Tuesday 5 March 2019

రామాయణము కిష్కిందకాండ-అరువదిఆరవసర్గ

                                      రామాయణము 

                                       కిష్కిందకాండ-అరువదిఆరవసర్గ 

జాంబవంతుడు హనుమంతున్ని ప్రేరేపించుచు , "ఓ ఆంజనేయ నీవు వానరులందరిలోకల్లా సర్వ శ్రేష్ఠుడవు . సకల శాస్త్రములలోను ఆరితేరినవాడవు , పుంజికస్థల అనే అప్సరస  కపిశ్రేష్టుడైన కేసరికి భార్యగా జనించింది . ఆ ఉత్తమ దంపతులకు నీవు వాయు దేవుని వరమువల్ల జనించినావు . 

కేసరి బల పరాక్రమములు, అలాగే వాయు దేవుని యొక్క బల పరాక్రమములను , కలిగియున్నావు . నీవు చిన్ననాటి నుండే మహా వీరుడవు .

 నీ బాల్యములో ఒక నాడు నీవు సూర్యుని ఫలముగా భావించి దానిని ఆరగించుటకై సూర్యునివైపుగా ఎగరనారంభించావు . సూర్యుని దగ్గరదగ్గరకు  వెళ్లి నప్పటికీ కూడా సూర్య కిరణముల వేడి నీకు ఏమాత్రమును హాని కలిగించలేకపోయినది . 

సూర్య మండలం వైపుగా దూసుకు వస్తున్న నిన్ను చూసి ఇంద్రుడు కోపముతో తన వజ్రాయుధము ప్రయోగించెను . అపుడు నీవు భూమి మీద ఓ పర్వత శిఖరంపై పడిపోగా సుకుమారమైన నీ దవడలు  దెబ్బ తిన్నవి అప్పటి నుండి నీవు హనుమంతుడు అనే పేరుతొ ప్రసిద్ధికెక్కెను . 
అది చూసిన వాయుదేవుడు కోపముతో ముల్లోకాలు లోని గాలిని స్తంభింప జేసెను . అప్పుడు సకల దేవతలు వాయుదేవుని ప్రసన్నుడిని చేసుకొనిరి . అప్పుడు బ్రహ్మ దేవుడు ఏ  ఆయుధముచేత నీకు మరణము లేకుండా స్వచ్చంద మరణమును వరంగా ఇచ్చెను . నీవు తిరుగు లేని వీరుడవు . పరాక్రమమున నీకు నువ్వే సాటి . ఇది లోకకళ్యాణము కోసం చేయు కార్యము దీనికి నీవే సర్వ సమర్థుడవు .ఈ వానర వీరులందరి ప్రాణములు నీ చేతిలోనే ఉన్నవి . అని జాంబవంతుడు పలుకగా మారుతికి తన వేగము బల సామర్ధ్యములపై నమ్మకము కుదిరెను. వెంటనే హనుమంతుడు వానరులకు ఉత్సాహము పెంచుతూ తన అద్భుత రూపమును ప్రదర్శించెను . 

రామాయణము కిష్కిందకాండ అరువదిఆరవసర్గసమాప్తము . 

               శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















No comments:

Post a Comment