Tuesday 20 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదినాల్గవసర్గ

                               రామాయణము 



                               బాలకాండ _డెబ్బదినాల్గవసర్గ 

ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు ఉదయము అందరికి వీడ్కోలు పలికి విశ్వామిత్రుడు హిమాలయములకు తపస్సుకొరకై వెళ్లెను . దశరధుడు జనకుడి వీడ్కోలు పలికి అయోధ్యకు పరివారము ,నూతన వధూవరులతో పాటు బయలుదేరెను . జనక మహారాజు కొంత దూరము వారిని అనుసరించెను . జనకుడు తన నలుగురి కుమార్తెలకు అపరిమితముగా ధనమును ఇచ్చెను . లక్షలకొద్దీ గోవులను, మిక్కిలి విలువైన పట్టువస్త్రములను కానుకగా ఇచ్చెను . ఇంకను చక్కగా అలంకరింపబడిన బలిష్టమైన ఏనుగులను ,మేలుజాతి గుఱ్ఱములను ,వీరులైన యోధులను భక్తి విశ్వాసములు కల దాసదాసీ జనములను భరణముగా ఇచ్చెను . ఇంకనూ జనకుడు పుష్కలముగా వెండి ,బంగారములను ,ముత్యములను పగడములను వారికి కన్యాదానముగా సమర్పించెను . ఇంకనూ అసంఖ్యాకమైన సంపదలను వారికి బహూకరించి దశరధుడి అనుమతి తీసుకుని వెనుతిరిగి తన అంతః పురమునకు వెడలెను . 
ఆ విధముగా దశరధుడు ఋషులతోను ,కుమారులతోను ,పరివారముతోను వెళ్లుచుండగా అక్కడక్కడా పక్షులు భయంకరముగా శబ్దములను చేయుచుండెను . భూమిపై సంచరించు మృగములన్నీ ప్రదక్షిణ పూర్వకముగా తిరగసాగెను . దశరధుడు ఆ శకునములు గమనించి వశిష్టుని తో "ఓ మహర్షీ ఓ వైపు పక్షుల అరుపులు (అశుభ సూచకం )మృగముల ప్రదక్షిణ (శుభము )ఈ శకునములు చూస్తుంటే నాకు మనస్సు కలవరపెడుతుంది . దీని అంతరార్ధమేమిటి ?"అని ప్రశ్నించేను . అప్పుడు వశిష్ఠుడు 'ముందుగా అశుభ శకునములు ,తదుపరి శుభశకునములు కనపడుచున్నవి . కావున ఆపద కలిగినా అది తొలగిపోవును భయపడవలదు . "అని పలుకుచుండగా 
భూమిని కంపింప చేయుచు ,చెట్లను పడగొడుతూ ఒక పెద్ద సుడిగాలి వీచెను . సూర్యకాంతి చీకట్లు ఆవరించెను . జరుగు పరిణామములు చూసి దశరధుడు ఆయన నలుగురు పుత్రులు ,వశిష్ఠుడు తప్ప మిగిలిన వారంతా నిశ్చేష్టులై నిలబడిరి . ఆ తరుణములో జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యెను . అతడు జటామండలధారియై ప్రళయ కాల రుద్రనివలె భయంకరముగా ఉండెను . అతడు రాజా వంశములను పరిమార్చినవాడు . అతడు భాజామున గండ్ర గొడ్డలిని ధరించి మెరుపు తీగ వలె మిరుమిట్లు గొలుపు ధనుర్భాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుడి వలె తేజరిల్లుచుండెను . 
అతడిని చూసిన వశిష్ఠుడు మొదలగు మునులందరూ "యితడు పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జనుడు ఇతని తండ్రి అయిన'జమదగ్నిని 'చంపుటచే యితడు క్షత్రియులను హతమార్చి కోపము తొలగి శాంతించి వున్నాడు . మరల ఇప్పుడు క్షత్రియులను చంపుటకు రాలేదుకదా "అని తమలో తాము అనుకోసాగిరి . పిదప వారు పరశురాముడిని పూజించ అర్ఘ్య పాద్య ద్రవ్యములతో రామా రామా అని మధురముగా పలుకుచూ అతడిని సమీపించిరి . వారి పూజలు అందుకుని పరశురాముడు దశరధునితో ఇలా అనెను . 

రామాయణము బాలకాండ డెబ్బదినాల్గవసర్గ సమాప్తము . 

                శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                   














No comments:

Post a Comment