Monday 19 September 2016

రామాయణము బాలకాండ _డబ్బదిమూడవసర్గ

                                       రామాయణము 

                                      బాలకాండ _డబ్బదిమూడవసర్గ 

కేకేయ మహారాజు కుమారుడు భరతుడి మేనమామ అయిన యధాజిత్తు అయోధ్యకు వెళ్లగా అక్కడ వివాహ వార్త తెలిసి తన మేనల్లుడి వివాహము చూడవలననే ఉత్సుకతతో మిధిలకు వచ్చెను . అక్కడ దశరథ మహారాజు రామలక్ష్మణ శత్రుఘ్నులను తన మేనల్లుడు భరతుడిని చూసి మిక్కిలి సంతోషించెను . ఆ రాత్రి గడిచిన పిమ్మట తెల్లవారి ఉదయమే నిద్రలేచి దశరధుడు తన కుమారులు నలుగురికి దీక్షాధారణ చేసి వేచి ఉండెను అప్పుడు జనకుడు వశిష్టుని  అనుజ్ఞమేరకు కుమార్తెలను యజ్ఞవేదిక వద్దకు తీసుకువచ్చెను . 
అప్పుడు వశిష్ఠుడు ,విశ్వామిత్రుడు ,శతానందునితో కలసి విధ్యుక్తముగా వివాహవేదిక మధ్యలో వేదికను నిర్మించి దానిని సుగంధ సుమములతో అలంకరించెను . విధ్యుక్తముగా మంత్రములు పఠించిరి . యజ్ఞ గుండమునందు అగ్నిని ప్రజ్వరిమ్పచేసిరి . అప్పుడు జనకుడు సర్వాలంకార శోభిత అయిన సీతాదేవిని రాముడి ఎదురుగా కూర్చోబెట్టేను . అప్పుడు కౌశల్యానందనుడు అయిన రామునితో "ఓ రామా !సౌందర్యవతి ,సౌకుమార్యనిధి ,లావణ్యవతి ఐన ఈ కన్యకామణియే సీత . ఈమె అయోనిజ . మా వంశ ప్రతిష్టకు ప్రతీక ఈ సీత . ఈమె నేటి నుండి నీ సహధర్మచారిణి . ధర్మార్ధకామముల ఆచరణలో ,కష్టసుఖములలో సర్వదా ఈమె నీకు తోడుగా ఉంటుంది . సర్వ సౌభాగ్యవతి ఐన ఈమె పతివ్రత నిరంతరము నీడ వలె నిన్ను అనుసరించుచుండును . విధ్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము చేయుము . నీకు శుభము అగును . మిక్కిలి ప్రేమాదరములతో ఈమెను శ్వీకరింపుము . "అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచూ కన్యాదానము చేసెను . ఆ కన్యాదానోత్సవము నందు దేవతలు ,ఋషీశ్వరులు బాగుబాగు అని ప్రశంశా వచనములు పలికిరి . దేవదుందుభులు మ్రోగెను . అద్భుతముగా పూలవాన కురిసి చూసేవాళ్లకు కన్నులవిందుగా ఉండెను . 


పిమ్మట జనక మహారాజు లక్ష్మణుడికి ఊర్మిళను ,భరతుడికి మాండవిని ,శత్రుజ్ఞుడికి శ్రుతకీర్తిని మంత్రపూతమైన జలముతో కన్యాదానము చేసెను . పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములు అనుసరించి వివాహ కార్యక్రమములు కొనసాగించిరి . ఆ వివాహ సమయములో ఆకాశమునుండి పుష్ప వర్షము కురిసేను . దివ్యదుందుభులు మ్రోగెను . గంధర్వులు కమ్మగా గణములు చేసిరి . అప్సరసలు గుంపులుగా నాట్యము చేసిరి . ఆ విధముగా రఘువంశజుల వివాహములు అత్యద్భుతముగా జరిగెను . పిమ్మట వారంతా వారి వారి నవ వధువులతో కలసి తమ విడిది గృహములకు వెళ్లిరి . దశరధ మహారాజు కూడా నవ దంపతులను కళ్లారా చూసుకుంటూ సంతోషముతో మంత్రులు ,మునులు ,గురువులు వెంట రాగా విడిది గృహమునకు చేరెను . 

రామాయణము బాలకాండ డబ్బది మూడవ  సర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














0













No comments:

Post a Comment