Tuesday 28 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------ ఆరువది ఎనిమిదవసర్గ

                            రామాయణము 

                       ఉత్తరకాండ ------ ఆరువది ఎనిమిదవసర్గ  

మరునాడు ప్రాతఃకాలము లవణాసురుడు మాంసాహార సంపాదనకు నగరం నుండి బయలుదేరెను . ఇంతలో మహావీరుడగు శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనుర్భాణములను ధరించి మధురాపుర ధ్వారమునందు నిలిచి ఉండెను . ఆ రాక్షసుడు మధ్యాహ్న వేలకు అనేక మృగములను వేటాడి వాటిని తీసుకొని వస్తూ శత్రుఘ్నుడిని చూసి " నరాధమా ! ఈ ధనుర్భాణాలతో నన్నేమి చేయగలవు ? నీలాగే అనేక వేలమంది ఆయుధాలతో నాపై రాగా వారందరిని నేను సునాయాసంగా భక్షించి వేసితిని . ఈ రోజు నాకు కావాల్సిన ఆహారము సంపూర్ణముగా లభించలేదు.  నాకు ఆహారమవ్వటానికి నీవు స్వయంగా వచ్చినావు . " అని పలుకుతూ పదేపదే వికటాట్టహాసము చేయుచున్న రాక్షసుడిని చూసి శత్రుఘ్నుడు " దుర్మతీ ! నేను నీతో ద్వంద్వ యుద్ధం చేయగోరుతున్నాను . నేను దశరధ మహారాజు కుమారుడును . శ్రీ రాముడి సోదరుడని . నా పేరు శత్రుఘ్నుడు.  నిన్ను వధించుటకై ఇక్కడికి వచ్చితిని నీవు సకల ప్రాణులకు శత్రుడవు . నాకంట  పడిన పిమ్మట ఇక ప్రాణములతో తిరిగి పోలేవు . " అని పలికెను . 
ఆ మాటలు విన్న రాక్షసుడు అవహేళనగా నవ్వుతూ " దుర్మతీ! నా అదృష్టం కొద్దీ నీవు నేడు నాచేతికి చిక్కావు . రాక్షస రాజైన రావణుడు నాపినతల్లి ఐన సూర్పనఖకు సోదరుడు స్త్రీకారణంగా అతడు రాముడి చేతిలో హతుడయ్యెను . నీ అన్న అతడినే కాక అతని వంశమును కూడా రూపుమాపేను . ఇప్పుడు నేను నీ అంతం ద్వారా అన్నిటికి సమాధానము చెప్పెదను . క్షణకాలం ఆగుము నా ఆయుధమును తీసుకు వచ్చి ఇప్పుడే నాతో యుద్ధముచేయవలననే నీ కోరికను తీర్చెదను . " అని పలికెను . అప్పుడు శత్రుఘ్నుడు " ఓయీ నాచేతికి చిక్కిన నీవు తిరిగి ప్రాణాలతో ఎక్కడికి పోగలవు? నా బాణాలతో నిన్ను యమపురికి పంపెదను . నీ ఆత్మీయులందరిని ఒక్కసారి స్మరించుకో " అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                                                                    శశి ,

                                                                                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment