Tuesday 28 December 2021

రామాయణము , ఉత్తరకాండ ---- అరువది తొమ్మిదవసర్గ

                             రామాయణము 

            ఉత్తరకాండ ---- అరువది తొమ్మిదవసర్గ  

శత్రుఘ్నుడు లవణాసురునితో " నిశాచరా నీవు ఇదివరుకు అనేక మందిని   చంపి ఉండవచ్చు, కానీ ఈ శత్రుఘ్నుడు వారి వంటివాడు కాదు . నేడు నా బాణాగ్నికి గురై నీవు దగ్ధమై పోయి నేలపాలు  కాగా పౌరులు జానపదులు హాయిగా గాలిపీల్చుకొందురు " అని పలుకగా ఆ మాటలు విన్న లవణాసురుడు భగ్గున మండి  పడుతూ ఒక మహా వృక్షమును పెకలించి శత్రుఘ్నుడి పై విసిరెను . శత్రుఘ్నుడు తన బాణముతో దానిని ముక్కలు ముక్కలు చేసెను . పిమ్మట ఆ  రాక్షసుడు అనేక వృక్షములను ఒకదాని వెంట ఒకటి శత్రుఘ్నుడి పై ప్రయోగించెను . ఆ రఘువీరుడు ఏమాత్రం చలించక తన బాణములతో వాటిని అన్నింటిని ఖండించి వేసెను . పిమ్మట లవణాసురుడు ఒక మహావృక్షమును పెకలించి శత్రుఘ్నుడి శిరస్సుపై తీవ్రముగా కొట్టెను .  అతడు ఆ దాటికి మూర్ఛిల్లెను . 
అది చూసిన ఋషులు , దేవ గాంధర్వఅప్సరసలు బిగ్గరగా హాహాకారములు చేసిరి . మూర్ఛితుడై నేలమీద పడిపోయిన శత్రుఘ్నుడు మరణించినట్లుగా ఆ రాక్షుసుడు అపోహ చెందెను . అందుకనే తన శూళమును తెచ్చుకొనుటకు భవనమునకు వెళ్లక అక్కడే కూర్చొని ,తాను వేటాడి  తెచ్చిన ఆహారమును భక్షింప సాగేను . అప్పుడు శత్రుఘ్నుడు స్పృహలోకి వచ్చి ఎప్పటివలె ఆయుధాలు చేబూని నిలబడెను . పిమ్మట శ్రీరాముడు తనకిచ్చిన దివ్యశరమును ప్రయోగించుటకై బయటకు తీసెను . అది ఉత్తమోత్తమమైనది శత్రుభయంకరమైన దానికాంతులు అన్ని దిక్కులకు  వ్యాపించు చుండెను . అది రూపంలో ,శక్తిలో వజ్రాయుధము వంటిది . అది అన్నికణుపుల  యందు వంకరలు కలిగి భయంకరముగా  ఉన్నది . మేరుపర్వతం వలే ధృడమైనది యుద్ధంలో పరాజయం ఎరుగనిది దానీరెక్కలు మనోహరముగా ఉన్నవి.  ఆ బాణ ప్రభావముచే దేవతలతో సహా సమస్త ప్రాణులు మిక్కిలి భయాందోళనలకు లోనయ్యిరి . 
భయాందోళనకు గురైన దేవాసురులు , గంధర్వులు, మునులు ,అప్సరసలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి " పితామహా! లోకవినాశనం దాపరించిందా? ఇట్టి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరుగము.  సమస్త ప్రాణులు కలవర పడుచున్నారు " అని పలుకగా బ్రహ్మదేవుడు " నాయనలారా ! లవణాసురుడుని వధించుటకై శత్రుఘ్నుడు ఒక మహా శరమును చేబూనాడు దాని ప్రభావమే ఇది . అది శ్రీ మహా విష్ణువుకి సంభందించినది . ఆ శరప్రభావము శ్రీ మహా విష్ణువుకి మాత్రమే తెలియును . శ్రీరాముని తమ్ముని చేతిలో లవణాసురుడి సంహారము జరుగును.  ఆ దృశ్యమును మీరు కూడా తిలకింపుడు . " అని పలుకగా దేవతలు అచట నుండి బయలు దేరి యుద్దభూమికి చేరి ఆకాశమునందు నుండి ఆ శరముని చూసేను . ఆకాశములో ఉన్న దేవతలను చూసిన శత్రుఘ్నుడు బిగ్గరగా సింహనాదం చేసి ఆ శరమును ప్రయోగించగా, అది ఆరాక్షసుడి వక్షస్థలమును చీల్చి రసాతలము చేరి మళ్లీ  శత్రుఘ్నుడి తూణీరమునకు చేరెను . 
ఆ లవణాసురుడు మరణించిన వెంటనే పరమ శివుడి మహాశూలము ఆయన వద్దకే చేరెను . అది చూసిన దేవతలు ఋషులు నాగులు అప్సరసలు , అందరు శత్రుఘ్నుడిని పొగడ్తలతో ముంచెత్తిరి . 

రామాయణము ఉత్తరకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                            శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment