Saturday 17 September 2016

రామాయణము బాలకాండ _డబ్బదిఒకటవసర్గ

                                            రామాయణము 

                                                      బాలకాండ _డబ్బదిఒకటవసర్గ 

ఈ విధముగా పలుకుచున్న వశిష్ఠమహర్షికి నమస్కరించి జనకుడు బాగు బాగు .  చరితను కూడా తెలిపెదను దయతో వినుడు అని ఇలా పలికెను . 
"మా వంశమునకు మూల పురుషుడు 'నిమి 'మహారాజు . అతని కుమారుడు మిధి . అతడే మిథిలా నగర నిర్మాత . ఆయన కుమారుడు ఉదావసుడు అతని సుతుడు నందివర్ధనుడు . అతని కొడుకు సుకేతుడు . సుకేతుడి కుమారుడు దేవరాతుడు . ఆయన కుమారుడు బృహద్రధుడు . అతని కొడుకు మహావీరుడు . అతని కుమారుడు సుదృతి . అతని సుతుడు ధృష్టకేతువు . అతని కొడుకు హర్యశ్వుడు . అతని కుమారుడు మరువు . ప్రతిందకుడు అతని  కుమారుడు .  ఆయన కుమారుడు కీర్తిరథమహారాజు . అతని కొడుకు దేవమీఢుడు . ఆయన కొడుకు విబుధుడు . అతని కొడుకు మహీధ్రకుడు . కీర్తిరాతుడు మహీధ్రకుడి కొడుకు . ఆయన పుత్రుడు మహారోముడు . ఆయన తనూజుఁడు స్వర్ణరోముడు . అతని పుత్రుడు హ్రస్వరోముడు . ఆయన కుమారులలో నేను పెద్దవాడను . నా తమ్ముడు కుశధ్వజుడు . నేను ఈ రాజ్యమునకు రాజునై పరిపాలించుచున్నాను .
మహావీరుడైన సుధన్వుడు అను రాజు సర్వ శ్రేష్టమైన శివధనస్సుని అందాలరాశి అయిన నా కుమార్తె సీతను తనకు ఇవ్వవలసిందిగా నాకు కబురు పెట్టెను . నేను అంగీకరింపనందున నా మీదకు యుద్ధమునకు వచ్చెను . ఆ యుద్ధమున నేను అతడిని గెలిచి ఆ సాంకాశ్య రాజ్యమునకు నా తమ్ముడిని రాజుని చేసాను . నేను మిక్కిలి సంతోషముతో సీతను ,రాముడికి ,ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహము చేసెదను . 
ఓ దశరథ మహారాజా !రామలక్ష్మణులచే స్నాతకము చేయించుము . వివాహమునకు సంభందించిన నాందీ విధులను నిర్వహింపుము . ఓ మహానుభావా !నేడు మఖ నక్షత్రము నేటి నుండి మూడవ దినమున ఉత్తర ఫల్గుణీ నక్షత్రము ఆరోజు వివాహము జరిపించెదము . "అని పలికెను . 

రామాయణము బాలకాండ డబ్బదిఒకటవ సర్గసమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






 















No comments:

Post a Comment