Monday 26 September 2016

రామాయణము బాలకాండ _మూడవసర్గ

                               రామాయణము 

                             బాలకాండ _మూడవసర్గ 

ఆ సదాన్యులు అందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనలు ఆలకించి వారితో "ఆహా !నా భాగ్యము . ప్రియమైన నా జేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిక్కిలి ఆనందదాయకం "అని పలికెను . పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయుము . అని దశరధుడు చెప్పగా జయజయ ధ్వనులు మిన్నుముట్టెను . పిమ్మట దశరధుడు వశిష్టునితో "ఓ బ్రహ్మర్షీ !శ్రీరాముని పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించి ,సిద్ధపరచవలసిన సంభారముల గూర్చి మీరే ఆజ్ఞాపింపుడు . "అని పలికెను . 
బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు సుమంత్రుడు మొదలయిన ఉన్నతాధికారులతో "బంగారము, వెండి ,వివిధములగు రత్నములను ,పూజాద్రవ్యములను ,వడ్లు ,పెసలు ,మొదలగు ధాన్యములు తెల్లని పూలమాలలను ,పేలాలను ,వేర్వేరు పాత్రలలో తేనెలను ,నేతులను ,తెల్లని అంచు కలవియైన నూతనవస్త్రములను ,రథములను ,వివిధాయుధములను ,చతురంగబలములను ,శుభలక్షణములు కల భద్రగజములను ,వింజామరలు ,ధ్వజము ,స్వేతఛత్రము అగ్నిజ్వాలలు వలె తళతళ లాడుచున్న నూరు బంగారు కలశములను ,బంగారు కొమ్ములు కల వృషభమును ,పూర్తి వ్యాఘ్ర చర్మమును ,రాజు గారి అగ్ని కార్య గృహ సమీపమున రేపటి ప్రాతః కాలమునకు చేర్చుడు . ఇంకనూ అవసరమగు గంధపుష్పాది వస్తువులను అన్నింటిని అక్కడ సిద్దపరుచుడు . 
సమస్త రాజా గృహ ద్వారములను ,నగరమందలి సర్వ గృహముల వాకిళ్ళను ఘుమఘుమలాడు చందన గంధముల పూతలతో చక్కని పూలమాలలతో అలంకరింపుడు . వాటికి సువాసనలు వెదజల్లు ధూపములు వేయండి . వేలకొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డపెరుగుతో కూడిన దద్ద్యోదనములను ,చిక్కని పాలతో సిద్దమైన పాయసములను ,ప్రశస్తమైన ఆహారపదార్థములను సిద్ధమొనర్చమ్ది . రేపు ఉదయము సూర్యోదయము సమయమున స్వస్తి వచనములు జరగవలెను . కనుక బ్రాహ్మణులందరిని ఆహ్వానింపుడు . యోధులందరూ పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుముల యందు పెద్దపెద్ద ఖడ్గములను ధరించి ,రామాభిషేక సమయమున మహారాజు భవన ప్రాంగణమున నిల్చి ఉండవలెను . "అని ఆజ్ఞాపించెను . 
అంతట దశరథ మహారాజు శ్రీరాముని రమ్మని కబురుపంపెను . కబురు విని రాముడు దశరధుడి సభా భవనమునకు వచ్చి తండ్రికి నమస్కరించి నిలబడెను .

 దశరధుడు శ్రీరాముని సంతోషముతో తదేకంగా చూస్తూ ,"పుష్యమీ నక్షత్రమున పట్టాభిషిక్తుడవు కమ్ము "అని పలికెను . ఇంకనూ రాజనీతి ధర్మములను బోధించెను . శ్రీరామునికి ప్రియమిత్రులైనవారు పట్టాభిషేకవార్తను కౌసల్యా దేవికి ఆమె భావనమునకు వెళ్లి తెలిపిరి . వారికి కౌసల్యా దేవి విలువ గల ఆభరణములను బహుమతులుగా ఇచ్చెను . పిమ్మట రాముడు తన భవనమునకు వెళ్లెను . ఈ వార్తా విన్న ప్రజలు పరమానందభరితులై ఏ విఘ్నము కలుగకుండా పట్టాభిషేకము జరిగేలా చూడమని తమ ఇష్టదైవములను వేడుకొనిరి . 

రామాయణము అయోధ్యకాండ మూడవ సర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment