Thursday 22 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదియారవసర్గ

                              రామాయణము 


                                   బాలకాండ _డెబ్బదియారవసర్గ 

శ్రీరాముడు పరశురాముడి మాటలు విని "బ్రహ్మర్షివి అయిన ఓ పరశురామా !కార్తవీర్యార్జునిపై పగదీర్చుకొనుటకు అతడిని వధించి ,ఇరువదిమార్లు దండెత్తి క్షత్రియులను చంపినా విషయము నేను విన్నాను . ఒక వీరుడు చేయదగిన పనే చేసావు . అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను . ధనుస్సుని ఎక్కుపెట్టుట ,యుద్ధము చేయుట మున్నగు విషయములనందు నన్ను అశక్తునిగా భావించి ,అవమానించితివి . దీనిని నేను ఒప్పుకోను . ఇదుగో  పరాక్రమము చూడుము . "అని పలికి పరశురాముడి చేతిలో నుండి విష్ణు ధనుస్సుని తీసుకొని దానికి బాణమును సంధించి "ఓ పరశురామా !నీవు బ్రాహ్మణుడవు అయినందు వల్ల నాకు పూజ్యుడవు . కావున నేను ఎక్కుపెట్టిన ఈ బాణముతో నీ ప్రాణము తీయుటకు వెనకాడుచున్నాను . ఏ వైష్ణవ బాణము దివ్యమైనది . అట్టి ఈ బాణము వృధా కారాదు . దీనితో నీ గమన శక్తి (ఒక లోకము నుండి మరో లోకమునకు క్షణములో చేరగల శక్తి ),ని తొలగింపనా ,లేక నీ తపో బలముచే సాధించుకున్న పుణ్య రాశులను ధ్వంశము చేయమందువా త్వరగా తెలుపు "అని పలికెను . 
వైష్ణవ ధనుస్సుని ధరించిన శ్రీరాముని దర్శించుటకు బ్రహ్మాది దేవతలు ,ఋషీశ్వరులు గుంపులు గుంపులుగా విచ్చేసిరి . గంధర్వులు ,అప్సరసలు ,సిద్దులు ,చారణులు ,కిన్నెరలు ,యక్షులు ,రాక్షసులు ,నాగులు మొదలగు వారు శ్రీరాముని చూచుటకు అచటికి విచ్చేసిరి . విష్ణుధనస్సుని ధరించిన శ్రీరాముని తేజస్సుని మిక్కిలి ఆశ్చర్యముతో చూస్తూ" ఈ భూమండలమును ఇదివరకే కశ్యప మహర్షికి     దారపోశాను . నా గమన శక్తిని ధ్వంశము చేయవద్దు . నా పుణ్యరాశులను ధ్వంశము చేయుము . విష్ణు ధనుస్సుని ఎక్కుపెట్టుటచే విష్ణువే నీవని గ్రహించాను . "అని పలికి మహేంద్రగిరికి తపస్సు కొరకు వెళ్లెను . 
అనంతరము ధనుస్సుని ధరించివున్న శ్రీరాముని అచటకు విచ్చేసిన దేవతలు ఋషీశ్వరులు మున్నగు వారందరూ కొనియాడారు . 

రామాయణము బాలకాండ డెబ్బదియారవ సర్గ సమాప్తము . 



                 శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment