Friday 29 March 2019

రామాయణము సుందరకాండ -పండ్రెడవసర్గ

                                         రామాయణము 

                                             సుందరకాండ -పండ్రెడవసర్గ 

సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి ఆ రావణుని భవనమంతా వెతికేను . కానీ సీతాదేవి మాత్రము కనిపించలేదు . ఆ మహాసాధ్వి కనిపించకపోవుట చే ఆ మారుతి "సీతాదేవి జీవించి వుండకపోయివుండొచ్చు . అందుకే ఎంతగా వెతికినా ఆమె కనిపించలేదు . దుష్టుడైన రాక్షసుడు ఆ తల్లిని వధించి వుండవచ్చు . లేదా పతివ్రతా శిరోమణియైన సీతాదేవి తనను తానూ రక్షించుకొనుటకు ఆమె మరణించివుండవచ్చు . సముద్రము లంఘించి వచ్చిన నా ప్రయత్నమూ అంతా వ్యర్ధమైనది . నేను తిరిగి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచున్న వానరులందరూ నా చుట్టూ చేరి ఏమందురో ?లంకకు వెళ్లి ఏమి చేసివచ్చితివి ?అని నన్ను అడుగుదురేమో సమయము మించిపోయినచో వారందరూ ప్రాయోపవేశము చేస్తారు . కావున నేను ఉత్సాహము తెచ్చుకుని మల్లి వెతకాలి " అని భావించెను . 
పిదప మారుతి భూగర్భగృహములను ,దేవాలయములు ,విహారార్ధము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టిపట్టి వెతికేను . ఎత్తైన ప్రదేశములు ఎక్కుతూ ,దిగుతూ ,నిలబడుతూ ,ముందుకు సాగుతూ ,తలుపులను తెరుచుచూ ,మూయుచూ ,లోనికి ప్రవేశించుచు ,బయటకు వచ్చుచు ,దిగుచు ఎక్కుచు అన్ని ప్రదేశములలందు సంచరించెను . రావణాంతః పురమున ఆ హనుమంతుడు వేటకని స్థలమే లేదు . అతడు ప్రతి అంగుళమూ గాలించెను . సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకు వెళ్లిన వానరుల ప్రయత్నములు తన సముద్రాలంగణము వృధా అయినదని మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను . 

రామాయణము సుందరకాండ పండ్రెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment