Tuesday 27 September 2016

రామాయణము అయోధ్యకాండ _నాల్గవసర్గ

                               రామాయణము 



                      అయోధ్యకాండ _నాల్గవసర్గ 

ఆ విధముగా శ్రీరామ పట్టాభిషేక వార్తను ప్రకటించి దశరధుడు తన అంతః పురమునకు వెళ్లి తన సారధి చేత శ్రీరాముడికి చూడాలనివుంది రమ్మని కబురుచేసాడు . దశరధుని రధసారధి అయిన సుమంత్రుడు రాముని అంతఃపురమునకు వెళ్లి తన ఆగమనం గూర్చి రాముడికి ద్వారపాలకులు ద్వారా కబురు చేసెను . సుమంత్రుడి పునరాగమనం గురించి తెలిసిన రాముడు "పట్టాభిషేకమునకు ఏదయినా విఘ్నము కలిగినదా ?లేదా వేరే ఏదయినా ఉపద్రవము సంభవించినదా ?"అని సందేహమునకు గురిఅయ్యెను . వెంటనే రాముడు సుమంత్రుడిని తన భవనంలోకి రప్పించి కారణము అడుగగా సుమంత్రుడు "మీ తండ్రి గారు మిమ్ములను చూడాలని కోరుకుంటున్నారు వెళ్లడం ,వెళ్ళకపోవడం మీ ఇష్టం "అని పలికెను . 
ఆ వార్తవిన్న వెంటనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపక మఱల తన తండ్రిని దర్శించుటకు వెళ్లెను . తన వద్దకు వచ్చి నమస్కరించిన శ్రీరాముని తో దశరధుడు "నాయనా !రామా !నాకు వయస్సు మీరినది . ధర్మబద్ధమైన సుఖములు అన్నిటిని అనుభవించితిని . మృష్టాన్నదానములతో ,భూరిదక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు కల యజ్ఞములను వందలకొలదిగా ఆచరించితిని . ఇష్ట సంతానప్రాప్తితో నా కలలు పండినవి . (చతుర్విద పురుషార్ధములు సిద్దించినవి . ). వందలకొలది యజ్ఞము లు ఆచరించుటచే దేవ -రుణమును ,వేదాధ్యయనముచే ఋషి -ఋణము ,సస్సంతాన ప్రాప్తిచే పితృ- ఋణము ,దాన ధర్మములచే విప్ర -ఋణము ,ధర్మసుఖానుభవముచే ఆత్మ -ఋణము (ఋణ -పంచకమును )ను తీర్చుకుంటిని . కనుక నీకు పట్టాభిషేకము చేయుట కన్నా నాకు మరియొక కర్తవ్యము ఏదిలేదు . 
నాయనా !సామంతరాజులు ,మంత్రులు ,ప్రజలు అందరూ నీవు రాజు కావలెనని అభిలషించుచున్నారు . కావున నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను . ఓ రామా !మరొక్కమాట ఈమధ్య కలలో నాకు భయంకరమైన అపశకునములు కనపడుచున్నవి . పిడుగులతో కూడిన ఉల్కలు (తోకచుక్కలు )మహాధ్వనులు గావించుచు పగటి పూటే నేలమీద రాలుతున్నవి . రామా !నా జన్మ నక్షత్రమున క్రూర గ్రహములు అయిన సూర్యుడు ,కుజుడు ,రాహువు చేరియున్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు . సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపాదపాలగుట యో జరుగును . నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున వున్నాడు . రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రమున వున్నప్పుడు పట్టాభిషేకము ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు . ఈ విషయమున నా మనస్సు తొందరపెట్టుచున్నది . కనుక నిన్ను రేపే యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయుదును . అందువలన ఇప్పటినుండే నియమములు పాటించుచు నీవును ,మా కోడలు సీతా దేవియు రాత్రివేళ ఉపవాస దీక్ష చేస్తూ దర్భాష్టరణములపైనా శయనింపవలెను . 
సామాన్యముగా ఇట్టి శుభకార్యములు కు పెక్కు విఘ్నములు ఎదురగుచుండును . కావున నీ మిత్రులందరూ అప్రమత్తులై ఇప్పటి నుండే నిన్ను కాపాడుదురు గాక . కైకేయ రాజ్యమున ఉన్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజుగా పట్టిభిషిక్తుడవగుట మేలని నాకు తోచుచున్నది . నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్నగారి అడుగుజాడలలోనే నడుచుకొనువాడు . ధర్మబుద్ధికలవాడు . దయాళువు ,ఇంద్రియ నిగ్రహము కలవాడు . అయినను శ్రీరామా !సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చంచలములు . ఒక్కొక్కప్పుడు ధర్మనిరతులైన సత్పురుషులు కూడా వేర్వేరు కారణములు వలన రాగద్వేషములచే ప్రభావితులగుచుండును . ఇది నా అభిప్రాయము "అని చెప్పెను . మరునాడు జరుగుచున్న పట్టాభిషేక విషయముల గూర్చి తెలిపి రాముని వెళ్ళుటకు ఆజ్ఞను ఇచ్చెను . శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనము చేరెను . 
పిమ్మట పట్టాభిషేక వార్త గురించి కౌశల్యా మాటకు తెలపదలచి తక్షణమే బయలుదేరి ఆమె అంతః పురమునకు వెళ్లెను . అచట కౌశల్యాదేవి పూజా మందిరమున ఇష్టదైవమును పూజిస్తూ ఉండెను . అచటికి సుమిత్రాదేవి ,లక్ష్మణుడు వచ్చిరి . సీతాదేవి దాసీ జనముతో అచటికి చేరెను . శ్రీరాముడు అచటికి చేరి తల్లి కౌశల్యా దేవికి  ప్రణమిల్లి తన పట్టాభిషేక వార్తను తెలిపెను . అంతట కౌశల్యా దేవి సంతోషముతో కూడిన అశ్రువులతో శ్రీ రాముని దీవించెను . పక్కనే వున్నా లక్ష్మణుడితో శ్రీరాముడు "లక్ష్మణా !నీవు నాబాహి ప్రాణము . కావున ఈ రాజ్యము నీకు చేరినట్లే ,రాజ్యమే కాదు నా ప్రాణములు కూడా నేవే . వీటినన్నింటిని నీ కొరకే కోరుచున్నాను . "అని పలికి తల్లులిద్దరికి ప్రణామము చేసి తన భావనమునకు చేరెను . 

రామాయణము అయోధ్యకాండ నాల్గవ సర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















No comments:

Post a Comment