Wednesday 22 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------- అధికపాఠం

                              రామాయణము 

                                ఉత్తరకాండ ------- అధికపాఠం 

ప్రాతఃకాలము అయ్యిన పిమ్మట విద్యుక్తములైన సంధ్యోపాసనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని శ్రీ రాముడు పిమ్మట ధర్మసభలో ఆసీనుడయ్యెను . ఆ సభలో పురోహితుడైన వశిష్ఠుడు ,కశ్యపమహర్షి ,బ్రాహ్మణోత్తములు ,వైశ్యప్రముఖులు  ఆసీనులై ఉండగా ఆ ప్రభువు ధర్మ విచారణ చేయుచుండెను . ఆ సభ దేవా సభ వలె విరాజిల్లుతున్నది . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో "సౌమిత్రీ !నీవు ముఖద్వారం వద్దకు వెళ్లి ,కార్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే ఇక్కడికి తీసుకు రమ్ము ". అని పలుకగా ,లక్ష్మణుడు వెంటనే ముఖద్వారం వద్దకు వెళ్లి తిరిగి వచ్చి శ్రీరాముడితో "అక్కడ ఎవరూ లేరు "అని చెప్పెను . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో "నాయనా !నీవు ముఖద్వారం వద్దకు మళ్ళీ వెళ్లి ఎవరైనా కార్యార్థులు ఉంటే చూసి తీసుకురమ్మని చెప్పగా "లక్ష్మణుడు తన అన్న శ్రీరాముని ఆజ్ఞను పాటించి తిరిగి ముఖద్వారమునకు వెళ్లి చూడగా ,అక్కడ ఒక కుక్క కనిపించింది . బాధతో పదేపదే మొరుగుతున్న కుక్కని చూసి లక్ష్మణుడు "నీకు ఏమి కావాలి ?"అని కుక్కను అడుగగా ,
ఆ కుక్క లక్ష్మణునితో "ఓ మహానుభావా !సమస్త ప్రాణులకు ఆశ్రయమైన వాడైన శ్రీరాముడితో స్వయముగా  నా బాధను విన్నవించుకోవాలని అనుకుంటున్నాను . "అని పలుకగా లక్ష్మణుడు ఆ కుక్కను సభా భవనమునకు ఆహ్వానించగా ,అప్పుడు కుక్క " ప్రభూ !దేవమందిరము అందు ,రాజభవనము నందు ,బ్రాహ్మణుని గృహము నందు ,అగ్ని ,ఇంద్రుడు ,సూర్యుడు ,వాయువు మొదలగు దేవతలు ఉందురు . కావున శ్రీరాముని ఆజ్ఞ లేనిదే ,అధమ జాతికి చెందిన కుక్కనైన నేను రాజా భవనము లోకి ప్రవేశించలేను . ఈ విషయములన్నీ శ్రీరామచంద్రప్రభువుకి తెలియచేయుము . "అని కుక్క పలుకగా 
లక్ష్మణుడు సభలోకి ప్రవేశించి శ్రీరామునికి శునక విషయము చెప్పి ,ఆయన అనుమతితో శునకమును రాజమందిరమున ప్రవేశపెట్టెను . శునకమును చూసిన శ్రీరాముడు "ఓ శునకమా !నీవు నిర్భయముగా నీ విషయములు వివరించు "అని పలుకగా ,తలమీద పెద్ద దెబ్బతో ఉన్న ఆ శునకము శ్రీరాముడితో "ప్రభూ !సమస్త ప్రాణులకూ రాజే సర్వాధికారి . ప్రజలందరినీ సన్మార్గములో నడిపించువాడు రాజే . ప్రజలు అమాయకస్థితిలో వున్నా ,ప్రభువు జాగరూపుడై వారిని పాలించుచు ఉంటాడు . ప్రజల మంచిచెడులకు రాజే కర్త . రఘువీరా !నాయెడ ఎట్టి దోషమూ లేకున్ననూ సర్వార్ధసిద్దుడు అనే పేరు కల భిక్షువు నన్ను తలపై కొట్టెను . "అని పలుకగా 
శ్రీరాముడి ఆజ్ఞతో ద్వారపాలకులు ఆ భిక్షువును అచటికి తీసుకువచ్చిరి . ఆ విప్రోత్తముడు శ్రీరాముని దర్శించి ,"పుణ్యపురుషా !నేను చేయవలసిన కార్యము నాకు దయతో తెలుపుము . (ఇక్కడకు తీసుకు వచ్చిన కారణము తెలుపుము )అని పలుకగా ,శ్రీరాముడు విప్రుడితో "ద్విజోత్తమా !నీవు కఱ్ఱతో ఈ శునకము తలపై కొట్టితివి . అలా కొట్టుటకు ఇది నీకు చేసిన అపకారమేమి ?"అని ప్రశ్నించగా ,ఆ విప్రుడు "స్వామీ !బిక్ష దొరకక అసహనంతో భిక్షకై తొరుగుతుండగా ,ఇది దారికి అడ్డముగా ఉండెను . 'తొలగిపొమ్ము తొలగిపొమ్ము'అని నేను మందలించిననూ అది నాకు అడ్డు వచ్చుటచే ,కోపముతో దీనిని కొట్టితిని . ఓ రఘురామా !నా అపరాధమునకు నన్ను శిక్షింపుము . నీ చేతిలో శిక్షింపబడినచో ఇక నాకు నరక భయము ఉండదు . "అని పలుకగా 
శ్రీరాముడు తన సభలో ఆసీనులై ఉన్న వారితో "ఇతనికి ఏమి శిక్ష విధించాలో తెలుపుము "అని పలుకగా వారు "బ్ర్రాహ్మణుడికి మరణశిక్ష విధించరాదు ". అని పలికిరి . అప్పుడు శ్రీరాముడితో సహా అందరూ ఏమి శిక్ష విధించాలా ?అని ఆలోచించుచుండగా శునకము శ్రీరామునితో "రామా !నీవు నాయెడ ప్రసన్నుడవైనచో నేను కోరుకున్న వరమును ప్రసాదించుము . మహారాజా !ఈ బ్ర్రాహ్మణుడిని కులపతిగా (మఠాధిపతిగా )చేయుము . అందునా కౌలంచర మఠమునకు అధిపతిగా చేయుము . "అని పలికెను . శ్రీరాముడు శునకము మాటలు మన్నించి ఆ బ్రాహ్మణుడిని మఠాధిపతి పదవిలో అభిషిక్తుడిని చేసెను . అతడు సంతోషముగా గజమును అధిరోహించి వెళ్లిపోయెను . 
సభలోని వారందరూ ఆశ్చర్యపడుతూ "తేజశ్వీ !రామా !ఆ బ్ర్రాహ్మణుడికి వరము ఇచ్చితివి . మఠాధిపత్యము కట్టపెడితివి . ఇది శిక్షించుట ఎట్లగును ?"అని పలికిరి . శ్రీరాముడు వారితో "శునకము ఆ విధముగా కోరుటలో ఆంతర్యము ఉన్నది "అని పలికెను . పిదప శునకము శ్రీరాముని ప్రేరణతో ఇలా మాట్లాడనారంభించెను . "నేను పూర్వ జన్మలో కౌలంచర మఠమునకు కులపతిగా ఉంటిని . అప్పుడు నేను యజ్ఞ శిష్టాన్నము భుజించుచుండెడివాడను . దేవతలను భూసురులను పూజించుటయందు నిరతుడనై ఉంటిని . దేవతా ప్రసాదములను దాసదాసీజనములకు సముచితముగా పంచుచుండెడివాడను . శుభకర్మలయందు అనురక్తుడనై దేవద్రవ్యమును రక్షించుచుండెడివాడను . ఆ కాలమున నేను సచ్ఛీలుడనై  ఉంటిని . ఐనను నేను ఘోరమైన ఆ అధమ జన్మ పొందవలసి వచ్చినది . ఇక ఈ బ్రాహ్మణుడైతే మిక్కిలి కోపస్వభావము కలవాడు . ఇట్టివాడు మఠాధిపతి అయినచో నరకము తప్పదు . అంతేకాదు ఇతని కారణము ముందు ఏడు తరములు వారు ,తరవాత ఏడు తరముల వారునరకయాతనాలకుగురియగుదురు . 
బ్రాహ్మణుని సొత్తును ,దేవాలయ ద్రవ్యమును కాజేసినవాడు ,స్త్రీ బాలుర ద్రవ్యములు అపహరించువాడు ,ఇతరులకు దానమిచ్చిన ధనమును తిరిగి తీసుకునే వాడు ఆత్మీయులతో సహా నశించును . "అని పలికి ఆ శునకము తన స్థానమునకు వెళ్లిపోయెను . పూర్వజ్ఞానము కలది ,మిక్కిలి మనశ్శక్తి కలది ఐన ఆ శునకము కాశీ నగరమునకు చేరి ,అక్కడ నిరశన దీక్ష వహించి తనువును త్యజించేను . 

రామాయణము ఉత్తరకాండ అధికపాఠం సమాప్తము . 

                                                                                        శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 






No comments:

Post a Comment