Monday 27 December 2021

రామాయణము ఉత్తర కాండ -అరువదిమూడవసర్గ

                    రామాయణము 

                    ఉత్తర కాండ -అరువదిమూడవసర్గ 

శ్రీరాముడు పట్టాభిషేకము చేస్తానని చెప్పగా ,శత్రుఘ్నుడు బిడియపడి అన్నతో "మహారాజా !మీ ఆజ్ఞను శిరసావహింతును . "అని పలికెను . పిదప శ్రీరాముడు తగిన ఏర్పాట్లు చేయించి ,ఎంతో వైభవోపేతముగా శ్శత్రుఘ్నుడికి పట్టాభిషేకము చేసెను . అది చూసి బ్రాహ్మణులు ,పౌరులు ఎంతో సంతోషించిరి . కౌసల్య ,సుమిత్ర ,కైకేయి మొదలగు రాజవనితలు శుభాశీస్సులు పలికిరి . ఋషీశ్వరులు ,యమునాతీరవాసులు అంతా లవణాసురుడు హతమయినట్లే తలపోసిరి . 
పిమ్మట శ్రీరాముడు తన తమ్ముడైన శత్రుఘ్నుడిని తన పక్కన కూర్చొండబెట్టుకుని "నాయనా !నేను నీకొక బాణమును ఇచ్చుచున్నాను . ఇది మిక్కిలి దివ్యమైనది . శత్రుపురములను ధ్వంసము చేయుటలో అమోఘమైనది . శ్రీ మహావిష్ణువు ప్రళయ కాలములో శయనించియున్నప్పుడు ,దుర్మార్గులైన మధుకైటభులు విజృంభించగా వారిని వధించుటకు శ్రీ మహావిష్ణువే దీనిని సృజించెను . ఈ విషయము  సురాసురులకుసైతము తెలియదు . ఆ కారణముగా ఈ శరము ఏ ప్రాణికీ కనిపించదు . శత్రుఘ్నా !ఈ శరము వలన సమస్త ప్రాణులకు భయభ్రాంతులు కలుగుతాయి . ఆ కారణము చేతనే నేను రావణసంహార సమయములో కూడా ఈ శరమును ప్రయోగించలేదు . సోదరా !ఆదిదేవుడైన పరమేశ్వరుడు మధురాక్షుసుడికి ఒక ఉత్తమోత్తమమైన మహా శూలమును అనుగ్రహించాడు . అది మధురాక్షుడి కుమారుడైన  లవణాసురుడికి సంక్రమించింది . అతడు ఆ శూలమును తన భవనము నందు ఉంచి ,నిత్యమూ పూజించుచున్నాడు . పిమ్మట అతడు అన్ని దిక్కులు తిరిగి తనకు నచ్చిన ఆహారమును వేటాడి తెచ్చుకొనును . ఎవరైనా యుద్ధమునకు వచ్చినప్పుడే ఆ శూలమును తీసుకొని శత్రువులను భస్మము చేయును . మిగిలిన సమయములలో అది అతడి భవనములోనే సురక్షితముగా ఉండును . కావున శతృఘ్నా !అతడు తన భవనమున ప్రవేశించక ముందే నీవు అతడిని యుద్ధమునకు ఆహ్వానించి ఆ రాక్షసుడిని సంహరింపుము . అన్యధా అతడి వధ అసాధ్యము "అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                                                                               శశి ,

                                                                                                  ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment