్తాడు  అనుకొనెను . 
యజ్ఞము చక్కగా జరుగుతోంది హావిర్భాగములు అందుకోవడానికి దేవతలు రావట్లేదు . అప్పుడు విశ్వామిత్రుడు కోపముతో ఊగిపోతూ ,"ఓ నరేంద్రా !నా తపః శక్తిని చూడు ఇప్పుడే నిన్ను సశరీరంగా స్వర్గమునకు పంపుతాను . నేను పెక్కు ఏండ్లు చేసిన అమోఘ తపః శక్తిని ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతాను . "అని పలికేను . త్రిశంకువు అందరూ చూస్తుండగానే ఆకాశము వైపు ఎగిరి వెళ్లెను . స్వర్గానికి వచ్చిన త్రిశంకువుని చూసి ఇంద్రుడు సకల దేవతల సమక్షంలో "ఓ త్రిశంకూ వెళ్ళిపో ,నీవు స్వర్గానికి అనర్హుడివి . నీవు గురువు చేత శపింపబడ్డావు కావున నీవు స్వర్గానికి రాలేవు . తలక్రిందులుగా భూమి మీదకు పడిపొమ్ము "అని పలుకగా ,ఆ త్రిశంకువు తలక్రిందులుగా భూమిమీద పడిపోవసాగెను . అలా పడిపోతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు "ఆగుము "అని పలికి ఆ త్రిశంకుని అక్కడే నిలిపి ఋషులు ,మునులు అందరూ చూస్తుండగా మరియొక నక్షత్రమండలిని ,మరియొక సప్తర్షిమండలమును ,స్వర్గమును సృష్టించెను .

అప్పుడు అక్కడి మునులందరూ ,దేవతలు ,సప్తఋషులు "ఓ మహానుభావా !తపోధనా !ఈ త్రిశంకువు గురువు చేత శపింపబడెను .. కనుక యితడు సశరీరంగా స్వర్గమునకు చేరుటకు అనర్హుడు "అని పలికిరి . 
అప్పుడు విశ్వామిత్రుడు ఇతడికి సశరీరంగా స్వర్గమునకు పాముతానని మాట ఇచ్చాను కావున నేను సృష్టించిన ఈ స్వర్గము ,నక్షత్రమండలము శాశ్వతముగా ఉంటాయి . అని పలికెను 
అప్పుడు దేవతలు ఋషులు "సరే అట్లే కానిండు . కానీ అతడు గురువుకు చేసిన అపచారం ఫలితముగా తలక్రిందులుగా ఉండును . "అని పలికి తమ స్థానములకు వెళ్లిరి . యజ్ఞము సమాప్తి అయినది . ఋషులు ,మునులు వారి వారి ప్రదేశములు వెళ్లిరి . 
రామాయణము బాలకాండ అరువదియవ సర్గసమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Saturday 3 September 2016

                                 రామాయణము 

                                  బాలకాండ _ ఏబదితొమ్మిదవసర్గ   

ఆ విధముగా తనను అర్ధించిన త్రిశంకుని మీద జాలి పడిన విశ్వామిత్రుడు "ఓ ఇక్ష్వాకు నరేంద్రా !నీవు ధార్మికుడవని నేను ఎరుగుదును . నీకు నేను అండగా ఉందును . యజ్ఞ కార్యమునకు అవసరమగు మునులను రప్పింతును . నీవు యజ్ఞము చేయుము . నిన్ను ఇలానే సశరీరంగా స్వర్గమునకు నేను పంపుతాను "అని ధైర్యము చెప్పి ,మిక్కిలి బుద్ధిశాలురు ,ధార్మికులు అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలిసిన సామాగ్రిని సమకూర్చమని ఆజ్ఞాపించెను . పిమ్మట తన శిష్యులను పిలిచి "సకల ఋషిగణములను ,వారి శిష్యులను ,బంధు ,మిత్రులను వెంటనే నా ఆదేశము అని చెప్పి తీసుకురండి . ఎవరయినా పరుషముగా పలికిన యెడల నాకు తెలపండి . "అని ఆజ్ఞాపించెను . 
విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారము యజ్ఞమునకు అవసరమగు సమస్త వస్తువులు వచ్చిచేరాయి . సమస్త దిక్కులనుండి ఋషులు ,మునులు ,శిష్య ,ప్రశిష్యులతో కూడి  విచ్చేసిరి . శిష్యులు వచ్చి "గురువర్యా !తమ ఆజ్ఞ అని చెప్పగానే ఋషులు ,మునులు అందరూ సంతోషముతో బయలుదేరిరి .మహోదయుడు అనే ముని ,వశిష్టుని 100 మంది పుత్రులు తప్ప అందరూ వచ్చుచున్నారు . ఓ మునీశ్వరా !ఆ వశిష్టుని పుత్రులు కోపముతో యజ్ఞము చేయువాడు చండాలుడు ,చేయించువాడు క్షత్రియులు  యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలు .ఋషులు ఎట్లు శ్వీకరింతురు . అని నిష్ఠురముగా పలికిరి "అని చెప్పిరి . 
అప్పుడు విశ్వామిత్రుడు కోపముతో "తీవ్రముగా తపమాచరించుచు పవిత్రముగా వున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దుర్మాత్ములందరూ మసియై పోవుదురు . ఇంకా ఏడువందల జన్మలవరకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు . "దురాత్ముడైన మహోదయుడు కూడా నన్ను దూషించెను కావున అతడు కిరాతుడై జనులందరి చేత దూషించబడును . ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు ,చంపుతూ బ్రతుకుచుందురు . "అని శాపము ఇచ్చెను . 

రామాయణము బాలకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

          








         

Friday 2 September 2016

రామాయణము బాలకాండ -ఏబదియెనిమదవ సర్గ

                                 రామాయణము 

                                బాలకాండ -ఏబదియెనిమదవ సర్గ 

త్రిశంకు వచనములు విన్న వశిష్టుని పుత్రులు మిక్కిలి కోపముతో ఆయన మాటను కాదని యజ్ఞము జరిపించి ఆయనను అవమానించలేము . అని స్పష్టముగా చెప్పెను . గురుపుత్రుల మాటలు విని త్రిశంకువు" మా కులగురువు అయిన వశిష్ఠుడు ,వారి పుత్రులు అయిన మీరు నా కోరికను తిరస్కరించిరి . మంచిది నేను మరియొక దారి చూసుకొనెదను ."అని పలికెను . 
గురు పుత్రులు త్రిశంకువు వశిష్ట మహర్షి మాటలు ఉల్లంగించుటయే కాక ,మరియొకటి వద్దకు వెళ్తాను అనే మాట కు మిక్కిలి కోపం చెంది చండాలుడవు అవుతావు అని శపించిరి . త్రిశంకువు తన పురమునకు వెళ్లి జరిగినది తలుచుకుంటూ ఉండెను . మరునాడు తెల్లవారి లేచేసరికి త్రిశంకువు నల్లటి రూపముతో ఛండాలత్వమును పొందెను . అతని దుస్తులు సైతము నల్లగా మారిపోయెను . జుట్టు కురచగా మారెను . అతనిని చూసిన మంత్రులు ,అధికారులు భయముతో పరిగిడిరి . జనులు సైతము గుర్తింపకుండిరి . దానితో వంటరి అయిన త్రిశంకువు రాత్రియంబవళ్ళు దుఃఖముతో కృంగిపోవుచు ,చివరికి వశిష్ఠుడి తో వైరభావము కల విశ్వామిత్రుని వద్దకు చేరెను . 
విశ్వామిత్రుడు అతడి రూపము భాద చూసి జాలిపడెను . అతడి ఈ రూపమునకు ,భాదకు కారణమును అడిగెను . 
దానికి త్రిశంకువు తన స్వర్గమునకు వెళ్ళవలననే కోరిక అది తిరస్కరింప బడిన విధము ఆ క్రమములో తాను శపింపబడుట సమస్తము తెలిపెను . మరియు ఇలా పలికెను . "స్వామి !నేను అనేక యజ్ఞములు యాగములు చేసాను ,అనేక దానములు చేసాను . ఎప్పుడు అసత్యము ఆడి ఎరుగను . ప్రజలను ధర్మము అనుసరించి పాలించితిని . అటువంటి నాకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది . అయినను నాకు స్వర్గమునకు శరీరముతో వెళ్లాలనే కోరిక పోలేదు . నా ఈ కోరిక తీర్చుటకు మీరే సమర్థులు . ఇక నేను ఇతరులను ఎవ్వరిని ఆశ్రయించను,మీరు తప్ప నన్ను ఆడుకొనగలవారు ఎవ్వరును లేరు . నాయెడ అనుగ్రహమును చూపి ,దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మేరె తగుదురు . 

రామాయణము బాలకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .