Wednesday 21 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదియైదవ సర్గ

                                       రామాయణము 

                                        బాలకాండ _డెబ్బదియైదవ సర్గ 

పరశురాముడు శ్రీ రాముడితో "ఓ దశరథ రామా !నీ బలపరాక్రమముల గురించి ,శివధనుర్భంగము గురించి విన్నాను . నేను ఒక విల్లుని తెచ్చాను ఈ విల్లు నాకు నా తండ్రి వద్దనుండి లభించింది . ఈ ధనువుని సంధించి నీ బలమును చాటుకో . అలా చాటుకొనినచో నీకు నాతొ ధ్వంధ్వ యుద్ధము చేసే అవకాశము ఇస్తాను . "అని పలికెను . 
పరశురాముడి మాటలు వినగానే దశరధుడికి ముఖంపై విషాదము అమలుకొనెను . పిమ్మట మిక్కిలి దైన్యముతో "ఓ బార్గవరామా !నీకు క్షత్రియులపై కల కోపము చల్లారినది కదా . నీవు బ్రాహ్మణోత్తముడవు . మిక్కిలి వాసిగాంచినవాడవు . పసిబాలురైన నా పుత్రులపై దయ చూపుము . ఓ మహర్షీ ఈ రాముడు లేనిచో మేమెవరమూ ప్రాణములతో ఉండము . "అని ప్రార్ధించుచున్ననూ పరశురాముడు పట్టించుకొనక శ్రీరాముడితో 
"ఓ రామా !నీవు విరచిన ధనస్సు ,నేను తెచ్చిన ధనస్సు ఇవి రెండు శ్రేష్టమైనవి ,దృఢమైనవి ,శక్తిమంతమైనవి ,ప్రముఖమైనవి అని ముల్లోకములలో ఖ్యాతివహించెను . విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించెను . ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారనిమిత్తమై పరమేశ్వరుడి దేవతలు వాటిలో ఒక ధనుస్సుని సమర్పించిరి . దానిని నీవు భంగమొనర్చావు . ఇక ఈ రెండవ ధనుస్సుని దేవతలు విష్ణువుకి అర్పించిరి . అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలాబలములను తెలుసుకోదలచి ,బ్రహ్మను చేరి 'హరిహరులలో బలశాలి ఎవరు 'అని ప్రశ్నించిరి . బ్రహ్మ వారిరువురికి విరోధము కల్పించెను . 

ఆకారణముగా వారిరువురు మధ్య హోరాహోరీగా యుద్ధము సంభవించెను . అప్పుడు విష్ణువు హుంకరించగా శివధనుస్సు నిస్తేజమయ్యెను . మహాదేవుడైన ముక్కంటి కూడా నిశ్చేష్టుడయ్యెను . అంతట దేవతలు అందరూ ఋషీశ్వరులతో ,చారుణులతో అక్కడకు చేరి ,వారిని ప్రార్ధించగా వారు శాంతించిరి . దేవతలు .ఋషీశ్వరులు అందరూ విష్ణువే అధిక బలవంతుడు అని తలచిరి .

 అందులకు శివుడు కృద్ధుడై తన ధనుస్సుని విదేహప్రభువులలో రాజర్షి అయిన దేవరాతునికి న్యాసముగా సమర్పించెను . విష్ణువు తన ధనుస్సుని భృగు వంశజుడైన ఋచీకునికి న్యాసముగా ఇచ్చెను . ఋచీకుడు నుండి ఆయన పుత్రుడైన జమదగ్నికి ఆ ధనుస్సు లభించెను . ఆయన వద్ద నుండి జమదగ్ని కుమారుడైన నాకు ఈ ధనుస్సు లభించెను . తపోబల సంపన్నుడైన మా తండ్రి జమదగ్ని అస్త్ర సన్యాసము చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖ బుద్దితో ఆయనను వధించెను . 
ఆ కార్తవీర్యార్జునుడు మిక్కిలి భయంకరముగా ,అతి క్రూరముగా మా తండ్రిని విధించినట్లు విని రోషముతో నేను ఇరువదిఒక్కమాఱులు పుట్టినవాడిని పుట్టినట్లుగా తుదముట్టించితిని . సమస్త భూమండలమును జయించి దానిని కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాను . తపోబలంతో మహేంద్రగిరి చేరాను . దేవతలు సంచరించునట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపస్సు చేసుకుంటున్నాను . నీవు శివధనస్సు విరిచినట్లు తెలిసి ఇక్కడకు వచ్చాను . ఈ మహిమగల విష్ణుధనస్సుని అందుకో నీకు బలము వున్నచో దీనిని ఎక్కుపెట్టి బాణము సందించుము . అప్పుడు నాతొ ధ్వంధ్వ యుద్ధమునకు నీకు అనుమతి యిస్తాను . "అని పలికెను . 

రామాయణము బాలకాండ డెబ్బదియైదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 
















No comments:

Post a Comment