Friday 23 September 2016

రామాయణము బాలకాండ _డెబ్బదియేడవసర్గ

                            రామాయణము 

                          బాలకాండ _డెబ్బదియేడవసర్గ 

శ్రీరాముడు పరశురాముడు వెళ్లిన పిమ్మట ప్రసన్నచిత్తుడై ధనుర్భాణములను వరుణదేవుడికి ఇచ్చెను . పిదప చతురంగ బలములతో మంత్రులు ,మునులతో కూడి అందరూ అయోధ్యకు చేరెను . అయోధ్య అంతా రంగరంగ వైభవముగా అలంకరించబడెను . మునులు మొదలగు వారు ఎదురుగా వచ్చి తమ సంతోషమును ప్రకటించిరి . దశరధుడు తన పుత్రులు నూతన వధువులతో అంతః పురమున ప్రవేశించేను . సౌందర్యవంతులు అయిన కౌశల్య ,సుమిత్ర కైకేయి లు నూతన వధూవరులకు ఉపచారములు నెరపుటలో నిమగ్నమయ్యిరి . వారు నూతన వధూవరులను అంతః పురమున ప్రవేశపెట్టిరి . 
నూతన వధూవరులు పట్టువస్త్రములు ,ఆభరణములు ధరించి పూజాగృహములో ప్రవేశించి ఇలావేల్పులు గంధ పుష్పాదులతో పూజించిరి . పూజ ముగిసిన పిమ్మట నూతన వధువులు నలుగురూ పెద్దలందరికి పాదాభివందనములు చేసిరి . పిమ్మట వారు తమతమ మందిరములకు చేరిరి . పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ,ధనధాన్యములను దానము చేసిరి . అనంతరము ఆ నవవధువులు తమ భర్తలను చేరి ఆనందించిరి . 
మిక్కిలి ప్రతిభాశాలురు అయిన రామలక్ష్మణభరతశత్రుఘ్నులు తల్లితండ్రులకు సేవచేస్తూ బంధుమిత్రులతో ,సకల సంపదలతో తులతూగుతూ తమ గుణములచే గురువుల అభిమానమును పొందుచూ సంతోషముగా ఉండిరి .  కొంతకాలమునకు కైకేయ రాజు కుమారుడు యధాజిత్తు రాగా ఆయన వెంట భరతుడు కైకేయ రాజ్యమునకు తండ్రి అనుమతి తీసుకుని వెళ్లిరి . శత్రుఘ్నుడు కూడా అన్న భరతునితో పాటు కైకేయ రాజ్యమునకు తండ్రి అన్నగార్ల అనుమతి తీసుకుని వెళ్లెను . 
భారత శత్రుఘ్నులు కైకేయ రాజ్యమునకు వెళ్లగా రామలక్ష్మణులు తల్లితండ్రులకు సేవచేస్తూ ఉండిరి . ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును ,హితమును కూర్చు పనులు చేస్తూ సమస్త కార్యములను నెరవేర్చుచుండెను . వేదములు ,ధర్మశాస్త్రములలో పేర్కొనిన నియమములను పాటించుచు ,రామలక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులనొనర్చుచుండెను . మరియు పరాకు లేకుండా సందర్భానుసారంగా గురువులను శుశ్రూషాదికార్యములను నిర్వర్తించుచుండిరి .
 
శ్రీరాముడి యొక్క సౌశీల్యమునకు ,ఉదాత్తప్రవర్తనకు ,సద్గుణములకు దశరధుడు మురిసిపోవుచుండెను . అట్లే దేశవాసులందరూ పరమానంద భరితులగుచుండిరి . నిర్మలమనస్కుడైన శ్రీరాముని అంతః కరణమున సీతయే నెలకొనివుండెను . ఆమె హృదయము నందు శ్రీరాముడే నెలకొని ఉండెను . సీతారాములు ఒకరిహృదయములు ఒకరు ఎరిగిన వారగుటచే పరస్పరానురాగములతో మెలుగుచుండిరి . రూపమునందు దివ్య స్త్రీవలె ,సౌందర్యమును లక్ష్మీదేవివలె వున్న జనకుని కూతురు సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనేను . సీతా తో కూడి శ్రీరాముడు దేవాదిదేవుడైన విష్ణువు లక్ష్మీదేవితో వున్నట్లుగా సకల సౌభాగ్యములతో శోభిల్లుచు ఉండెను . 



రామాయణము బాలకాండ డెబ్బది ఏడవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .    











No comments:

Post a Comment