Thursday 30 December 2021

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ

                        రామాయణము 

                                   ఉత్తరకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ  

అగస్త్య మహర్షి పలికిన మాటలు విని శ్రీరాముడు "పూజ్యుడా !ఘోరమైన ఆ వనమున విదర్భరాజగు ఆ స్వేతుడు తపస్సు చేసిన ప్రదేశము నందు మృగములు ,పక్షులు లేకుండుట ఏమిటి ?ఆ రాజు తనతపఃశ్చర్యకు అట్టి నిర్జనారణ్యమున నందు ఎట్లు ప్రవేశించెను ?"అని అడుగగా 
అగస్త్య ముని రామునితో "రామా !పూర్వము కృతయుగము నందు 'మనువు 'అనే మహారాజు కలడు . అతడు రాజ్యమును న్యాయసమ్మతముగా పాలించువాడు . వర్ణాశ్రమ ధర్మములను కాపాడినవాడు . ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు . మనువు ఇక్ష్వాకుడిని రాజుగా చేసి "నాయనా !ధర్మమార్గమున ప్రజలను రక్షించుచు రాజ్యమును పాలించుము . నిరపరాధులను ఎవ్వరినీ దండించరాదు . అపరాధము చేసిన మానవులను దండించుట న్యాయసమ్మితము . అట్టి ధర్మప్రభువు మరణానంతరము స్వర్గసుఖములు పొందగలడు . "అని కుమారునికి ఉపదేశము చేసి ,అతడు మిక్కిలి సంతోషముతో యోగమార్గము ద్వారా శాశ్వత బ్రహ్మలోకమునకు  చేరెను . 
రాజైన ఇక్ష్వాకువు యజ్ఞములు ,దానములు ,తపస్సులు మొదలగు సత్కర్మలను ఆచరించి వందమంది కుమారులను పొందెను . వారు దేవకుమారులవలె మిక్కిలి తేజస్సంపన్నులు . ఆఖరువాడుమాత్రము మిక్కిలి మూర్ఖుడు . ఇక్ష్వాకువు 'మందబుద్ధియైన యితడు తన మూర్ఖత్వము కారణముగా మున్ముందు దండనార్హుడు అగును 'అని భావించి ,అతనికి 'దండుడు'అని పేరుపెట్టెను . 
ఇక్ష్వాకువు దండుడికి తగినట్లుగా ఒక ఘోరమైన ప్రదేశమును అప్పగించుటకై ఆలోచించి ,వింధ్యాద్రికి శైవలపర్వతమునకు మధ్యకల ప్రదేశమునకు అతనిని రాజుగా చేసెను . దండుడు అక్కడ ఒక ఉత్తమ నగరమును నిర్మించెను . ఆ నగరమునకు 'మధుమంతము ' అని పేరు పెట్టెను . దండుడు నిష్టాగరిష్ఠుడైన శుక్రాచార్యుని తన పురోహితునిగా చేసుకొనెను . అతని పాలనలో పురప్రజలు సుఖసంతోషములతో వర్దిల్లిరి . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                    శశి ,

                                                                       ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment