Tuesday 21 December 2021

రామాయణము , ఉత్తరకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                            రామాయణము 

                             ఉత్తరకాండ -ఏబదితొమ్మిదవసర్గ  

శుక్రాచార్యుడి  శాపవచనములు విన్నంతనే యయాతి తీవ్రమయిన ముసలి ధనమునకు లోనై ఎంతో క్రుంగి పోయెను . పిమ్మట అతడు తన కుమారుడవైన యదువుతో" నాయనా! నీవు ధర్మజ్ఞుడవు , మిక్కిలి యశస్వివి , నాకోసం నాయీ వార్ధక్యమును నీవు స్వీకరించుము  . " అని అడుగగా , యదువు " ఓ రాజా! నేనా ! నీ ముద్దుల కొడుకయిన పూరువే నీ వార్ధక్యాన్ని స్వీకరిస్తాడులే " అని పలుకగా యయాతి మహా రాజు పూరునితో " కుమారా! నీవు నా వార్ధక్యాన్ని స్వీకరింపుము " అని కోరగా అప్పుడు పూరుడు అంజలి ఘటించి యయాతి తో " తండ్రీ నీ అనుగ్రహమునకు పాత్రుడునైన నేను ధన్యుడను నీ ఆజ్ఞను తల దాల్చెదను . " అని పలికెను . ఆ మాటలు విన్న యయాతి అంతులేని సంతోషం తో పొంగి పోయి యోగబలంతో తన వార్ధక్యమును పూరువుకు సంక్రమింప చేసెను . 
అలా కుమారుని నుండి చక్కని యవ్వనమును పొందిన యయాతి వేల  యజ్ఞములు   ఆచరించెను . పెక్కువేల సంవత్సరముల కాలము రాజ్యము  పాలించెను . ఇలా చాలా గడిచిన  పిమ్మట ఆ రాజు తన కుమారుడైన పూరువుతో " నాయనా ! నీవద్ద న్యాసముగా ఉంచిన నా ముసలి తనమును మరల నాకు ఇచ్చివేయుము . నీవు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నేను ఎంతో సంతృప్తుడను అయితిని .   కనుక నేను మిక్కిలి సంతోషం తో ఈ రాజ్యమునకు నిన్నురాజును   చేసెదను . అని పలికి దేవయాని కుమారుడయిన యదువుతో " నీవు నా ఆజ్ఞను  తిరస్కరించితివి . కనుక నీకు గాని, నీ సంతానమునకు గాని రాజ్యాధి కారము లేకుండెను గాక . నేను నీకు తండ్రిని , గురుతుల్యుడను . నీవు నా మాటను కాదని నన్ను అవమానించావు . కావున నీకు భయంకరులు అయిన రాక్షసులు , పిశాచములు జన్మింతురు . నీవు చంద్ర వంశమున జన్మించినప్పటికీ నిన్ను ఈ వంశం నుండి  వెలివేయుచున్నాను . నీవు  దుష్ట బుద్ధివి అయినందున నీవలె నీ పుత్ర పౌత్రాదులు కూడా నీతిలేనివారు అగుదురు' అని శపించి ఆ మహా రాజు తన   కుమారుడు పూరువుకి యవ్వనం తిరిగి ఇచ్చి విధ్యుక్తముగా పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థాశ్రమమును శ్వీకరించెను . పిమ్మట చాలా కాలమునకు యయాతి మహారాజు స్వర్గమునకు ఏగెను . పూరుడు కాశీ రాజ్యమునందలి ప్రతిష్టాన పురం (పాట్నా)ను  రాజధానిగా  చేసుకొని మిక్కిలి ధర్మ బద్దంగా రాజ్య పాలన గావించెను . చంద్ర వంశం నుండి బహిష్కృతుడు అయిన యదువు క్రౌంచ వనమునందలి ఒక పురమున నివసించుచు వేల కొలది పుత్రులను పొందెను . 
యయాతి మహా రాజు క్షత్రియ ధర్మమును  అనుసరించి శుక్రాచార్యుని శాపమును అనుభవించెను . కానీ నిమి వశిష్ట మహాముని శాపమును సహించక ప్రతిశాపము ఇచ్చెను . " అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను . ఇంతలో సూర్యోదయము అయ్యెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                   శశి ,

                                                                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment