Friday 16 September 2016

రామాయణము బాలకాండ _డబ్బదియవసర్గ

                                రామాయణము 


                                        బాలకాండ _డబ్బదియవసర్గ 

మఱునాడు ఉదయము ప్రాతః కాలమున జనకమహారాజు మహర్షుల పర్యవేక్షణలో యజ్ఞకర్మలను ముగించుకొనెను . పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందుడితో "ఓ మహర్షీ !నా తమ్ముడగు కుశధ్వజుడు మహా పరాక్రమశాలి ,పరమధార్మికుడిగా ఖ్యాతికెక్కాడు . ఇప్పుడతను ఇక్షుమతీ నాదీ తీరమునకల సాంకాశ్యనగరమున నివశించుచున్నాడు . అతడు సాంకాశ్య నగరము నుండే నా యజ్ఞమునకు కావలిసిన సామాగ్రిని పంపి ,యాగ నిర్వహణకు తోడ్పడెను . ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నాచెంత ఉండుట ఎంతో అవసరము . అతడు నాతొ కలసి ఈ పెండ్లి వేడుకలలో పాల్గొని ఎంతో ఆనందిస్తాడు . "అని చెప్పి ,కొందరు దూతలను "కుశధ్వజునికి వర్తమానము అందించి వెంట తీసుకు రమ్మని" ఆజ్ఞాపించెను .
ఆ దూతలు జనకుడి ఆజ్ఞప్రకారము వాయువేగముతో వెళ్లి ,జనకుడి సందేశము చెప్పిరి . వెంటనే కుశధ్వజుడు బయలుదేరి మిధిలకు వచ్చెను . మిక్కిలి బలశాలురు అయిన ఆ అన్నతమ్ములు మహా మంత్రి అయిన సుధాముని పిలిచి" దశరధుడికి వద్దకు వెళ్లి సవినయముగా ఆయనను ,ఆయనకుమారులను వెంట తీసుకురమ్ము "అని ఆజ్ఞాపించిరి . అప్పుడు సుదాముడు దశరధుని విడిది గృహమునకు వెళ్లి ఆయనకు శిరసా ప్రణమిల్లి ,ఆయనకు ,జనకుని ఆహ్వానమును తెలిపెను . పిమ్మట దశరధుడు కుమారులు ,పురోహితులు ,మంత్రులు తదితర పరివారముతో జనకుని సభకు వెళ్లెను . అప్పుడు వశిష్ఠుడు దశరుడి వంశ క్రమమును ఈ విధముగా చెప్పెను . 
"ఓ జనక మహారాజా !అవ్యక్తమైన పరభ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు పుట్టెను . ఆయన నుండి మరీచి పుట్టెను . మరీచి కొడుకు కాశ్యపుడు ,ఆయన కొడుకు సూర్యుడు . సూర్యుడి కొడుకు వైవశ్వత మనువు ఈ మనువే మొదటి ప్రజాపతి . మనువు పుత్రుడు ఇక్ష్వాకువు . మొదటి అయోధ్య ప్రభువు ఈ ఇక్ష్వాకుడే . కుక్షి ఇతడి పుత్రుడు . అతని కొడుకు వికుక్షి అతడి కొడుకు బాణుడు . భానుడి కొడుకు అనరణ్యుడు . అతడి కుమారుడు పృధువు .ఆయన కుమారుడు త్రిశంకువు . ఇతడి కొడుకు దుందుమారుడు . ఆయన కొడుకు యువనాశ్వుడు . ఆయన కుమారుడు మాంధాత . ఇతడి సుపుత్రుడు సుసంధి . ధ్రువసంధి ఇతడి పుత్రుడు . ఇతడి కొడుకు భరతుడు . అతడి కొడుకు ఆసితుడు . 
శూరులైన హైహయ ,తాళజంఘ ,శశిభిందు వంశములకు చెందిన రాజులు యుద్ధమున ఆసీటుని పరాజితుని చేసిరి . ఆసితుడు తన ఇరువురు భార్యలతో ,మంత్రులతో హిమవత్పర్వతమునకు చేరెను . కొంతకాలమునకు అతడు అక్కడే మరణించేను . అప్పటి అతడి ఇరువురు భార్యలు గర్భవతులు . ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భము నశింపచేయుటకు ఆమెకు(కాళిందికి ) విషాహారం ఇచ్చెను . ఆ సమయములో భృగు మహర్షి కుమారుడైన చ్యవనుడు అచటికి రాగా కాళింది ఆయనకు నమస్కారము చేసి తన గర్భస్థ శిశువుని కాపాడమని కోరెను . ఆయన ప్రభావము వలన విషము ఏమి చెయ్యలేదు . ఆమె పుత్రుడు సగరుడు . సగరుని కుమారుడు అసమంజుడు . ఆయన కుమారుడు అంశుమంతుడు ఆయన పుత్రుడు దిలీపుడు . ఆయన పుత్రుడు భగీరధుడు . భగీరధుడు కొడుకు కాకుత్సుడు అతని కుమారుడు రఘుమహారాజు . ఆయన కొడుకు ప్రవృద్ధుడు . ఆయన వశిష్టుని శాపము వలన నరమాంసకుడైన రాక్షసుడు అయ్యెను . అతని కుమారుడు శంఖణుడు . అతడి కొడుకు సుదర్శనుడు . ఆయన సుతుడు అగ్నివర్ణుడు . అతడి కొడుకు శీఘ్రగుడు . అతడి కొడుకు మరువు . అతడి కొడుకు ప్రశుశ్రుకుడు . ఆయన పుత్రుడు అంబరీషుడు . ఆయన కొడుకు నహుషమహారాజు . నహుషుడి కొడుకు అంబరీషుడు . అతడి కొడుకు నాభాగుడు . ఆయన కొడుకు అజుడు . యజుది పుత్రుడే దశరధుడు . రామలక్ష్మణులు ఇద్దరు ఆయన పుత్రులు . 
ఇక్ష్వాకు వంశము మొదటి నుండి అతి పవిత్రమైనది . ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమ ధార్మికులు ,వీరులు ,సత్యసంధులు . ఓ మహారాజా !ఆ వంశ సంజాతులైన రామలక్ష్మణులకు నీ కుమార్తెలగు సీతా ,ఊర్మిళను ఇచ్చి వివాహము జరిపించుట ఎంతో ఉచితమైనది . "అని పలికెను . 

రామాయణము బాలకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .     















1 comment: