Saturday 24 September 2016

రామాయణము అయోధ్యకాండ _మొదటిసర్గము

                            రామాయణము 

                         అయోధ్యకాండ _మొదటిసర్గము 

భరతుడు ,శత్రుఘ్నుడు మేనమామ ఇంట భందుమర్యాదలను ,ఆదరసత్కారములను పొందుతూ ,నచ్చిన ఆహారపదార్ధములు ,విహారములతో ఆటపాటలతో ఎంతో సంతోషముగా ఉండిరి అయినను  వారు తమ తండ్రిని ప్రదిదినము తలుచుకుంటూ ఉండిరి . అదేవిధముగా దశరధుడు కూడా తనకు దూరముగా వున్నా భారతశత్రుఘ్నులను మాటిమాటికి తలుచుకుంటూ బాధపడుతుండెను . తన పెద్దకుమారుడైన రాముడి గుణగణములను చూసి మిక్కిలి సంతోషించుచువుండెను . 
శ్రీరాముడు లోకోత్తరసుందరుడు ,మహావీరుడు ,ఇతరులలో సుగుణములనే గ్రహించువాడు . ప్రశాంతచిత్తుడు ,మృదుభాషి ,కోపమనే మాటనే ఎరుగనివాడు ,ఇతురులెవరయినా పరుషముగా మాట్లాడినా ఆ మాటలను పట్టించుకోకుండా వారితో కూడా మృదువుగా మాటలాడువాడు . శ్రీ రాముడు వీలయినప్పుడల్లా జ్ఞాన వృద్ధులతో (జ్ఞాన పరంగా గొప్పవారగు )విద్యాగోష్టి చేయుచువుండేవాడు . ఎవ్వరినయినాను తానే ముందుగా పలకరించేవాడు . ఎంతటి దుష్టులైనను తనను శరణు కోరించో వారిని క్షమించి కాపాడేవాడు . తానూ ఎంత పరాక్రమమంతుడు అయినను రవ్వంతయినను గర్వములేనివాడు . శ్రీరాముడు ఎట్టిపరిస్థితులలో అసత్యము పలికేవాడు కాదు . సకల విద్యా పారంగతుడు . ప్రజలను వాత్సల్యముతో సంతసింపచేయువాడు . ప్రజలకు ప్రాణతుల్యుడు . కలలో కూడా పరుల సొత్తును ఆశించనివాడు . 

శ్రీరాముడు ఇక్ష్వాకు వంశ ధర్మాలైన దయాదాక్షిణ్యములు ,శరణాగత రక్షణము ,ధర్మైకదృష్టి కలవాడు . దుష్టనిగ్రహము ,ప్రజాపరిపాలన క్షత్రియ ధర్మాలను పాటించువాడు . వేదవేదాంగములను ,శాస్త్రములను అధ్యయనము చేసాడు . ఋజువర్తనముచే దేవతలకు కూడా ఆరాధ్యుడు . శ్రీరాముడు మనోరంజకములైన సంగీత ,చిత్ర కళలయందు ,వీణావేణుమృదంగా తాళ విద్యలందు ఆరితేరినవాడు . ధనమును సద్వినియోగము చేయుట తెలిసినవాడు . ఏనుగులు ,గుఱ్ఱములు అధిరోహించుట వాటిని అదుపు చేయుట ,వాటికి శిక్షణ ఇవ్వటం తెలిసినవాడు . ధనుర్విద్యారహస్యములు తెలిసినవాడు . యుద్ధ సమయములో తానె ముందుగా నిలిచి శత్రువులతో యుద్ధము చేయుచు తన జనాలని కాపాడువాడు . శ్రీరాముడు సహజ సుందరుడు . ఇన్ని మంచి గుణములతో సకల జనులకే కాక మూగ ప్రాణులకు ,అట్లే దేవతలకు సైతము ఇష్టుడు . జనులందరూ శ్రీరాముడు తమకు ప్రభువు కావలెనని కోరుకొనుచుండిరి . 
ఈ విధముగా సాటిలేని శుభ లక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముని చూసి "నేను జీవించివుండగా ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంతబాగుండు ?అది నేను చూసి సంతోషింతును . "అని కోరిక కలిగెను . దశరధ మహారాజుఁ మంత్రులతో సమాలోచన చేసి శ్రీరాముని యువరాజుగా చేయుటకై నిశ్చయించెను . వెంటనే ఆ మహారాజుఁ వివిధ నగరముల ప్రజలను ,జానపదులను ,దేశమున గల ప్రముఖులను ,సామంత రాజులను వేర్వేరుగా రప్పించెను . వ్యవధి తక్కువుగా  ఉండుట చే భరతుడి మేనమామకు ,జనక మహారాజుకి కబురు పంపలేదు . ఆహ్వానము మేరకు అయోధ్యకు వచ్చిన వారందరికి దశరధుడు తగిన విడిది గృహములను ఏర్పాటుచేసెను . పిమ్మట దశరధుడు సిమహాసనము అధిష్టించగా సామంతులు ,మంత్రులు ,పుర జనులతో సభ నిండుగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ మొదటిసర్గము సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







                       

No comments:

Post a Comment