Friday 29 March 2019

రామాయణము సుందరకాండ -పదకొండవసర్గ

                                    రామాయణము 

                                         సుందరకాండ -పదకొండవసర్గ 

ఆ కపివరుడు అప్పటి వరకు చేసిన ఆలోచన తప్పని భావించసాగెను . రాముని ఎడబాటుకు గురియైన సీతాదేవి ఇలా నిద్రించుట సంభవమా ?అట్టి స్థితిలో ఆమెకు అన్నపానాదులమీద మనసే పోదు . ఆభరణములు విషయమే పట్టదు . పరపురుషుడు అంతటి వాడైనను ,కడకు సురాదిపతి అయినను ,అతనిని ఆ మహా సాధ్వి దరి చేరదు దేవతలలో సైతము ఎవ్వడూ రామునితో సమానుడైనవాడు లేడు . కనుక ఈమె సీతాదేవి కానేకాదు . అని నిశ్ఛయించుకొనెను . అలా నిశ్చయించుకున్న పిదప హనుమ ,మళ్లీ ఆ భవనమును అత్యంత నిశితముగా పరిశీలించసాగెను . ఆ పానశాలలో పెద్దపెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన రకరకముల మాంసాహార పదార్ధములు కలవు . వివిధ రకములైన పచ్చళ్ళను ,పానీయములను ,భోజ్యములను ,పులుపు ,ఉప్పు మొదలగు షడ్రసోపేతమైన తినుబండారములను ఆ హనుమ చూసేను . 
వివిధ పల రసములతో నిండి వున్న పాత్రలను ,చెల్లాచెదురుగా పడి  వున్న అమూల్య హారములను ,అందెలను ,కేయూరములను మారుతి చూసేను .  మణిమయములైన వెండి ,బంగారు పాత్రలతో మద్యము ను చూసేను . ఆ పాత్రలలో కొన్ని సగము త్రాగి వున్నవి ,కొన్ని పూర్తిగా త్రాగినవి ,మరికొన్ని అసలు ముట్టనివి . అటువంటి పాత్రలన్నిటిని హనుమ చూసేను . ఆ భవనంలో నిద్రించుచు వున్న స్త్రీలందరిని మారుతి మరొక సారి పరీక్షగా చూసేను . కానీ సీతాదేవి జాడమాత్రము తెలియరాలేదు . అప్పుడు ఆ వాయు సుతుడు ,"నిద్రించుచున్న పరస్త్రీలను చూసాను . నా డ్రామమునకులోపము జరిగినదేమో "అని సందేహపడెను . బ్రహ్మచర్య నిష్ఠ దెబ్బతినునేమో అని ఆలోచించెను . 
పిదప ఆయనే  తనలో తాను "నిద్రించుచున్న రావణుని స్త్రీలందరిని పరికించి చూసినది నిజమే ,అయినను నాకు ఎట్టి మనోవికారము కలుగలేదు . శుభాశుభ విషయములందు ,సమస్తమైన తీరుతెన్నులపై మనస్సే కారణము , కానీ నా మనస్సు ఎట్టి వికారమునకు లోనుకాకుండా మనసు నిశ్చలముగా ఉన్నది . వైదేహిని మరియొక చోట ఎక్కడ వెతికను ?స్త్రీలను ,స్త్రీల సమూహము మధ్యలోనే వెతకవలెను . ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెతకవలెను . తప్పిపోయిన ఒక స్త్రీని లేళ్ల మధ్య వెతుకుట వలన ప్రయోజనము లేదు . అందువలన నేను నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణ అంతః పురమును నిశితముగా పూర్తిగా గాలించితిని . కానీ జానకీ దేవి మాత్రము కన్పించలేదు  "అని అనుకొనెను . వీరుడైన హనుమంతుడికి దేవగంధర్వ నాగ కన్యలు కనపడిరి కానీ సీతాదేవి మాత్రము కన్పించలేదు . హనుమంతుడు ఆ భవనము నుండి బయటకు వచ్చి కృత నిశ్చయుడై ,మరల ఆ రావణ అంతః పురమున సీతాదేవి కొఱకు వెతకసాగెను . 

రామాయణము సుందరకాండ పదకొండవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ , ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment