Tuesday 28 December 2021

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదియొకటవసర్గ

                      రామాయణము 

                    ఉత్తరకాండ -డెబ్బదియొకటవసర్గ  

12 సంవత్సరములు గడిచినపిమ్మట శత్రుఘ్నుడు స్వల్ప సంఖ్యలో భృత్యులను ,బలములను తీసుకుని అయోధ్యాపురికి పయనమయ్యెను . శత్రుఘ్నుడు దారిలో ఏడెనిమిది చోట్ల విడిది చేసి వాల్మీకి ఆశ్రమమునకు చేరెను .వాల్మీకి మహర్షి ని దర్శించి పాదాభివందనం చేసి ,మునులు చేసిన అతిధి మర్యాదలు స్వీకరించెను. పిమ్మట వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడితో "పురుషశ్రేష్టా !పాపాత్ముడైన ఆ రాక్షసుడిని నీవు అవలీలగా వధించావు . అతని మృతితో ఈ లోకముల భయము తొలగిపోయి ప్రశాంతి ఏర్పడెను . నీవు ఆ రక్కసుడితో యుద్ధము చేయుచున్న సమయములో ఇంద్రసభలో ఆసీనుడనయి చూసితిని . నీ పరాక్రమము అమోఘము "అని పలికెను .   ఆ రోజు అక్కడే విశ్రమించెను . 
శత్రుఘ్నుడు అతిధి మర్యాదలు స్వీకరిస్తున్న సమయములోనే ,మరొక కుటీరము నుండి కుశలవులు మధురముగా గానము చేయుచున్న రామగానమును వినెను . ఆ గాథ తన కనుల ముందే జరుగుతున్నట్లుగా అనిపించసాగెను . శత్రుఘ్నుడి వెంట వచ్చిన సైనికులు పరస్పరము ఇలా మాట్లాడుకొనుచుండిరి . "ఇదియేమి ?మనము ఇప్పుడు ఎక్కడఉన్నాము ?ఇది కలకాదు కదా !ఈ పవిత్ర వృత్తాంతము మనకు తెలిసినదే . ఈ గాథ ఈ ఆశ్రమములో మరల యధాతధముగా వింటున్నాము . "అని అనుకుని శత్రుఘ్నుడితో "నరశ్రేష్టా !ఇది ఏమి వింత ?దీనిని గురించి వాల్మీకి మహర్షిని అడిగి తెలుసుకొనండి . "అని పలుకగా ,శత్రుఘ్నుడు "మిత్రులారా !ఈ ముని ఆశ్రమములో ఇలాంటి ఆశ్చర్యములు అనేకము జరుగుతుంటాయి . మనము ఆ విధముగా అడుగుట సముచితము కాదు "అని పలికెను .

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియొకటవసర్గ సమాప్తము . 

                                                             శశి ,

                                        ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

 



No comments:

Post a Comment