Tuesday 28 December 2021

రామాయణము, ఉత్తరకాండ ---- అరువది ఏడవసర్గ .

                            రామాయణము 

                ఉత్తరకాండ ---- అరువది ఏడవసర్గ .  

శత్రుఘ్నుడు యమునానదీ తీరంలో కొంతకాలము విశ్రాంతిగా  గడిపెను . ఒకరోజు శత్రుఘ్నుడు లవణాసురుడి బలము తెలుసుకొనగోరి భృగువంశజుడు అయిన చ్యవనమహర్షితో " బ్రాహ్మణోత్తమా! లవణాసురుడి శూళముయొక్క బలం ఎట్టిది? . ఆ లవణాసురుడు ఇంతకుముందు ఎవరితో యుద్ధంచేసాడు? . అతని చేతులో మరణించిన వారు ఎవరు? " అని పలుకగా చ్యవన మహర్షి " రఘునందనా యుద్ధరంగంలో ఈ శూళముదాటికి అనేక మంది మృతులయ్యిరి పూర్వము ఇక్ష్వాకు వంశపు రాజైన మాంధాత అయోధ్యను పరిపాలించుచుండెను . అతడు మిక్కిలి బలపరాక్రమాలు కలవాడు . ముల్లోకాలలో ఖ్యాతికి ఎక్కినవాడు . భూమండలంలో చాలాభాగము అతని అధికారంలో కలదు . ఇట్లుండగా ఆరాజు దేవలోకమును జయించుటకు పూనుకొనెను . విషయము తెలిసిన  ఇంద్రుడు భయాందోళనకు గురిఅయ్యెను . మాంధాత యుద్దమునకై స్వర్గమునకు వచ్చెను . అప్పుడు ఇంద్రుడు అతనితో" ఓ మహాపురుషా !నీవు మనుష్యలోకమునకు పూర్తిగా రాజువి కాలేదు.  నీవు సమస్త భూతలమును నీ వశంలోకి తెచ్చుకొనిన  పిమ్మట, నీ బలాలతో వాహనాలతో కలిసివచ్చి, స్వర్గమును పరిపాలింపుము " అని పలికెను . 
అప్పుడు మాంధాత " సురపతీ ! భూలోకంలో నా శాసనం చెల్లనిది ఎక్కడ ? " అని ప్రశ్నించెను . అప్పుడు ఇంద్రుడు" పుణ్యాత్ముడా  మదుపుత్రుడైన లవణాసురుడు మధువనమునకు ప్రభువుగా ఉన్నాడు . నీ శాసనం అతడు పాటించడు " అని పలికెను . ఆ మాటలు విన్న మాంధాత సిగ్గుతో తలవంచుకొని మరేమి మాట్లాడక స్వర్గమును వదిలి లవణాసురుడుని జయించుటకై బలములతో మధువనంలో ప్రవేశించెను . పిమ్మట అతడు యుద్ధం చేయగోరి లవణుడి  వద్దకు తన దూతను పంపెను . దూత మాటలు విన్న లవణుడు కోపంతో ఆ దూతను భక్షించి వేసెను . ఎంత సమయం గడిచినా దూత తిరిగి రాకపోవడంతో మాంధాత మిక్కిలి కోపంతో అన్ని వైపుల నుండి శరవర్షం కురిపించెను . అప్పుడా లవణాసురుడు వికృతంగా నవ్వుతూ  తన శూళమును చేతబూని పరివారంతో సహా యుద్ధమునకు దిగెను . 
పిమ్మట ఆ లవణాసురుడు ఆ శూళమును ప్రయోగించగా అది మిరుమిట్లు గొలుపుతూ ఆ మహారాజుని అతని పరివారంతో సహా భస్మం చేసి తిరిగి లవణాసురుడిని చేరెను . శతృఘ్నా! ఆ శూలప్రభావము సాటిలేనిది  . రఘువంశజా! నీవు రేపు ప్రాతఃకాలమునే ఆలవణాసురుడు శూళమును చేబూనకముందే అతడిని వధింప గలవు . ఇది నిశ్చయము . నీవు లవణాసురుడుని వధించుటతో సకల లోకములకు శుభములు చేకూరును . 

రామాయణము ఉత్తరకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                                                                                                   శశి ,

                                                                                            ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment