Thursday 23 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------ అరువదిఒకటవ సర్గ

                                 రామాయణము 

                               ఉత్తరకాండ ------ అరువదిఒకటవ సర్గ  

మహర్షులు ఆ విధముగా తెలుపగా శ్రీ రాముడు వారికీ అభయమిస్తూ , " విషయం తెలపండి ఇక మీకు ఏభయము ఉండదు . " అని పలుకగా ఋషులు " మహారాజ మేము ఉండే ప్రదేశమంతా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నవి . వాటికి గల కారణాలు తెలిపెదము విను , పూర్వము మధువు అనే ఒక మహాసురుడు ఉండెడి వాడు . అతడు మిక్కిలి బలశాలి , దైత్యవంశమునకు చెందినవాడు . లోలపుత్రులలో జ్యేష్ఠుడు . ఆ మధువు బ్రాహ్మణ భక్తి కలవాడు . తనను ఆశ్రయించిన వారికీ తోడ్పడుచుండేవాడు . మిక్కిలి ప్రజ్ఞాశాలి  , దేవతులకు మిత్రుడు . ఆయన శివుడి కోసం పెక్కువేల సంవత్సరాలు తపస్సు చేసెను . ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తన శూలమునుండి మరొక శూలమును సృష్టించి మధువుకి ఇస్తూ " రాక్షసా!  సాటిలేని నీ ధర్మ నిరతికి ముగ్దుడనయ్యాను . కనుకే ఈ ఆయుధమును నీకు అనుగ్రహించాను . నీవు దేవతల పట్ల బ్రాహ్మణుల పట్ల విరోధ భావమును వహించనంతవరుకు ఈ ఆయుధము నీవద్ద ఉండును . నీవు అన్యధా ప్రవర్తించినచో అది అదృశ్యమైపోవును . యుద్ధంలో నిన్ను ఎదిరించినవాడిని ఇది భస్మం చేసి తిరిగి నీచేతికి రాగలదు . " అని వరమిచ్చెను . 
ఆ మాటలు విన్న మధురాక్షసుడు పరమ సంతోషంతో శూలమును గ్రహించి ఆ మహాదేవుడికి ప్రణమిల్లి " సర్వలోక పూజ్యుడవైన దేవాధిదేవ అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశమునకు ఎల్లకాలం దక్కేలా అనుగ్రహించు . " అని పలికెను . ఆ మాటలు విన్న శంకరుడు " ఓయీ నీవు కోరినట్లు జరుగుట అసంభవం . నీ కుమారునికి ఒక్కనికి మాత్రమే ఈ శూలము పనిచేయును . ఈ శూలము ఎవ్వరి చేతిలో ఉంటె వారు సమస్త ప్రాణులకును జయింప శక్యం  కానివాడు . " అని పలికి అంతర్ధాన మొందెను . 
పిమ్మట ఆ మధు రాక్షసుడు ఒక మహభవనమును నిర్మింప చేసి అందు నివాసముండ సాగేను.   అతడి భార్యపేరు కుంభీనసి వారికుమారుడు లవణాసురుడు . అతడు మిక్కిలి భయంకరుడు . బాల్యమునుండి పాపకృత్యములను చేయుచుండెడివాడు . అతడిని చూసి మధురాక్షసునికి మనసు బాధతో నిండిపోయినది . కొంతకాలమునకు ఆ శూలమును తన కుమారునికి అప్పగించి పరమేశ్వరుడి వరం గురించి వివరించి తన రాజ్యమును వీడి సముద్రగర్భమును ప్రవేశించెను . స్వభావము చేతనే దుర్మార్గుడైన ఆ లవణాసురుడు ఆ శూల ప్రభావముచే ముల్లోకములను అందునా విశేషించి తాపసులును మిక్కిలి భాదింప సాగేను . భయంతో పెక్కుమంది ఋషులు అనేక రాజులను ఇంతకుముందు కాపాడమని వేడుకొనిరి కానీ ఎవ్వరు ముందుకురాకుంటిరి . నాయనా !రామా !రావణుడు నీచేతిలో సపరివారంగా హతుడైనట్లు మేము వింటిమి . ప్రస్తుతము నీవు తప్ప మమ్ములను రక్షించువాడు ఎవ్వరు లేరు . మా కోరికని మన్నించి ఆ లవణాసురుడి బారినుండి మమ్ము రక్షించు అని కోరిరి .   

రామాయణము ఉత్తరకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                                                                                         శశి ,

                                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

No comments:

Post a Comment