Thursday 29 September 2016

రామాయణము అయోధ్యకాండ _ఆరవసర్గ

                                     రామాయణము 

                                   అయోధ్యకాండ _ఆరవసర్గ 


                వశిష్ట మహర్షి వెళ్లిన పిమ్మట శ్రీరాముడు స్నానాది కృత్యములను ముగించుకుని ,నిశ్చల మనస్కుడై ,విశాలాక్షి అగు ధర్మపత్ని  సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించెను . పిమ్మట హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చి ,అగ్నికి ప్రదక్షణ నమస్కారములు ఒనర్చి శాస్త్రప్రకారము హోమముచేసెను . మిగిలిన హవిస్సును తానూ సీతాదేవి శ్వీకరించెను . విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్త్రాణము పై వారు శయనించెను . 
శ్రీరాముడు వేకువజామునే మేల్కొని తన గృహమును పూర్తిగా అలంకరింపచేసెను . పిమ్మట అతడు సూర్యుని ఉపాసించి ,గాయత్రి మంత్రమును పాటించెను . సంద్యోపాసన అనంతరము శ్రీరాముడు పట్టువస్త్రములను ధరించి ,శ్రేమన్నారాయణుకి సాష్టాo గ  నమస్కారము చేసెను . పిమ్మట బ్రాహ్మణులు సీతారాములకు స్వస్తివాచనములు తో ఆశీర్వదించిరి . ఆ వేద ఆశీర్వచనముల ఘోష అయోధ్య అంతటా మారుమ్రోగేను . శ్రీరాముని పట్టాభిషేకము జరగబోవుతున్నదని జనులందరూ వేకువజామునే లేచి తమ గృహములను ,వీధులను ,శుభ్రపరచి  వాటిని చక్కగా అలంకరించిరి . అంత ఆ పురము ఏంటో శోభాయమానంగా ఉండెను . అన్ని ఎత్తు ప్రదేశములు మీదను (గృహములు ,వృక్షములు ,ప్రాకారములు ,దేవాలయములు )ధ్వజపతాకములు ఎగురుతూ ఉండెను . గాయకులూ పాటలు పాడుచూ ,నర్తకులు నాట్యము చేస్తూ అక్కడి వారినందరి మనసులు దోచుకొనుచు ఉండెను . శ్రీరామ పట్టాభిషేక  సమయము  సమీపించుచుండగా స్త్రీలు ఇళ్లలో ,పురుషులు బయట శ్రీరాముని గాధలను చెప్పుకొనుచూ మురిసిపోవుచుండిరి . బాలబాలికలు సైతము రామ గాధలు గుంపులు గుంపులుగా చేరి చెప్పుకొనుచుండిరి . 
జానపదులు సైతము శ్రీరామ పట్టాభిషేకమును దర్శించవలెననే కోరికతో అయోధ్యకు వచ్చి ,పురజనులు చెప్పుకొనుచున్న రాముని గాధలను ,గుణగణములను వినిరి . వివిధ దేశములనుండి ,అయోధ్య మారుమూలనుండి వచ్చిన జనములతో ఆ అయోధ్యా నగరము సాగరఘోషను తలపించుచు ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ ఆరవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 














               

No comments:

Post a Comment