Sunday 25 September 2016

రామాయణము అయోధ్యకాండ -రెండవసర్గ సమాప్తము

                         రామాయణము 



                    అయోధ్యకాండ -రెండవసర్గ సమాప్తము 

ఆవిధముగా నున్న నిండు సభలో దశరథ మహారాజు అందరి ఎదుట తన నిర్ణయమును ప్రకటించెను . ఇంకనూ "శ్రీరాముడు సర్వ సమర్ధుడు మంత్రులతో ,గురువులతో ఆలోచించి ఈ నిర్ణయము  తీసుకున్నాను. ఇంకేదన్నా మంచి ఉపాయము మీకు తోచినచో చెప్పండి అదే చేద్దాము . "అని పలికెను . ఆ సభలోని వారందరూ ఆ మాటలు విని సంతోషముతో కేకలు వేసిరి . అందరూ కలసి రాజుగారి ప్రతిపాదనను బాగుగా చర్చించి ,ఆ ఆలోచన సమున్నతమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి . వారందరూ ఆ నిర్ణయము తమకు మిక్కిలి సంతోషము అని పలికిరి . 
అంతట దశరథ మహారాజు సధన్యుల మాటలు విని వారి మనసులలో పొంగిపొరలుచున్న సంతోషమును ఎరిగి మరల వారి అభిలాషను వారి నోటినుండే వినుటకై తెలియని వాడి వలే ఇలా పలికెను . "ఓ రాజులారా !నేను చెప్పిన మాటలు వినినంతనే మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచుంటిరి . నా పరిపాలనపై అసంతృప్తులై ఇలా కోరుకొనుచుంటిరా ,లేక శ్రీరాముని సద్గుణములు ప్రభావమునా నిజము చెప్పండి . నేను ధర్మబద్ధముగా పాలన సాగించుచున్నానుకదా "అనెను . 
రాజులు పౌరులు ,మునులు మున్నగువారందరూ ముక్తకంఠము న "ఓ నరేంద్రా !శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది . అతడు తన దివ్య గుణములచే ఇంద్రుడితో సమానుడు . షీలా వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించేవాడు . ధర్మార్ధ శాస్త్రములు బాగుగా ఎరిగినవాడు . అస్త్రశస్త్రవిద్యా ప్రావీణ్యము కలవాడు . జాలిదయ కలిగినవాడు . ఓ ప్రభూ !శ్రీరాముడు దేవతలతో సమానుడు . సర్వలోకములహితమునే కోరువాడు . ఔదార్యం గుణములతో అలరారువాడు . అట్టి నీ కుమారుడు మా పుణ్య వశమున నీకు పుత్రుడుగా జన్మించాడు . కావున అతనిని వెంటనే సంతోషముతో యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి మా కోరిక తీర్చుము . "అని పలికిరి . 

 రామాయణము అయోధ్యకాండ రెండవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 





No comments:

Post a Comment