Thursday 30 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదియవసర్గ

                         రామాయణము 

                          ఉత్తరకాండ -ఎనుబదియవసర్గ  

అగస్త్యుడు శ్రీరామునితో ఇంకా ఇలా చెప్పసాగెను . "రామా !అనంతరము దండుడు రాజ్యమునకు శత్రుబాధ లేకుండా పెక్కువేల సంవత్సరములు ప్రజలను పరిపాలించెను . ఒకరోజు ఆ దండ మహారాజు శుక్రాచార్యుని ఆశ్రమమునకు వెళ్లెను . అక్కడ అటుఇటు సంచరించుచున్న మిక్కిలి సౌందర్యవతి అయిన శుక్రాచార్యుని కుమార్తెను చూసి మోహించాడు . దండుడు ఆమెతో "శుభంగీ !నీవు ఎక్కడనుండి వచ్చితివి ?"అని ప్రశ్నించగా 
శుక్రాచార్యుని కుమార్తె ఆ రాజుతో"రాజా !నేను శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను . నా పేరు అరజ . నేను ఈ ఆశ్రమములోనే నివసించుచున్నాను . మీరు నన్ను వివాహము చేసుకోనదలిచితే మా తండ్రిని ఆశ్రయించండి . అన్యధా ప్రవర్తించినచో నీవు మిక్కిలి అనర్ధములపాలగుదువు . మా తండ్రి కోపించినచో ముల్లోకములనూ దహించివేయగలడు . "అని పలుకగా 
దండుడు ఆమె మాటలు ఏమాత్రము లక్ష్య పెట్టక ఆమెను బలాత్కారముగా తన బాహువులతో బంధించెను . పిమ్మట దండుడు తన నగరమునకు వెళ్లిపోయెను . పిమ్మట ఆ అరజ భయపడుతూ ,ఆ ఆశ్రమ సమీపమునందే ఏడ్చుచు తన తండ్రి కోసము నిరీక్షించసాగెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదియవసర్గ సమాప్తము .  

                                                                            శశి ,

                                                                                       ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment