Tuesday 28 December 2021

రామాయణము ఉత్తరకాండ -డబ్బదియవసర్గ

                   రామాయణము 

                   ఉత్తరకాండ -డబ్బదియవసర్గ  

లవణాసురుడు హతుడైనపిమ్మట ఇంద్రాది దేవతలు అగ్నిదేవుడిని ముందు ఉంచుకుని ,శత్రుసంహార దక్షుడైన శత్రుఘ్నుడితో "నరశ్రేష్టా !ముల్లోకవాసులు చేసుకున్న పుణ్యవశాన నీవు లవణాసురుడిని సంహరించావు . మేము నీకు ఒక వరము ఇవ్వాలని ఇక్కడికి వచ్చాము . వరము కోరుకో "అని పలికిరి . 
వారి మాటలు విన్న శత్రుఘ్నుడు వారికి అంజలి ఘటించి ,"దేవతలారా  !ఈ మధుపురి దేవనిర్మితమైనది . మనోహరమైనది . దీనిని రాజధానిగా చేసుకొని నేను ఇక్కడ నివసించెదను . మీ ఆశీస్సులు నాకు లభించటమే నా పాలిటవరము "అని పలికెను . 
శత్రుఘ్నుడి మాటలు విన్న దేవతలు సంతోషించి "నీవు కోరినట్లే అగుగాక !రమణీయమైన ఈ మదుపురము మహాశూరులతో ,సేనతో సుసంపన్నమగును . ఇది నిశ్చయము . "అని పలికి తమతమ స్థానములకు వెళ్లిరి . శత్రుఘ్నుడు తన సేనను అక్కడికి రప్పించి మదుపురములోకి ప్రవేశించి ,ఆ పురమును పరిపాలించుతూ నివసింపసాగెను . 
శత్రుఘ్నుడి పాలనలో ప్రజలంతా నిర్భయముగా సుఖశాంతులతో హాయిగా ఉండిరి . ఆ ప్రాంతములోని పొలములన్నీ సస్యశ్యామలములయినవి . వర్షములు సకాలములో కురవసాగినవి . ప్రజలందరూ ఆరోగ్యభాగ్యములతో వర్ధిల్లుచుండిరి . ఇల్లు ,కూడళ్లు ,రాజవీధులు ,అంగళ్లు మనోహరముగా ఉండెను . అనేక దేశములనుండి వచ్చిన వర్తకులతో ఆ ఊరి వీధులు కిటకిటలాడుచుండెను . శత్రుఘ్నుడు మధురాపురములో 12 సంవత్సరములు నివసించిన పిమ్మట ఆయనకు శ్రీరాముడిని దర్శించవలెననే కోరిక కలిగినది . 

రామాయణము ఉత్తరకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                                                                      శశి ,

                                                                                      ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment