Sunday 18 September 2016

రామాయణము బాలకాండ డబ్బదిరెండవ సర్గ

                                         రామాయణము  

                                             బాలకాండ డబ్బదిరెండవ సర్గ 

జనక మహారాజు ఈ విధముగా తన వంశ చరితను గురించి చెప్పగా విశ్వామిత్రుడు "ఓ రాజా !ఈ రెండు వంశముల మధ్య ఏర్పడు వివాహ సంబంధములు అన్ని విధములుగా పరస్పరము తగి వున్నవి . రూపలావణ్యవైభవములలో సీతారాములు ఊర్మిళాలక్ష్మణులు ఒకరికొకరు తగినవారు . ఓ నరేంద్రా నేనొక మాట చెప్పదలిచాను . ఓ రాజా !నీ తమ్ముడైన కుశధ్వజుడి కుమార్తెలు (మాండవి ,శ్రుతకీర్తి )నిరుపమానసౌందర్యవతులు . ఆ కన్యలిరువురికి ధీశాలురు అయిన భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుట మంచిదని అభిలషించుచున్నాను . "అని పలికెను . 
విశ్వామిత్రుడి మాటలు విన్న జనక మహారాజు వశిష్టుని అనుమతి తీసుకుని ,అంజలి ఘటించి "ఓ మునీశ్వరులారా !ఈ వివాహబంధము మీరు స్వయముగా ఆజ్ఞాపించివున్నారు . కావున 'విదేహ 'వంశము ధన్యమైనట్లు భావిస్తాను . సంతోషముగా ఈ వివాహములును జరిపిస్తాను . ఈ నాలుగు జంటలకు ఒకేసారి వివాహము జరిపించెదను . "అని పలికి దశరధునితో 
"ఓ మహారాజా గురువుల ఆజ్ఞ మేరకు నేను మీ కుమారులు నలుగురికి ,నా ఇద్దరు పుత్రికలు ,నా తమ్ముడి ఇద్దరు పుత్రికలను కన్యాదానము చేయదలిచాను . తమరు దయతో అంగీకరించి వివాహ నాంది కార్యక్రమములు మొదలుపెట్టుడు . ఈ రాజ్యమును మీరు పరిపాలించు అయోధ్యగానే భావింపుడు దీనిపై మీకు సర్వాధికారములు కలవు . సముచితముగా నన్ను ఆజ్ఞాపింపుడు "అని పలికెను . 
జనకుడి మాటలకు మిక్కిలి సంతుష్టుడైన దశరధుడు బాగు బాగు అని పలికి నాంది కార్యక్రమములు మొదలుపెడతాను అని చెప్పి విశ్వామిత్ర ,వశిష్టులతో కూడి తన విడిదికి వెళ్లి నాంది కార్యక్రమములు మొదలుపెట్టేను . మరునాడు ప్రాతః కాలమునే లేచి బంగారు కొమ్ములు గలవి ,సమృద్ధిగా పాలు ఇచ్చునవి ,దూడలు కలిగినవి అయిన గోవులను ఒకొక్క కుమారుడు పేరున ఒక లక్ష గోవుల చప్పున నాలుగు లక్షల గోవుల్ని ,పాలు పిదుకుకొనుటకు కంచుపాత్రలని ,బ్రాహ్మణోత్తములకు దానము ఇచ్చెను . ఇంకనూ పుష్కలముగా ధనమును ,అనేక ఇతర వస్తువులను పుత్రుల స్నాతక సమయములో బ్రాహ్మణులకు దశరధుడు దానము ఇచ్చెను . 

రామాయణము బాలకాండ డబ్బడి రెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment