Thursday 23 December 2021

రామాయణము , ఉత్తరకాండ ---- అరువదియవ సర్గ

                             రామాయణము 


                           ఉత్తరకాండ ---- అరువదియవ సర్గ 

రోజులు గడిచిపోవుచున్నవి వసంత కాలము వచ్చెను . ఒక నాడు చ్యవన మహర్షిని ముందుంచుకొని వందకు పైగా  తాపసులు శ్రీ రాముని వద్దకు వచ్చిరి . వారందరిని శ్రీ రాముడు ఎంతో సాదరంగా ఆహ్వానించి , సముచితముగా గౌరవించి , వారు ప్రేమ తో తెచ్చిన నదీ తీర్థములను వివిధ ఫలములను , ఎంతో అభిమానంతో స్వీకరించెను . పిమ్మట వారిని సుఖాసీనులని గావించి అంజలి ఘటించి శ్రీ రాముడు వారితో " మహాత్ములారా ! తమరు ఏ కార్యమునకై ఇచటికి విసినారు సావధానుడనై మీ కార్యములను నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నాను . దయతో ఆజ్ఞపించుడు . మహర్షుల మనోరధమును ఈడేర్చుట వలన నాకు పరమానందం కలుగును . ఈ సమస్త రాజ్యము కడకు నా జీవితము మీకే సమర్పితము . ఇది నా పరమాశయము . ఇది సత్యము " . అని పలికెను . 
శ్రీ రాముడి మాటలు విన్న మునులంతా సంతోషంతో " మహోత్తమా ఈ భూమండలమున , నీవు తప్ప అన్యులెవరు ఇట్టి మహోదార వచనములను పలకలేరు . మహా రాజా మిక్కిలి బల పరాక్రమములు కల పెక్కుమంది రాజులను మేము దర్శించి యుంటిమి కానీ వారిలో ఎవ్వరు మేము వచ్చిన పనిని తెలుసుకొని అది అసాధ్యమని భావించిరి . కానీ నీవు మేము వచ్చిన కారణమూ తెలుసుకొనక ముందే మాపై గల గౌరవంతో ప్రతిజ్ఞ చేసితివి . మా కార్యమును నీవు తప్ప మరెవరు నేరవేర్చలేరు . ఋషులకు సంభవించిన ఈ భయంకర పరిస్థితుల నుండి వారిని కాపాడుటకు నీవే సర్వ సమర్థుడవు . 

No comments:

Post a Comment