Sunday 10 March 2019

రామాయణము సుందరకాండ - మొదటిసర్గము

                                    రామాయణము 

                               సుందరకాండ - మొదటిసర్గము 

అనంతరము జాంబవంతుని ప్రేరణ తో అరివీర భయంకరమైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతయొక్క జాడను అన్వేషించుటకై , చారణాది దివ్య జాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను .
దుష్కరమైన సాటిలేని వాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషాబెంద్రునివలె ,  ప్రకాశించుచుండెను . 
ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము , ఎరుపు , పసుపు,ఆకుపచ్చ , తెలుపు , నలుపు మొదలగు చిత్ర విచిత్రమైన వర్ణముల కల దాతువులచే ,అలంకృతమై వున్నది . అక్కడ దేవతాసములైన యక్ష ,కిన్నెరా గంధర్వ ,నాగులు ఎప్పుడూ సంచరిస్తూ వుంటారు . అనేకమైన ఏనుగులతో వున్న ఆ మహేంద్రగిరి శిఖరంపై ఉన్న ఆ హనుమంతుడు జలాశయములో వున్న పెద్ద ఏనుగులా కనిపించాడు . 
ముందుగా మారుతి వాయుదేవునికి ,సూర్యదేవునికి ,బ్రహ్మ దేవునికి నమస్కారము చేసెను . పిదప ఆయన కొండను తన కాళ్లతో గట్టిగా అదిమి పైకి లంఘించుటకు సిద్దపడెను . 

 అలా ఆయన లంఘించునపుడు అది పెద్ద పర్వతమే అయినా కొన్ని క్షణములపాటు అది చలించెను . అలా చలించునపుడు ఆ పర్వతముపై కల గుహలలో వున్న జంతువులన్నీ భయముతో పెద్దగా అరుస్తూ ,పారిపోసాగెను . 
విద్యాధరులు మెదలగు దేవతాసములు కంగారుగా అక్కడి నుండి ఆకాశముపైకి ఎగిరిరి . అలా ఎగిరినప్పుడు వారి హారములు ,మిగిలిన ఆభరణములు అచటనే పడిపోయినవి . వారికి ఏమి జరుగుతోందో తెలియక ఆకాశముపై నిలబడి ఏమి జరుగుతోందో చూడసాగిరి . అక్కడే నిలబడి చూస్తున్న ఋషులు వారిలోవారు "ఈ మారుతి శ్రీరాముని కార్యమార్థమై అన్యులకు అసాధ్యమైన ఈ సముద్రమును లంఘించుచున్నాడు "అని అనుకోసాగిరి . ఆమాటలు విన్న విద్యాధరాదులు మారుతిని చూసిరి . 
అప్పుడు ఆ మారుతి ఊపిరి గట్టిగా పీల్చి ,చేతులు నడుముపై ఉంచి ,తోకను ఆకాశవీధిని పెంచి తననే చూస్తున్న వానరులతో "ఓ వానరవీరులారా !నేను ఇప్పుడే బయలుదేరి లంకకు వెళ్లి అక్కడ సీతా దేవి ఎక్కడున్నా వెతికి సీతాదేవిని తీసుకు వచ్చెదను ఒకవేళ అక్కడ ఆ సాద్వి కనిపించనిచో ఆ లంకని పెకలించి తెచ్చెదను . "అని పలికెను . అలా పలికి తీవ్ర బలముతో ఎగిరెను . 

అలా ఎగిరిన మారుతిని చూసి దేవతలు ,నాగులు ,యక్షులు ,కిన్నెరలు ,ఋషులు మొదలగు వారందరూ మారుతిని పొగడసాగిరి . అలా ఎగురుతున్న మారుతిని చూసి సముద్రుడు "నేను ఇంతటివాడను అగుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణము . కావున ఆ వంశ సంభూతుడైన శ్రీరాముని పనిపై వెళుతున్న మారుతికి కాసేపు విస్రాంతిని ఇవ్వవలెను "అని మనసులో తలుచుకుని ,తనలో దాగి వున్నా మైనాకుని పైకి పిలిచెను . 


అకస్మాత్తుగా ఎదురుగా నిలిచినా మైనాకుని చూసిన మారుతి అది అడ్డముగా తలచి దానిని తన వక్ష స్థలముతో త్రోసెను . అప్పుడా మైనాకుడు మారుతి వెంటే వెళ్లి మానవరూపము దాల్చి ఆ పర్వతము శిఖరంపై నిలబడి "ఓ మారుతీ !నీకు అలసట తెలియకుండా కాసేపు విశ్రమించుటకు నన్ను సముద్రుడు పంపాడు . నాకును నీవు ప్రీతికరమైనవాడవు ఎలా అంటే ,ఒకానొక సమయములో కులపర్వతముల రెక్కలు త్రెంచుటకు పూనుకొనెను . అప్పుడు మీ తండ్రి ఐన వాయుదేవుడు నన్ను ఈ సముద్రములో పడవేసెను . ఆ విధముగా నేను రక్షించబడ్డాను . ఆ కారణము చేత కూడా నేను నిన్ను కాసేపు నాపై విశ్రమించామని కోరుతున్నాను "అని పలికెను . 
అప్పుడు మారుతి అంత సమయము లేదు రామ కార్యమునకు ఆలస్యము అవుతున్నది చీకటి పడక మునుపే సముద్రము దాటవలెను . అన్యదా భావించవద్దు . నేను ఆతిధ్యము స్వీకరించినట్టే భావించుము . "అని పలికి మునుఁడుకు సాగెను . అలా ముందుకు వెళ్తున్న హనుమను చూసి దేవతలు హనుమ బలమును (ముఖ్యముగా బుద్ధి  బలమును )పరీక్షింపగోరి నాగమాట ఐన' సురస 'ను పిలిచి హనుమను అడ్డుకుని పరీక్షించామని పలికిరి . అప్పుడు ;సురస ;విస్తృతాకారము కల రాక్షసిలా మారి హనుమకు అడ్డుగా నిలిచి తన నోట్లోకి వచ్చి తనకు ఆహారము కమ్మని ,ఏ ప్రాణి అయినా తనను దాటి ముందుకు పోలేదని , అది తనకు బ్రహ్మ దేవుడి వరమని పలికెను . అప్పుడు మారుతి "ఓ మాతా !నేను రామకార్యార్థినై వెళుతున్నాను . కావున అడ్డు తొలగు నీకు కావాలంటే నేను సీతామాత జాడ తెలుసుకుని వచ్చి నీకు ఆహారమవుతాను అని పలికెను . 
కానీ  'సురస' ఒప్పుకొనక ఆహారము నోటిలోకి వచ్చితీరవలెనని పలికెను . ఆ మాటలు విన్న హనుమ తన శరీరమును మరింతగా పెంచెను . అప్పుడు 'సురస కూడా తన నోటిని మరింత వెడల్పు చేసెను . హనుమ మళ్ళీ శరీరము పెంచెను .  ఆమాత కూడా నోటిని వెడల్పు చేసెను . ఇలా కొంతసేపు గడిచినపిదప హనుమ చాలా చిన్నగా మారి ,నోటిలో ప్రవేశించి ,వెంటనే బయటకు వచ్చెను . 

అతడి బుద్ధిబలమునకు మెచ్చిన సురస అతడిని ఆశీర్వదించి పంపెను . అది చూసిన దేవతలు ఋషులు అందరూ హనుమను పొగిడిరి . 
పిమ్మట వేగముగా ముందుకు సాగిపోవుచున్న హనుమను చూసిన 'సింహిక 'అను రాక్షసి చాలా కాలము తర్వాత మంచి ఆహారము లభించిందని సంతోషించి తన బలముతో హనుమను లాగసాగెను . తాను అప్రయత్నముగా సముద్రమువైపు ఆకర్శించబడుట గమనించిన హనుమ అది సింహిక ప్రబావమని గమనించి తన శరీరమును పెంచెను సింహిక కూడా తన నోటిని పెంచెను . హనుమ ఎంతగా పెరిగితే సింహిక అంత పెద్దగా తన నోటిని తెరవసాగెను . అప్పుడు హనుమ చిన్నగా మారి దాని నోటిలోకి ప్రవేశించి తన వాడి గోళ్ళతో దానిని చీల్చి చంపి బయటకు వచ్చి మల్లి ఆకాశమువైపుగా పైకి ఎగిరి దక్షిణ దిక్కుగా ఎగరసాగెను . 

అది చూసి అక్కడే వున్నా సిద్దులు ,దేవతలు మంచి పని చేసావు అని హనుమని పొగిడిరి . 
అలా సముద్ర ము ను దాటిన హనుమ ఇంత పెద్ద ఆకారములో తనను రాక్షసులు చూసినచో తాను వేళ్ళు పనికి ఆటంకము కలగవచ్చునని భావించి ,తన ఆకారమును చిన్నగా చేసుకుని లంబాపర్వతముపై దిగెను . అలా దిగి మహాపర్వతము పై భాగమున వున్న  లంకను చూసేను . 

రామాయణము సుందరకాండ మొదటి సర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment