Saturday 30 March 2019

రామాయణము సుందరకాండ -పదమూడవసర్గ

                                    రామాయణము 

                                 సుందరకాండ -పదమూడవసర్గ 

మహా పరాక్రమశాలి అయిన వాయుసుతుడు రావణ గృహములన్ని చుట్టి వచ్చి ,జానకి జాడ తెలియక తనలో తానూ ఇలా అనుకొనెను . "రావణుని భవనములు ఒక్కటి కూడా వదలక  వెతికితిని ,కానీ సీతాదేవి జాడ మాత్రము కనుగొనలేకపోయితిని . ఆ పరమ దుర్మార్గుడైన రావణుడు ఆ సాధ్విని అపహరించి తీసుకువచ్చునపుడు పెనుగులాటలో జారీ సముద్రములో పది చనిపోయినదేమో ? ఆ దుర్మార్గుడి నుండి తనను తాను రక్షించుకొనుటకై తానె సముద్రములో పది మరణించినదేమో ? నీచుడైన రావణునిచే భక్షించబడినదేమో ?ఆ కోమలాంగి అనేక విధములుగా రామా !లక్ష్మణా !అని విలపించుచు మరణించినదేమో ?
అయ్యో !ఇప్పుడు నేను వెళ్లి సీతాదేవి కనిపించలేదు అని చెప్పినచో ,ఆమెను ప్రాణతుల్యముగా భావించు శ్రీరామచంద్రుడు జీవించునా ?ఆయన మరణించినచో లక్ష్మణుడు మరణించును . అన్న గారి మీద అపారమైన ప్రేమ కల భరతుడు కూడా మరణించును ,తన అన్నలందరూ మరణించినచో శత్రుఘ్నుడు మాత్రము ఎలా బతకగలడు ? వీరందరి మరణ వార్త విన్నచో కౌసల్య ,సుమిత్ర ,కైకేయి మాటలు కూడా తప్పక మరణించెదరు . యావత్ అయోధ్యే శోకసంద్రమైపోతుంది . ఉత్తముడు శ్రీరాముని ప్రాణమిత్రుడుగా భావించు సుగ్రీవుడు సైతము బతకడు . అతని భార్య ఐన రుమ కూడా జీవించదు . తార ,అంగదు కూడా జీవించరు . సుగ్రీవుని హితులైన వానరులందరూ మరణించును . ఇందరి మరణమునకు కారణము అగుట కంటే అక్కడికి వెళ్లక నేనే మరణించుట మంచిది ? నేను వెళ్లకపోవుటచే వారు ఇంకా నేను వస్తా అని ఎదురుచూస్తూ జీవించివుందురు "అనుకొనెను . 

కాసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించి ,మరణించుట అంత నీచకార్యము మరొకటి లేదని భావించెను . సీతాదేవి కనిపించకపోతే తపో దీక్ష పూని తపము ఆచరించుట ఉత్తమమని భావించెను . పిదప "మరియొకసారి వెతికెదను . సీతాదేవి ఈ లంకలోని వున్నదని దివ్యదృష్టితో చూసిన సంపాతి చెప్పియున్నాడు కదా ,ఇప్పటివరకు జనుల నివాస స్థానములు వెతికితిని . ఇప్పటి వరకు వెతకని ఈ అశోకవనమును వెతుకుదును . ఇక్కడ సీతామాత దర్శనము నాకు లభించు గాక "అని తలచి ఒక్క నిముషము కింద కూర్చుని ధ్యానము చేసెను . పిదప ఇంద్రాది దేవతలకి సీతారామ, లక్ష్మణులకు ,సుగ్రీవునికి మనసులో  నమస్కారము చేసుకొనెను 

రామాయణము సుందరకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment